నేను  మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడు

వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఫైర్‌

అదానీ ఎయిర్‌టెల్‌ గూగుల్ డేటా సెంటర్ పై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచాను

వాటికి సమాధానం చెప్పలేకే నారా లోకేష్ ఎగతాళి వ్యాఖ్యలు

గుగూల్‌తో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలి

ఉద్యోగాల కల్పనపై గూగుల్ తో ప్రకటన చేయించాలి

మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్

విశాఖపట్నం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా 
అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్.

అదానీ ఎయిర్‌టెల్‌ గూగుల్ డేటా ప్రయోజనాలపై ప్రజల్లో పెద్ద చర్చే నడుస్తోంది

అదానీ ఎయిర్‌టెల్‌ గూగుల్ డేటా ఏర్పాటుకు రూ.22 వేల కోట్లు రాయితీలు 

సంస్థ ఏర్పాటుతో రాష్ట్ర ప్రయోనాలేంటో స్పష్టం చేయాలి?

రాష్ట్రానికి వచ్చే ఆదాయమేంత? యువతకు లభించే ఉద్యోగాలెన్ని? 

ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలి

స్పష్టం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్

విశాఖపట్నం: విశాఖపట్నంలో అదానీ ఎయిర్‌టెల్‌ గూగుల్ డేటా పై నేను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచానని.. వాటికి సమాధానం చెప్పలేకే లోకేష్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే  గుగూల్‌తో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

● రాష్ట్ర ప్రయోజనాలపై స్పష్టత ఏదీ ?

విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం రూ.22వేల కోట్ల రాయితీలిస్తున్న ప్రభుత్వం.. సంస్థ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలమీద మాత్రం స్పష్టతనివ్వడం లేదు. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల  రానున్న ఉద్యోగ అవకాశాలు, పెరగనున్న రాష్ట్ర ఆదాయాలపై ప్రజలు, నిపుణుల్లో అనేక సందేహాలు నెలకున్నాయి. వాటికి సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే.. స్పందించడం లేదు సరికదా లోకేష్ నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు వస్తాయని.. కేబినెట్ మీటింగ్ లోనూ, ఎస్ ఐపీబీలో చెబితే.. అదే టీడీపీ అనుకూల పత్రికల్లో కూడా రాశారు. ఇవాళ టీడీపీ నేతలు 1.90 లక్షల ఉద్యోగాలొస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి.. ఒక సంస్థకు పెద్ద ఎత్తున భూములు, ఇతర రాయితీలు కల్పిస్తున్నప్పుడు ఒకటి మన రాష్ట్రానికి ఉపయోగం, నిరుద్యోగ యువతకు ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు?  రెండోది రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంతన్నది ప్రధానమైన అంశాలు. గతంలో జరిగిన ఎస్ఐపీబీ, కేబినెట్ మీటింగ్ లో రైడన్ అనే సంస్థ ద్వారా 1గిగా వాట్ అదానీ ఎయిర్‌టెల్‌ గూగుల్ డేటా ఏర్పాటు చేసే క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని వారి అనుకూల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే రాశారు. అయితే లోకేష్ తోపాటు మిగిలిన మంత్రులందరూ కూడా 1.90 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని చెబుతున్నారు. నాకున్న సమాచారం మేరకు గూగుల్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలప్ మెంట్ సెంటర్లు, డేటాసెంటర్లు, రీసెర్చ్ సెంటర్లలో కలిపి పూర్తిగా ఉన్న ఉద్యోగాలు దాదాపు 1.87 లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు విశాఖలో రానున్న అదానీ ఎయిర్‌టెల్‌ గూగుల్ డేటా ద్వారా 1.90 వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రులు ఎలా క్లెయిమ్ చేస్తున్నారు. దీనిపై మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... మంత్రి లోకేష్ నన్ను వ్యక్తిగతంగా హేళన చేస్తున్నాడు.  నేను హేళన చేయడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు లోకేష్. 

● గూగుల్ సంస్ధతో ప్రకటన ఇప్పించగలరా ?

మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయో గూగుల్ తో ప్రకటన చేయించగలరా?  మీరు గూగుల్ తో ఆ ప్రకటన చేయిస్తే... విశాఖ వాసిగా నేనే సత్కరిస్తాను. మీరు చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. నిజానికి డేటా సెంటర్ ఏర్పాటుకు బాటలు వేసిందే వైఎస్సార్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆదాని సంస్థని డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు, ఐటీ పార్కు ఏర్పాటుకు కూడా ఒప్పించాం. మా ప్రశ్నలకు సమాధానం లేక.. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మేం అడిగిన ప్రశ్నలకు ఎవరు క్లారిటీ ఇస్తారు? ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల డేటా సెంటర్లు ఉన్నారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న గూగుల్ లో సెర్చ్ చేసి చూడవచ్చు. 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. మెక్సికో అమెరికా సరిహద్దుల్లో ఉన్న ఎల్ పాసో అనే నగరంలో మెటా సంస్థ 1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. అది 2028 నాటికి ప్రారంభం కానుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు  ప్రత్యక్షంగా 100 నుంచి 200 మంది అని సంస్థే ప్రకటించింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నిర్మాణ సమయంలో చాలా ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. నిజానికి ఎలా పాసోలో డేటా సెంటర్ నిర్మాణంలో 1500 మంది మాత్రమే ఉన్నారు. మన దగ్గర సాంకేతికత అక్కడి కంటే మన దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి.. 5వేల మందికి నిర్మాణ సయమంలో ఉపాధి దొరుకుతుంది. కానీ మీరు ప్రచారం చేస్తున్న  1.90 లక్షల ఉద్యోగాలకు, మీ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్ లో చెప్పిన  200 ఉద్యోగాలకు ఏమైనా పొంతన  ఉందా? కనీసం దీనిపైనా అయినా స్పష్టత ఇవ్వండి ? లేదా గూగుల్ సంస్ధతో అయినా ఉద్యోగాల కల్పనపై కనీసం పత్రికా ప్రకటన అయినా ఇప్పించండి. అప్పుడు ఈ ప్రాంతానికి చెందిన యువతలో తమకు ఉద్యోగాలు వస్తాయన్న విశ్వాసం పెరుగుతుంది. 

● ప్రజల తరపున ప్రశ్నిస్తే ఎదురు దాడా ?

సహజంగా ఒక ఐటీ ఉద్యోగికి పరోక్షంగా 5 మంది సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అలా లెక్కలేసుకున్నా 30 వేలమందికి గూగుల్ ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే... ప్రత్యక్షంగా వీరు చెప్పినట్లు 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. కానీ గూగుల్ ద్వారా వస్తున్న ఉధ్యోగాలు కేవలం 200 మాత్రమే. డేటా సెంటర్ తీసుకొచ్చాం, ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని మీరు ప్రచారం చేసుకోవడంలో మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ తప్పుడు ప్రచారంలో ప్రజలను మోసం చేయవద్దు అన్నదే మా అభ్యంతరం. డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున రెవెన్యూ అయినా జనరేట్ కావాలి, లేదా పెద్ద సంఖ్యలో మన యువతకు ఉద్యోగాలు అయినా రావాలి. అప్పుడు వారికి ఏ స్ధాయిలో ప్రోత్సాహకాలు ఇచ్చినా ప్రభుత్వంపై ఎంత భారం పడినా భరించడానికి సిద్ధం. ఇవేవీ నివృత్తి చేయకుండా... ప్రజల తరపున ప్రశ్నిస్తే మా పై ఎదురు దాడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. 

● మా హయాంలో డేటా సెంటర్ తోపాటు ఐటీ పార్క్...

మా ప్రభుత్వ హయాంలో ఆదానీ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పుడు వారి ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, సెంటర్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది... మనమిచ్చే రాయితీలు వల్ల ప్రభుత్వానికి ఏం ఉపయోగం, ఎంత మేర యువతకు ఉపాధి కలుగుతుందన్న అంశాలను స్టడీ చేశాం. కేవలం డేటా సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించలేం కాబట్టి.. మీకు ఇస్తున్న భూమిలో ఐటీ పార్కును డెవలప్ చేసి కనీసం  25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదానీ సంస్దను ఒప్పించి జీవో రూపంలో తీసుకొచ్చాం. అది వైయస్సార్ కాంగ్రెస పార్టీ నిబద్ధత. లోకేష్ నీలా నేను డొనేషన్లతో స్టాన్ ఫర్డ్ లో చదువుకోలేదు. నీలా ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి కావడానికి నా తండ్రి ముఖ్యమంత్రి కూడా కాదు. నా తండ్రి చనిపోయిన తర్వాత నేను కష్టపడి, సుదీర్ఘంగా ప్రజల పక్షాన పోరాటాలు చేసి.. విశాఖ ప్రాంత ప్రజల మన్ననలు పొంది వైయస్.జగన్ నాయకత్వంలో పనిచేసి ఈ స్దాయికి వచ్చాను. మన వ్యక్తిగత అంశాలతో ప్రజలకేం అవసరం. వారికి వాస్తవాలు చెప్పాలి. అది మన బాధ్యత.. కానీ దాన్ని పక్కనపెట్టి అనవసర విషయాల ప్రస్తావన వలన ప్రయోజనం లేదు.

● మౌలిక సదుపాయాల కల్పనపై క్లారిటీ ఏది?

అదానీ ఎయిర్‌టెల్‌ గూగుల్ డేటా కు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. విశాఖపట్నం నగరానికి 1 గంటకు ఎంత విద్యుత్ అవససరమవుతుందో డేటా సెంటర్ కి అంతే విద్యుత్ అవసరం. దీన్ని ఎలా రీచ్ అవుతామో అంచనా వేశారా? 1 గిగావాట్ పవర్ కావాలంటే 5వేల మెగావాట్ రెన్యువబుల్ పవర్ ఉండాలి. సోలార్ విద్యుత్ అయితే దానికోసం 20 నుంచి 25వేల ఎకరాల భూమి కావాలి. ఇది  ఎలా చేస్తున్నామన్నది చెప్పాలి. గ్రేటర్ విశాఖ మున్సిపాల్టీలో ఉన్న ప్రజలకు ఏడాదికి 5 టీఎంసీల నీరు కావాలి. డేటా సెంటర్ కు ఏడాదికి 2.5 నుంచి 3 టీఎంసీల నీరు అవసరం. వేసవిలో విశాఖలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. ఈ  అంశాలకు పరిష్కారం ఎలా అన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి? మరోవైపు  డేటా సెంటరు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో దానివల్ల  1-2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని మేధావులు చెబుతున్నారు. ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు అన్నదానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకున్నారన్నది కూడా ప్రజలకు స్పష్టతనివ్వాలి. గూగుల్ తోపాటు మెటా, టీసీఎస్ వంటిసంస్ధలతో ఇదే ప్రాంతంలో 5-6 గిగావాట్ ల డేటా హబ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. దీనిమీద కూడా స్పష్టతనివ్వాలని ప్రజలకు, నిపుణులు, ఈ ప్రాంత ప్రజల తరపున మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.  

● ఇదీ మా ప్రభుత్వంలో అభివృద్ధి...

మా ప్రభుత్వ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు రామాయపట్నం, బందరు పోర్టుల నిర్మాణ పనులు మొదలుపెట్టామని గర్వంగా చెప్పగలం. మూలపేట పోర్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అచ్యుతాపురంలో యెకహోమో టైర్ల కంపెనీ దగ్గర గర్వంగా నిలబడి చెప్పగలను.ఆదానికిచ్చిన డేటా సెంటర్ స్థలం వద్ద,  శ్రీసిటీలో క్యాడ్ బరీ కంపెనీ, బ్లూ స్టార్ ఏసీ ప్లాంట్, ప్యానాసోనిక్, టీసీఎల్ కంపెనీ టీవీ ప్యానెల్స్ కంపెనీ, సన్నీ ఒపోటెక్, హీరో మోటార్స్ కంపెనీల వద్ద కూడా గర్వంగా నిలబడి మా ప్రభుత్వ హయాంలో వచ్చాయని గర్వంగా నిలబడి చెప్పుకోగలం. మీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజైనా పోర్టు నిర్మాణం చేయాలన్న ఆలోచన చేశారా? 10 ఫిషింగ్ హార్భర్లు, 3  పోర్టులు, కొత్తవలసలో జిందాల్ ఇండస్ట్రియల్ పార్కు, నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్ తో పాటు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన అమర్నాథ్... దీనిపై చర్చకు సిద్ధమా అని లోకేష్ ని ప్రశ్నించారు.   

● అనంతరం విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ... 

ఈ నెల 22న ఛలో రాజయ్యపేట... 

స్టీల్ ప్లాంట్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలనకు వచ్చినప్పుడు మా పార్టీ అధ్యక్షుడు సైతం స్పష్టం చేస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ ని ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. మరలా మరో 800 ఎకరాలు సేకరణకు ప్రభుత్వం సిద్దమైన నేపధ్యంలో... ఈ నెల 22 తేదీన చలో రాజయ్యపేట కార్యక్రమం నిర్వహిస్తాం. రాజయ్యపేట మత్స్యకారులు వైయ‌స్ఆర్‌సీపీ ఉంటుంది. ప్రజాభిప్రాయం మేరకు వారిని ఒప్పించి... బల్క్ డ్రగ్ పార్క్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేం ముందునుంచీ స్పష్టం చేస్తున్నాం. అందుకే వారికి మద్ధతు పలుకడానికి అక్కడకు వెళ్తున్నాం.  పోలీసులతో ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం పాల్పడుతోంది. మత్స్యకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నపుడు మత్స్యకారులను రెచ్చగొట్టారు. ఇవాళ మరలా మాట మారుస్తున్నారని ఆ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ అధికారం ఉందని పోలీసులతో  వారిని అణిచివేయాలని చూడ్డం సరికాదని అమర్నాథ్ స్పష్టం చేశారు.

Back to Top