నంద్యాల: కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎం. ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నంద్యాల పట్టణంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకువచ్చిన 17 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కొంత మందికే లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి, గవర్నర్‌ను కలసి ప్రజల గొంతుగా వినిపించేందుకు సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు.