ఎమ్మెల్యే దగ్గుపాటి  కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు 

అనంత‌పురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం ఫైర్‌

అనంతపురం: ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని  అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం మండిపడ్డారు.  మంగళవారం నగరంలోని 32 వ డివిజన్లో ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయ‌ర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నగరంలో అభివృద్ధి జరగలేదని కనీసం నిధులు కేటాయించలేదని అవగాహన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందని తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులను తీసుకురావడమే కాకుండా తాము నగరంలో అభివృద్ధిని చేసి చూపించామనే విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రత్యేక  గ్రాంట్ ద్వారా 25 కోట్ల నిధులను అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తీసుకువచ్చారన్నారు. మూడు విడతల్లో పనులు చేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇందులో సోమనాథ్ నగర్ బ్రిడ్జి కూడా టెండర్లు పిలిచామని ఎన్నికల రావడంతో ఆగిపోయాయని  గత 16 నెలల నుంచి దానిని పట్టించుకోకుండా  వైఎస్ఆర్సిపి మీద బురద జల్లుతున్నారన్నారు.  నడిమి వంక మీదుగా కేవలం వైయ‌స్ఆర్‌సీపీ వాళ్లు మాత్రమే ఆక్రమించుకున్నారని మాట్లాడుతున్నారని తెలుగుదేశానికి చెందిన నేతలు ఇప్పటికి కూడా నిర్మాణాలు చేస్తున్నారని ఎందుకు తొలగించ లేదని ప్రశ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో  అనేక అభివృద్ధి పనులను అనంతపురం నగరంలో చేసి చూపించామన్నారు. కనీస అవగాహన లేని ఎమ్మెల్యే కేవలం గత ప్రభుత్వం పై బురదజల్లే వ్యవహారం చేస్తున్నారని తెలిపారు.  నీరు ప్రగతి పార్కులో  కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచడానికి, చిన్నచిన్న మరమ్మతులు చేయడానికి 17 లక్షల వరకు ఖర్చు చేసి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఏమాత్రం తెలుసుకోకుండా  కోట్లు ఖర్చు చేశారని అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. అనంతపురం అభీవృద్ధికి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏ మాత్రం నిధులు తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లు అద్వాన్నంగా మారాయి అన్నారు. వాటికి సంబంధించి ప్రత్యేక గ్రాంట్ ను ఎందుకు తీసుకు రాలేకపోయారని తెలిపారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉన్న పట్టించుకోలేదని విమర్శించారు.

Back to Top