అనుభవం లేని సంస్థకు అంబులెన్స్‌ల బాధ్యత అప్పగిస్తారా? 

చంద్ర‌బాబు సర్కార్‌పై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్ర‌హం

తాడేపల్లి: ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణాలు కాపాడే 108, 104 అంబులెన్స్‌ల బాధ్యత అప్పగిస్తారా? అంటూ మాజీ మంత్రి విడుదల రజిని ప్ర‌భుత్వాన్ని నిలదీశారు. 108, 104లను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవటం దారుణమని ఆమె త‌ప్పుప‌ట్టారు.  తమ సంపదను పెంచుకోవటానికి ఆంధ్రుల లైఫ్ లైన్ లాంటి 108, 104లను వాడుకుంటున్నారంటూ విడుదల రజిని దుయ్యబట్టారు. 108, 104ల నిర్వహణ కాంట్రాక్టును టీడీపీ నేతకు కట్టబెట్టటంపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి మండిపడ్డారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. 

ఎక్స్ వేదిక‌గా విడ‌ద‌ల ర‌జినీ.. 
‘‘వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలో ఆ అంబులెన్సుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటోంది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ కాలంలో అనేక కొత్త అంబులెన్సులను తెచ్చాం. సాంకేతికంగా కూడా వాటిని మరింత అభివృద్ధి చేసి 24x7 అందుబాటులో ఉంచాం. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో మేళ్లు చేశాం. ఆ అంబులెన్సుల ద్వారా పల్లెలు, పట్టణాల్లోని ప్రజలకు అత్యసవర పరిస్థితుల సమయంలో ప్రాణాలు కాపాడటానికి వీలయింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ అంబులెన్సుల కాంట్రాక్టును భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు

ఆ సంస్థ డైరెక్టర్‌ టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ దోనేపూడి. ఆయన గతంలో టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన సంస్థ టర్నోవర్ కేవలం రూ.5.52 కోట్లు మాత్రమే. అలాంటి ఆర్థిక సామర్థ్యం లేని సంస్థకు 108, 104 నిర్వహణ కాంట్రాక్టును ఎలా కట్టబెడతారు?. ఎంతో అనుభవం ఉన్న GVK, EMRI లాంటి సంస్థలను కాదని టీడీపీ నేత సంస్థకు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు?. అనుభవం లేని సంస్థకు బాధ్యత అప్పగించటం అంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టేలా టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టటం సరికాదు. ఈ కాంట్రాక్టు ఇవ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ నెలకు రూ. 31 కోట్ల మామూళ్లు తీసుకుంటోంది’’ అంటూ విడుదల రజని ట్వీట్‌ చేశారు.

Back to Top