పలాస: తప్పుడు కేసులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఖండించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ శుక్రవారం పలాసలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నివాసానికి వెళ్లారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన అప్పలరాజును కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ.. ప్రజా సేవలో చురుకుగా ఉన్న సీదిరి అప్పలరాజుపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ విధమైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అప్పలరాజుకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ అణచివేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో దీనికి తగిన గుణపాఠం చెబుతారని ధర్మాన కృష్ణ దాస్ ఈ సందర్భంగా హెచ్చరించారు. మాజీ మంత్రి సీదిరి ని కలిసిన వారిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.