తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో చురుగ్గా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఇంటింటా పర్యటించి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఉద్యమం పొరుగు రాష్ట్రానికి చేరింది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో బెంగళూరులో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఐటీ వింగ్ ఆధ్వర్యంలో బెంగళూరులోని శబరి ఆశ్రయ ధామలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి ఏపీకి చెందిన ప్రజలతో సంతకాలు సేకరిస్తున్నారు. ఈ ఉద్యమానికి ఐటీ ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏపీకి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఈ శిబిరంలో పాల్గొని సంతకాలు చేసి కూటమి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా ఐటీ వింగ్ నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజల నుంచి కూడా సంతకాలు సేకరించాలని ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి చెందిన ఐటీ ఉద్యోగులు, వివిధ వృత్తులు చేస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ శిబిరంలో సంతకాలు చేస్తున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.