విశాఖపట్నం: తీవ్ర సంక్షోభంలో ఉన్న విమానయానరంగ సమస్య పరిష్కారంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ల్ ( ఎఫ్ డీ టీ ఎల్) అమలు చేయడం వల్ల తలెత్తిన ఇబ్బందులను గుర్తించి, పరిష్కరించలేకపోయిన పౌరవిమానయానశాఖ వైఫల్యం వల్లే .. ప్లైట్స్ రద్దై లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ... ఈ సమస్యను లోకేష్ వార్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నాడంటూ టీడీపీ అధికార ప్రతినిధులు జాతీయ మీడీయాలో చేసిన కామెంట్లతో దేశంలో తెలుగువాడి పరువు, ప్రపంచంలో దేశం పరువు మంట గలిసిందని ఆక్షేపించారు. ఇండిగో ఎయిర్ లైన్స్ సమస్య పరిష్కారంలో విఫలమవడంతోపాటు, ఇష్టమొచ్చినట్లు టిక్కెట్లు రేటు పెంచిన విమానయానసంస్ధలను అదుపుచేయడంలోనూ కేంద్రమంత్రి విఫలమయ్యారని తేల్చి చెప్పారు. తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేసి ప్రయాణికులకు ఇబ్బండి లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ● విఫలమైన కేంద్ర పౌరవిమానయానశాఖ... విమానయాన చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. దీనికి కారణం ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్ద ఒక ఎత్తైతే ... రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు రెగ్యులేషన్స్ అమలు చేయడం వల్ల తలెత్తిన పరిస్థితులు, ఇబ్బందులను అంచనా వేయడంలో విమానయానశాఖ వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీ ఎంపీ ఈ శాఖకు కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో.. ఆ పార్టీ అధికార ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు చూసిన తర్వాత.. దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు రెండూ మంటగలిశాయి. వాస్తవానికి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రా నుంచి కేంద్ర మంత్రిగా ఎంపికైనప్పుడు.. మన ప్రాంతానికి మంచి అవకాశం వచ్చిందని అందరం సంతోషించాం. కానీ గడిచిన 18 మాసాలుగా ఎప్పడూ చూడని పరిస్థితులు చూస్తున్నాం. జూన్ 12న చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో 232 మంది ప్రయాణికులు, విమానం కూలిన ప్రాంతంలో దాదాపు 30మంది వైద్య విద్యార్ధులు చనిపోయారు. ప్రపంచ విమానప్రమాదాల్లో ఇది చాలా పెద్ద ఘటన. దీనిపై అప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద విమర్శలు వచ్చాయి. అటువంటి పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడకు కూడా వెళ్లి కేంద్రమంత్రి రీల్స్ చేసారన్న అపవాదు కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా ఆయనపై జాతీయ మీడియా ఛానెల్స్ లో సైతం విమర్శలు వచ్చాయి. తాజాగా గడిచిన మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... దేశ ప్రజలకు, ఇబ్బందులు పడుతున్న విమానయానప్రయాణికులుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత విమానయానమంత్రిత్వశాఖ మీద ఉంది. ● జాతీయ స్ధాయిలో పరువుతీసిన టీడీపీ అధికార ప్రతినిధులు... ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు టీడీపీ అధికార ప్రతినిధులు విమానయానరంగంలో వచ్చిన సంక్షోభాన్ని మా నేత లోకేష్ పర్యవేక్షిస్తున్నారని జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారు. అసలు లోకేష్ కి కేంద్ర పౌరవిమానయానసంస్ధకు ఏమి సంబంధం? దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రకేబినెట్ లో ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన దేశంలో ఉన్న పౌరవిమానయానశాఖను పర్యవేక్షిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధులు జాతీయ మీడియా చర్చల్లో సిగ్గులేకుండా చెబుతున్నారు. దేశంలో దాదాపు 6-7 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్ధానాలు చేరడానికి విమానాశ్రయాల్లో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే... తండ్రిని కోల్పోయిన బిడ్డ... ఆఖరు చూపులకు వెళ్లడానికి కూడా అవకాశం లేని పరిస్ధితుల్లో నిస్సహాయంగా మిగిలిపోయారు. పెళ్లి చేసుకుని కొత్త జంట రిసెప్షన్ కి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో.. అతిధులందరూ వచ్చినా వీరు మాత్రం వెళ్లడానికి అవకాశం లేక విమానాశ్రయంలోనే ఉండిపోయారు. చివరకు వీడియా కాల్ ద్వారా ఎయిర్ పోర్ట్ నుంచే తమ రిసెప్షన్ కి వచ్చిన వాళ్లను పలకరించాల్సి వచ్చింది. వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్లూ ఎయిర్ పోర్టుల్లో నిలిచిపోయారు. ఫ్లైట్ డ్యూటీ నార్మ్స్ అనే రెగ్యులేషన్స్ తీసుకొచ్చినప్పుడు వాటి వల్ల వచ్చే ఇబ్బందులేంటి, వాటి వల్ల ప్రయాణికులకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయన్నది అంచనా వేయాల్సిన బాధ్యత కేంద్ర పౌరవిమానయానశాఖదే. కమర్షియల్ ఫ్లైట్ మార్కెట్ షేర్ లో 65 శాతం ఉన్న ఇండిగో సంస్ధ.. దాదాపు రోజుకూ 2వేల విమానసర్వీసులు ద్వారా 4-5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్ధానాలకు చేర్చుతుంది. అటువంటిది నిన్న 1000 విమానసర్వీసులు, మొన్న 1000 సర్వీసులు, అంతకముందు రోజు 500 ఫ్లైట్లు రద్దయ్యాయి. ఎఫ్ డీ టీ ఎల్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు.. పైలెట్ల విశ్రాంతి సమయాన్ని 36 నుంచి 48 గంటలు చేశారు. అంటే గతంలో 4 వేల మంది పైలట్లు ఉంటే...ఈ నిబంధనల ప్రకారం అదనంగా మరో 8 వందల మంది కావాలి. అదనంగా 8వందల మంది పైలట్లు ఉంటే.. రెగ్యులర్ ఆపరేషన్స్ జరుగుతాయి. వారు అందుబాటులో లేకపోతే... ఉన్నటువంటి ప్లైట్ ఆపరేషన్స్ నే 25 శాతం తగ్గించుకోవాలి. అంటే 2వేల ప్లైట్లు రోజుకు నిర్వహించుకంటే.. అందులో 500 సర్వీసులు రద్దు చేసుకోవాలి. అప్పుడే ఆపరేషన్స్ సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. ఫైలట్లు సంఖ్య తగినంతగా లేదని తెలిసినా.. ఇవ్వాల్సిన రూట్ పర్మిషన్స్ ముందే ఇచ్చేసి.. ఇవాళ మేం వార్ రూమ్ పెట్టి మానిటరింగ్ చేస్తున్నామని చెప్పడం వలన ఉపయోగం లేదు. దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క విశాఖలోనే 12 విమానసర్వీసులు రద్దయ్యాయి. ఇవాల విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే... రూ.26 నుంచి రూ.30వేలకు టిక్కెట్లు అమ్మతుంటే.. విశాఖ నుంచి ఢిల్లీకి ఒకవైపు జర్నీకే రూ.50వేలు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ లేదు. కేంద్రమంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ● రీల్స్ చేయడం మినహా కేంద్రమంత్రి సాధించిందేమిటి? ఢిల్లీ నుంచి శ్రీకాకుళం వెళ్లేటప్పుడు.. మా ప్రభుత్వం నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి, నెత్తిన ఓ హెల్మెట్ పెట్టుకుని నాలుగు రీల్స్ చేసుకుని వెళ్లడం మినహా.. ఇంతకుమించి పౌరవిమానయానశాఖ మంత్రి సాధించిందేమీ లేదు. జూన్ లో విమాన ప్రమాదం, ఇప్పుడు లక్షలాది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా... పట్టింపులేదు. ఎప్పటి నుంచో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న విజయవాడ విమానాశ్రయాన్ని మాత్రం ఒక్కసారి కూడా పరిశీలించరు, తనిఖీ కూడా చేయరు. ఆ ఎయిర్ పోర్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. అవి పూర్తిచేయడం లేదు. రాజధాని అమరావతి.. దానికి సంబంధించిన విజయవాడ ఎయిర్ పోర్టు పనుల మీద పరిశీలన ఉండదు. బోగాపురం ఎయిర్ పోర్టు కర్త, కర్మ, క్రియ వైయస్.జగనే, దాదాపు 2700 ఎకరాల భూమి సేకరించాం. 4-5 గ్రామాలకు పునారావసంలో భాగంగా రూ.500 కోట్లతో నిర్మాణాలు చేపట్టాం, పరిహారం కూడా ఇచ్చాం. జీఎమ్మార్ సంస్థకు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు తెచ్చిపెట్టాం. ఎయిర్ పోర్ట్ కు అవసరమైన భూమిని అప్పగించాం. డిసెంబరు 3,2023లో శంకుస్థాపన చేసేటప్పటికే అన్ని అనుమతులు తెచ్చాం. రెండున్న, మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పాం. 2024 జూన్ 4 న మా ప్రభుత్వం దిగిపోయేనాటికి 35 శాతం పనులు పూర్తి చేశాం. అది కొనసాగుతుంది. మీరు చూసినా, చూడకపోయినా పనులు ఆగవు. అది మా కమిట్‌మెంట్. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తికి దాదాపు ముఖ్యమంత్రితో సమానమైన ప్రోటోకాల్ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చాలా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి,ఆయన కుమారుడు లోకేష్ మాత్రమే ఉంటారు. కేంద్రమంత్రి కింద కూర్చొంటాడు. అంటే ఈయనే కావాలని కూర్చుంటున్నాడా? లేదంటే మీ విలువ ఇదేనని ఆయన్ను కూర్చొబెడుతున్నారా? అర్ధం కావడం లేదు? చంద్రబాబును, లోకేష్ ని జాకీలు పెట్టి లేపే కార్యక్రమం చేస్తున్నారు. అదేమీ టీవీ5 సాంబశివరావు షో కాదు కదా? దేశంలోని ప్రముఖ నేషనల్ మీడియా ఛానెల్స్ లో మీరు లోకేష్ ని జాకీలెత్తి లేపే కార్యక్రమం చేస్తే.. దేశవ్యాప్తంగా ఏ రకంగా గౌరవిస్తున్నారో చూస్తే అర్ధం అవుతుంది. ఎక్స్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో మన బాగోతం బయటపడుతుంది. ● విమానయాన సంస్థల నియంత్రణలో వైఫల్యం... ఎఫ్ డీ టీ ఎల్ నిబంధన చాలా ముఖ్యమైనది. కోర్టు ఆదేశాలను ఆధారంగా చేసుకుని ఈ నిబంధన తీసుకొచ్చారు. శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఉత్తరాదిలోనూ ఇతర ప్రాంతాల్లోనూ విమానాలు ఆలస్యం కావడం సహజం. ఈ నిబంధనలు తీసుకొచ్చినప్పుడు సిబ్బందిని పెంచుకోవడమూ, రూట్స్ తగ్గించుకోవడమూ చేయాలి. అలా కాకుండా కేంద్ర మంత్రి ఈ నిబంధనను ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. దేశంలో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్న వారి భద్రతను ఫణంగా పెట్టి మీరిచ్చిన నిబంధనలనే పక్కనబెడతారా? 2010లో దుబాయ్ నుంచి మంగుళూరు వచ్చిన ఫ్లైట్ కూలిన ఘటనలో 150 మంది చనిపోయారు. దానికి కేవలం ఫైలెట్ కు తగిన విశ్రాంతి లేకపోవడమే కారణం. ఆయనకు తగిన విశ్రాంతి లేకపోవడం వల్లే ఆ దుర్ఘటన జరిగింది. అలాంటిది మీరిచ్చిన ఆదేశాలను మీరే వెనక్కి తీసుకుంటారా? ఇండిగోతో మీకున్న లాలాచీ ఏమిటి? ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కొన్ని వ్యవస్థలు ఉండడం వల్ల వస్తున్న ఇబ్బందులు. దేశంలో అన్ని విమానయానసంస్ధలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు... ప్రభుత్వ ఆధీనంలో ఒక్కటీ లేదు. పౌరవిమానయానశాఖ, డీజీసీఏ తప్ప ఎయిర్ లైన్స్ ఏవీ ప్రభుత్వ ఆధీనంలో లేవు. దాని వలన నియంత్రణ లేకుండా పోయింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లాలంటే రూ.70వేలు, బెంగులూరు నుంచి ముంబాయికి రూ.40వేలు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ర.60వేలు టిక్కెట్ ధరలు ఉంటే.. నియంత్రణ ఎక్కడ ఉన్నట్టు? పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఏం చేస్తున్నట్టు? ప్రయాణికుల పరిస్థితి ఏంటి? విమానయానం పేదవాడికి చేరువ చేయాలన్న ఆలోచన ప్రభుత్వాలకి ఉండాలే తప్ప... ఈ రకమైన పరిస్థితులు తీసుకొచ్చి ఒక సంస్థకు కొమ్ముకాస్తే దేశంలో ఇలాంటి పరిస్ధితులే ఏర్పడతాయి. ఎయిర్ పోర్టులో తన కుమార్తెకు ఒక సానిటరీ న్యాప్ కిన్ కూడా ఇప్పించుకోలేని స్ధితిలో ఓ తండ్రి ఉన్నాడంటే.. పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఈ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి ఇప్పటికైనా కేంద్రమంత్రి రీల్స్ చేయడం ఆపి, ఎవరో చేసిన పనులను తమ ఖాతాలోవేసుకునే క్రెడిట్ చోరీ ఆపి,చంద్రబాబును, ఆయన కుమారుడిని జాకీలెత్తి లేపే కార్యక్రమానికి స్వస్తి పలికి, దేశ ప్రజల ప్రయోజనాల మీద శ్రద్ద పెట్టాలని కోరుతున్నాను. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 9500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. 42 విభాగాలను ప్రైవేటు పరం చేసి.. స్థానిక కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. కేంద్ర మంత్రి గారు ఇలాంటి అంశాల మీద దృష్టిపెట్టాలి. విశాఖకు గర్వకారణమైన స్టీల్ ప్లాంట్ ను కాపాడే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల, టీడీపీ ప్రచార పిచ్చి వల్ల తెలుగువారి పరువు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దేశం పరువు తీసేసిన ఘతన టీడీపీకి, కేంద్రమంత్రికే దక్కుతుంది. సిగ్గులేకుండా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మంచి, చెడు దేనికైనా లోకేష్ పేరు చెప్పడం టీడీపీ నేతలకు అలవాటుగా మారింది. ఇకనైనా ప్రయాణికులు ఇబ్బందిపడకుండా చూడ్డంతో పాటు .. దేశంలో తెలుగువారి పరువు పోకుండా వ్యవహరించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ సూచించారు. ● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... కేంద్రమంత్రి సమర్ధుడా, అసమర్థుడా అన్నదానిపై దేశ ప్రజలేమనుకుంటున్నారే చూడండి. మా పార్టీ తరపున కూడా సమస్య పరిష్కారంలో విఫలమైన కేంద్రమంత్రి రాజీనామా చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న దీపం అనే సంస్థ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100 శాతం డిజిన్వెస్ట్ మెంట్ చేయాలన్న ఆలోచనలో మార్పు లేదని చెప్పింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించి, 32విభాగాలను ప్రైవేటీకరణ చేసి, ఉద్యోగుల జీతాలు తగ్గించిన తర్వాత.. కేంద్రం ఎటువైపు అడుగులు వేస్తున్నట్టో ఇట్టే అర్ధం అవుతుంది. ఇదే విషయం సీఎం చంద్రబాబును అడిగితే మీడియా మీద కూడా రంకెలు వేస్తున్నారు. అది ఆయన అలవాటు అని అమర్ స్పష్టం చేశారు.