నెల్లూరు: నిన్న నకిలీ మద్యం... నేడు రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా... ఇలా అధికార తెలుగుదేశం నేతల దోపిడీ బాగోతాలు రోజుకొకటి బయటపడుతున్నాయని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రేషన్ మాఫియాలో వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో ఈ దందాను టీడీపీ నేత, నుడా చైర్మన్ స్వయంగా బయటపెట్టారని అన్నారు. జిల్లా మంత్రి నారాయణ అనుయాయులే ఈ మాఫియాలో కీలకపాత్ర పోషిస్తున్నారంటూ నుడా చైర్మన్ వెల్లడించడంతో, దానిపై విచారణ చేయించాల్సింది పోయి, మన తప్పులను మనమే బయటపెట్టుకుంటామా అంటూ మంత్రి నారాయణ మండిపడటం మరింత ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అవినీతి సొమ్మును పంచుకోవాలే తప్ప, అల్లరి చేసుకోవద్దంటూ మంత్రిగా ఉన్న నారాయణే కూటమి ధర్మం గురించి ఉపదేశాలు ఇస్తుండటాన్ని చూసి జిల్లాలోని ప్రజలు నివ్వెరపోయారని అన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా టీడీపీ నేతల రేషన్ బియ్యం అక్రమ దందాను వైయస్ఆర్‌సీపీ అడ్డుకుంటుందని, దీనిపై పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... ప్రభుత్వ అండదండతోనే నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. నకిలీ మద్యం, రేషన్ బియ్యం మాఫియాల నుంచి పొందుతున్న వాటాల్లో తేడాలు రావడం వల్లే ఈ విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో డిప్యూటీ సీఎం చేసిన కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 'సీజ్ ద షిప్' అంటూ చేసి హూంకరింపులు కేవలం ఒక నాటకం అని తేలిపోయింది. రేషన్ బియ్యం మాఫియాను అణిచి వేస్తామంటూ చేసిన హెచ్చరికలు కేవలం తమ జేబులు నింపుకునేందుకేనని స్పష్టమయ్యింది. సీజ్ ద షిప్ అంటూ ఎన్నిసార్లు హుంకరించినా... రేషన్ బియ్యం మాఫియా మాత్రం యధేచ్ఛగా తన పని తాను చేసుకుపోతోంది. ఇందుకు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న దందానే నిదర్శనం. నుడా చైర్మన్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేయించగలరా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాఫియా అక్రమ బియ్యం రవాణా చేస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ నేతలే దీనిలో సూత్రదారులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వాటాల పంపకాల్లో తేడాలు రావడం వల్లే వారే ఈ విషయాన్ని బయటపెట్టుకున్నారు. బజారునపడి అల్లరి చేసుకోవడం వల్లే ఈ విషయం ప్రజలు చర్చించుకునే స్థాయిలో బయటపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నుడా చైర్మన్ ఒక ప్రెస్‌మీట్ పెట్టి, రేషన్ మాఫియా వెనుక అధికారపార్టీకి చెందిన నాయకులే ఉన్నారు, వారికి సివిల్ సప్లయిస్ అధికారులు వంతపాడుతున్నారు, వీటిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను డిమాండ్ చేశారు. దీనిని బట్టి ఈ రేషన్ బియ్యం మాఫియా వెనుక మంత్రి నారాయణకు చెందిన ముఖ్య అనుయాయులు వున్నారని ఆయన నేరుగా ఆరోపణలు చేశారు. బియ్యం మాఫియాను ఒక ఆర్గనైజ్డ్ దందాగా మార్చారని కూడా ఆయన మాట్లాడారు. అంటే కూటమి పార్టీకి చెందిన నుడా చైర్మన్ రేషన్ మాఫియా గురించి మాట్లాడారంటేనే ఎంత దారుణంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అనంతసాగర్‌కు చెందిన వారు, నగరానికి చెందిన ముగ్గురు కలిసి ఈ మాఫియాను నడిపిస్తున్నారు. నారాయణా... ఏమిటీ బెదిరింపులు? ఈ ఆరోపణలపై మంత్రి నారాయణ స్పందించి కూటమి ధర్మం గురించి పలు అంశాలు మాట్లాడారు. కూటమి పార్టీలకు చెందిన వారు ప్రజల సొమ్మును దోచుకున్నా ఫరవాలేదు కానీ, ఒకరిపై మరొకరు ఆ దోపిడీపై ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదు అంటూ ఆయన ధర్మోపదేశం చేశారు. ఆయన ఏం మాట్లాడారో కూడా ఆ ఆడియోను ఈ విలేకరుల సమావేశం ద్వారా మీడియా మిత్రులకు వినిపిస్తున్నాను. (మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో రికార్డ్‌ను వినిపించారు) 'నాదెండ్ల మనోహర్ నాకు ఫోన్ చేశారు, మా అధికారులను గురించి మీ పార్టీ నేత మాట్లాడటం బాధేసింది, దీని వెనుక మీ హస్తం ఏమైనా ఉందా' అని నన్ను ప్రశ్నించారని మంత్రి నారాయణ మాట్లాడారు. అలాగే 'నేను మంచివారికి.. మంచివారిని, చెడ్డ వారికి చెడ్డవాడిని, కొండ మిరపకాయ లాంటి వాడిని, ఆ ఘాటుకు తట్టుకోలేరు, నా సహనాన్ని పరీక్షించవద్దు, ప్రశ్నిస్తే 'వర్మ' మాదిరిగా జీరోను చేస్తా'నంటూ హెచ్చరించారు. కూటమిలోని బీజేపీ, జనసేన నాయకులు గళం విప్పి మమ్మల్ని ప్రశ్నిస్తే సీఎం నుంచి నన్ను అడుగుతున్నారని, తనకు చెడ్డపేరు వస్తోందంటూ మంత్రి నారాయణ మాట్లాడారు. మంత్రి నారాయణ సొంతజిల్లాలో రేషన్ మాఫియా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందనేది బహిరంగ రహస్యం. ఒక బాధ్యత కలిగిన మంత్రిగా రేషన్ బియ్యం మాఫియా గురించి తనకు సమాచారం ఇవ్వండి, దానిని నిరోదింద్దాం అని కదా చెప్పాల్సింది? నెల్లూరు, వైయస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లో కొన్ని రేషన్ మిల్లులను కూటమి పార్టీలకు చెందిన నేతలు అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి, అక్రమంగా సరఫరా చేస్తున్నారు. ఇటీవలే బాపట్లలో దొరికిన రేషన్ బియ్యానికి నెల్లూరు జిల్లా మాఫియాతో సంబంధం ఉందని తేలింది. ఎమ్మెల్యేలకు ఏడాదికి నలబై నుంచి యాబై లక్షల రూపాయల వరకు ముడుపులు ఇచ్చి, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా వాహనాలకు టీడీపీ స్టిక్కర్ అంటిస్తున్నారు. ఈ వాహనాలను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అడ్డుకోకూడదని ఆదేశాలు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పదిహేను వందల రేషన్ షాప్‌లు ఉన్నాయి. దాదాపు ఏడు లక్షల ఇరవై వేల రేషన్ కార్డులు ఉన్నాయి. నెలకు 11,000 టన్నుల బియ్యాన్ని ఇస్తుంటే, దాదాపు తొమ్మిది వేల టన్నుల బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్లి అక్రమంగా రవాణా అవుతున్నాయి. జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో నేరుగా రేషన్ బియ్యాన్ని పాలిష్ చేయడం, చెన్నై మార్కెట్‌కు, కృష్ణపట్నం పోర్ట్ నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ఈ రేషన్ బియ్యం దందాపై వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది. ప్రజల పొట్ట కొట్టి, అక్రమంగా విదేశాలకు బియ్యాన్ని తరలిద్దామని అనుకుంటే సహించేది లేదు.