తాడేపల్లి: సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, నకిలీ మద్యం కేసులతో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కూటమి ప్రభుత్వం దానిపై ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై అక్రమ కేసులు నమోదు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను నొక్కడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి వెళ్లకుండా చేయొచ్చన్న కుట్రతో సాక్షిపై అక్రమ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ లిక్కర్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాల్లో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని, దానిపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక వార్తలు రాసిన జర్నలిస్టులపైనే నకిలీ లిక్కర్ తయారు చేశారని అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసే కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతులను ఎంతోకాలం నొక్కలేరని స్పష్టం చేశారు. వారు ఇంకా ఏమన్నారంటే... ● ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, ప్రజా సమస్యలను పరిష్కరించలేక పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఒకపక్క సోషల్ మీడియాను టార్గెట్ చేసి వందల మందిని అరెస్ట్ చేసి అక్రమ కేసులతో నెలలపాటు జైళ్లలో నిర్బంధించారు. ఇంకోపక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సాక్షి మీడియా మీద దాడులకు పాల్పడుతున్నారు. సాక్షి పత్రికల్లో పనిచేస్తున్న ఎడిటర్ల నుంచి కింది స్థాయి కంట్రిబ్యూటర్ల వరకు ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. గతంలోనూ జనసేన, టీడీపీ కలిసి సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. ఏలూరు లాంటి ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టాడు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతుంది. లిక్కర్ కేసులో సెర్చ్ వారంట్ లేకుండా గతంలోనే ఒకసారి సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి ఇబ్బందికి గురిచేశారు. తాజాగా నెల్లూరులో కల్తీ మద్యం తాగి ఒక వ్యక్తి చనిపోయాడని రాస్తే నెల్లూరు బ్యూరో ఇన్చార్జీ తో పాటు ఒక కంట్రిబ్యూటర్ ఇంటి మీద దాడి చేసి వేధించారు. కల్తీ మద్యం గురించి వార్త రాసిన జర్నలిస్టుపైనే ఆ కల్తీ మద్యం తయారు చేస్తున్నాడని అక్రమ కేసు పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా గతంలో ఇలాగే గంజాయి కేసులు పెడితే హైకోర్టు చీవాట్లు పెట్టడంతోపాటు సీబీఐ విచారణకు ఆదేశించింది. కూటమి నాయకుల దగ్గర స్వామి భక్తి చాటుకునేందుకు పోలీసులు ఖాకీ డ్రెస్సు పక్కనపెట్టి పచ్చ చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో మీడియా స్వేచ్ఛ పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈటీవీ, ఏబీఎన్ ఛానెళ్లు పత్రికలు ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై బురదజల్లడానికి అసత్య కథనాలను ప్రసారం చేశాయి. వైయస్ఆర్‌సీపీ హయాంలో 30వేల మంది అమ్మాయిలు అపహరణకు గురయ్యారని విష ప్రచారం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. అయినా ఆ సంస్థల కార్యాలయాలపై ఏనాడూ నాటి వైయస్ జగన్ ప్రభుత్వం సోదాల పేరుతో దాడులు చేయలేదు. కేసులు పెట్టి వేధించలేదు. కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రశ్నించే గొంతులను అణచివేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నది. తాము చెప్పిందే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పని చెప్పిన వారి మీద అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. ● కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పినా.. విజయవాడ వరదల సందర్భంగా కొవ్వొత్తులు అగ్గిపెట్టలకు రూ.25 కోట్లు ఖర్చు చేశారని ప్రభుత్వం చెప్పిన విషయాలనే ప్రచురిస్తే సాక్షి మీద కేసులు పెట్టారు. విలేకరుల మీద దాడులు చేసి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి తయారు చేయిస్తున్న నకిలీ మద్యం కుంభకోణాన్ని వెలికితీసినందుకు సాక్షి మీడియాపై, పత్రికా విలేకరులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం సాక్షి విలేకరులపైనే 17 అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో సాక్షిపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టంగా చెప్పినా దానికి వీరు కొత్త భాష్యం చెబుతున్నారు. ఒక్క కేసులో రెండు రోజుల వ్యవధిలో విచారణ పేరుతో ఏడు సార్లు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సాక్షిని బెదిరించి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడం ద్వారా ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని పదే పదే కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, డీజీపీని కోర్టుకి పిలిపిస్తామని హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు మూసేస్తే బాగుంటుందని రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందంటే పోలీసులు ఏ విధంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయినా ఈ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు. వరుసగా చీవాట్లు తింటున్నా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవడం లేదు. ఇకనైనా పౌర హక్కులను ఎలా కాపాడాలి, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. నియంతలా వ్యవహరిస్తే కాలగర్భంలో కలిసిపోతాడని చంద్రబాబుని హెచ్చరిస్తున్నా. ● అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డిని విచారణ పేరుతో అరెస్ట్ చేయాలన్న కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే విజయవాడ, నెల్లూరు నుంచి పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు వాటిపై విచారించి ప్రభుత్వం తన పనితీరు మెరుగుపర్చుకోవాల్సింది పోయి ఇలా మీడియా గొంతు నొక్కే విధంగా వ్యవహరించడం చాలా తప్పు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులైపారుతోందని వైయస్ఆర్‌సీపీ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా దానిపై విచారణ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం దుర్మార్గం. కుటీర పరిశ్రమలా ఎక్కడికక్కడ నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తున్నారు. దానిపై ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, సాక్షి మీడియా మీద అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. దీనికి వైయస్ఆర్‌సీపీ ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకుల దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి పెరిగిపోయింది. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. డీజీపీ ఇప్పటికైనా కళ్లు తెరిచి చట్టబద్ధంగా వ్యవహరించాలి. లేదంటే న్యాయస్థానాల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నా. ● నకిలీ లిక్కర్‌పై సమాధానం చెప్పుకోలేక... సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తున్న సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు పెట్టి ఇష్టానుసారం కొడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలలుగా రాష్ట్రం నలుమూలలా నిత్యం అకృత్యాలు జరుగుతూనే ఉన్నా అరికట్టే ప్రయత్నం చేయకుండా అక్రమ కేసులు పెట్టి వైయస్ఆర్‌సీపీనాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో భూములు అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. లూలూకు భూముల కేటాయింపుపై వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని కేబినెట్ మీటింగ్‌లో పవన్ కళ్యాన్ అడిగారంటే మీరు చేసే పనులు మీ మంత్రి వర్గానికే నచ్చడం లేదని అర్థమవుతుందన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, టీడీపీ నాయకులు తయారు చేస్తున్న నకిలీ లిక్కర్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా అక్రమ కేసులతో సాక్షి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఇలాగే నియంతలా వ్యవహరించిన ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బయటకు రావాలి.