అక్రమాలకు వేదికగా కూటమి ప్రభుత్వం

రాజమండ్రిలో బట్టబయలైన అధికార పార్టీ మద్యం సిండికేట్ 

పట్టణ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో సిండికేట్ చర్చలు

ఎక్సైజ్ అధికారులనూ భాగస్వామ్యం చేస్తున్న అధికార పార్టీ నేతలు

అడియో సాక్షిగా అధికార పార్టీ నేతల దందా బట్టబయలు చేసిన మాజీ ఎంపీ మార్గాని భరత్

రాజమండ్రి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్.

మద్యం సిండికేట్ లో రాజమండ్రి టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు  

సిండికేట్ వ్యవహారానికి సూత్రధారి రాజమండ్రి ఎమ్మెల్యే వాసు

చిత్తశుద్ధి ఉంటే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మార్గాని భరత్ 

రాజమండ్రి:  ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేట్ వ్యవహారాలతో అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ఆధ్వర్యంలో లిక్కర్ సిండికేట్ బరితెగించి అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలో ఉన్న 39 మద్యం షాపుల సిండికేట్ కు సంబంధించిన ఆడియో సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలను భరత్ బయటపెట్టారు. రేట్లు పెంపుదల, బెల్టు షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూళ్లు గురించి నిస్సిగ్గుగా చర్చిస్తున్న  టీడీపీ రాజమండ్రి పట్టణ అధ్యక్షుడితో పాటు అతని వెనుకున్న ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని  భరత్ డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

● అధికార పార్టీ అక్రమాలకు వేదికగా రాజమండ్రి...

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి అక్రమాలకు వేదికగా మారుతుంది. లేని మద్యం స్కామ్ ని తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేసి 71 రోజులు  జైల్లో పెట్టింది. రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమండ్రి లోనూ, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి నియోజకవర్గం రాజమండ్రి రూరల్ లో 39 మద్యం షాపులకు సంబంధించి సిండికేట్ మీటింగ్ కు సిద్దం అయ్యారు. దీనికి సంబంధించి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు  మజ్జి రాంబాబు ఫోన్ సంభాషణ ద్వారా.. అధికార పార్టీ నేతలు సిగ్గులేని తనం బయటపడింది.

● అక్రమాలకు బాండు పేపర్లు...

మద్యం రేట్లు పెంచుకోవడం, బెల్టు షాపులు ఏర్పాటు, సిండికేట్ వ్యాపారం ఎలా చేయాలన్న విషయాలతో పాటు ఈ దందాలో ఎక్సైజ్ అధికారులను కూడా ఎలా భాగస్వామ్యం చేయాలని చర్చించుకున్న ఆడియో బయటపడింది. దీనికి సంబంధించి రూ.100 బాండ్ పేపరు మీద సంతకాలు చేద్దామంటూ నిస్సిగ్గుగా ప్రతిపాదనలు సైతం సిద్దం చేసుకుంటున్నారు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్   37 ఏ, 39 బై 1, 2 సెక్షన్లు ప్రకారం వీరిని నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. మజ్జి రాంబాబుతో పాటు అతని వెనుక కచ్చితంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆతనిని కూడా అరెస్టు చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ అధికారులకు లంచాలిద్దామంటూ నేరుగా చెబుతున్నాడు. దీనికి బీ ఎన్ ఎస్ 274, 276 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

● ఎమ్మెల్యే అండతోనే సిండికేట్ మంతనాలు...

కూటమి పెద్దలు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ నీచమైన పనులు. సిండికేట్ నిర్వహణకు ఎంత పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారంటే... ఎక్సైజ్ అధికారులు ఎవరిమీద కేసు పెట్టాలో కూడా డ్రా తీసి వీళ్లే నిర్ణయిస్తామని చెబుతున్నారు. డ్రా లో కేసు వచ్చిన షాపు కేసుకి సంబంధించి కట్టాల్సిన ఫైన్ మాత్రం సిండికేట్ అందరూ భరించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రెండు సార్లు ఒకే షాపు మీద కేసులు వస్తే... ఆ షాపు క్లోజ్ అవుతుంది కాబట్టి వంతులవారీగా ఏ మద్యం షాపు మీద కేసు నమోదు చేయాలన్నది కూడా సిండికేటే నిర్ణయిస్తుంది. అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండ లేకుండా అధికారులను సైతం ప్రభావితం చేయడం వీరికి సాధ్యమా?

జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు తప్పు చేశాడని ఏ విధంగా అయితే పార్టీ నుంచి బహిష్కరించారో.. అదే విధంగా మీ  భాగస్వామి చంద్రబాబు పార్టీకి చెందిన రాజమండ్రి సిటీ అధ్యక్షుడిని కూడా బహిష్కరించాలి. లేని లిక్కర్ కేసులో మా పార్టీ ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇవాళ మీ పార్టీ నేతలు బహిరంగంగా దొరికిపోయారు దీనికేం సమాధానం చెప్తారు ? అధికార పార్టీ లిక్కర్ సిండికేట్ కోసం అన్ని అక్రమాలకు గేట్లు బార్లా తెరిచారు. ఇదంతా రాజమండ్రి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుంది. చంద్రబాబు రాజమండ్రి ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి. 

● మద్యం అసలా, నకిలీయా తేల్చాల్సింది ప్రభుత్వమే..

రాష్ట్రంలో నకిలీ మద్యం ప్రజల ప్రాణాలను హరిస్తుంది. నకిలీ మద్యం తయారీలో చంద్రబాబుకి సైతం భాగస్వామ్యం ఉంది. లేకపోతే ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున స్కామ్ కు పాల్పడుతున్న వీళ్లందరినీ అండమాన్ లోనై, తీహార్ జైలుకో పంపించాలి. 
కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ... మరలా ప్రతిపక్ష పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ... మద్యం కొనుగోలు చేసే ముందు పోన్ లో స్కాన్ చేసి అది అసలా ? నకిలీయా ? అని టెస్ట్ చేయమంటున్నారు. రూ.100 చీప్ లిక్కర్ కొనే వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా ? మద్యం షాపుల్లో అమ్మే మందు అసలా, నకిలీయా అని తేల్చాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ఆ పని చేయకుండా గాడిదలు కాస్తుందా ? వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క బెల్టుషాపు లేదు, 8 గంటల దాటిన తర్వాత షాపులు కచ్చితంగా మూసివేసేలా చర్యలు తీసుకుంటే... టీటీపీ హయాంలోని రాష్ట్రంలో బెల్టు షాపులు ద్వారా మద్యం ఏరులై పారుతుంది. 

● పీ-4 అటకెట్టి, పీ-3(పీపీపీ) పేరుతో మెడికల్ కాలేజీల అమ్మకం..
 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నకిలీ మద్యం తయారీ తో పాటు సూపర్ సిక్స్ హామీల వైఫల్యంపైనా మా పోరాటం కొనసాగుతుంది. చివరకు ఈ ప్రభుత్వం పథకాలు కూడా చోరీ చేస్తూ... వైయస్.జగన్ హయాంలో ఇచ్చిన పథకాలకు పేరు మార్చి.. అది తమ మనసులో పుట్టిన పథకం అని ప్రచారం చేసుకుంటున్నారు. అయినా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. నిన్నటి వరకు సంపద సృష్టిస్తాను, పేదరికాన్ని నిర్మూలిస్తానని పీ -4 పేరుతో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు  పీ పీ పీ పేరుతో పీ-3 చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకానికి పెట్టాడు. తన పరిపాలన కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించని చంద్రబాబు... ఒకే దపా ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి  వైయస్.జగన్ శ్రీకారం చుడితే వాటిని ఎలా అమ్మకానికి పెడతారు. 

● వైయస్.జగన్ హాయంలోనే డేటా సెంటర్...

విశాఖలో ఏర్పాటు చేస్తున్నది  గూగుల్ ఆదానీ ఎయిర్ టెల్ డేటాసెంటర్. దీనితో పాటు ఐటీ పార్కు తీసుకురావాలి, స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని వైయస్.జగన్ విశాఖలో 130 ఎకరాల స్థలం ఇచ్చి ఏంఓయూ చేసుకున్నారు. గతంలో రూ.23 వేల కోట్ల పెట్టుబడులతో 25 వేల ఉద్యోగాలతో 2021లో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్స్ పోలో ఆదానీ డేటా సెంటర్ తో ఎంఓయూ చేసుకుని, 2023 మే నెలలో శంకుస్థాపన కూడా చేశారు. వైయస్.జగన్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను మేం ప్రజలకు పూర్తిగా చెప్పలేకపోయాం. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలను బురిడీ కొట్టించడంలో ముందుంటారు. ఒక బిల్డింగ్ కట్టి హైటెక్ సిటీ నేనే కట్టానని చెప్పుకోవడం వారికి అలవాటు.  వైయస్.జగన్ హయాంలో రాష్ట్రంలో అత్యంత విప్లవాత్మమైన అభివృద్ధి పనులు చేపట్టారు. 

రాజమండ్రి వేదికగా టీడీపీ నేతల లిక్కర్ సిండికేట్ పై కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఆడియో ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్న భరత్.. సిండికేట్ నిర్వహిస్తున్న అధికార పార్టీ నేతల వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయడంతో పాటు వారి వెనుక ఉన్న స్థానిక ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Back to Top