పచ్చకామెర్ల మృతుల కుటుంబానికి వైయ‌స్ జ‌గ‌న్‌ ఆర్థికసాయం

బాధిత కుటుంబాలకు రూ. 5 ల‌క్ష‌ల ఆర్థికసాయం అందజేసిన బొత్స సత్యనారాయణ
 

కురుపాం: పచ్చకామెర్లతో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆర్థికసాయం చేశారు. పచ్చకామెర్లతో విద్యార్థులు కల్పన, అంజలి ఇటీవ‌ల మృతి చెందారు. ఇటీవ‌ల ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన వైయ‌స్ జ‌గ‌న్ బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఆ స‌మ‌యంలో రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల‌తో రెండు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేశారు.  

అలా చెప్పుకోవ‌డం సిగ్గుచేటు:  బొత్స‌
మంచి నీరు కలుషితం అయ్యాయి కాబట్టి పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటు అని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  గిరిజ‌న హాస్ట‌ల్ విద్యార్థుల‌ పిల్లల విషయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిల‌దీశారు.  

‘వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జగన్ మానవత్వంతో పచ్చ కామెర్లతో మృతి చెందిన కల్పన, అంజలి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయం అందించారు. గిరిజన విద్యార్థులకు ధైర్యం చెప్పడానికే వైయ‌స్‌ జగన్‌ కేజీహెచ్‌కు వెళ్లారు. దాన్ని కూడా రాజకీయం చేస్తారా?. ఆసుపత్రిలో ఉండి కూడా చిన్నారులు చనిపోతున్నారు. విద్యార్థులకు అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యత కాదా?. ఇంత బలహీనమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. మంచి నీరు కలుషితం అయ్యాయి కాబట్టి పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పుకోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటు.

జిల్లా మంత్రులు, అధికారులు ఏం చేస్తున్నారు. మీ ఇంట్లో పిల్లలకు అనారోగ్యం వస్తే ఇలాగే వ్యవహరిస్తారా?. విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు. అందరు హాస్టల్ విద్యార్థులకు స్క్రీనింగ్ చేసి, వ్యాధి నిర్ధారణ చేయాలి. స్వతంత్రం వచ్చాక ఇంత బాధ్యతా రాహిత్యంగా ఏ ప్రభుత్వం లేదు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలి అనే వైయ‌స్ జగన్ ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దు’ అంటూ బొత్స స‌త్య‌నారాయ‌ణ హితవు పలికారు

Back to Top