గుంటూరు: మేజర్ భరద్వాజ్ రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ దురదృష్టవశాత్తు మరణించారని, ఆయన ప్రాణత్యాగం గుంటూరు జిల్లాకే గర్వకారణమని వైయస్ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా కొనియాడారు. గుంటూరు నగరం సంగడిగుంటకు చెందిన మేజర్ భరద్వాజ్ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఇవాళ భరద్వాజ్ భౌతికకాయానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ “దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ భరద్వాజ్ గుంటూరుకి గర్వకారణం. ఆయన త్యాగం ఎప్పటికీ మరిచిపోలేనిది. కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు. భరద్వాజ్ కుటుంబాన్ని ప్రభుత్వం అండగా నిలవాలి దేశ సార్వభౌమత్వం, భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల త్యాగం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని షేక్ నూరి ఫాతిమా అన్నారు. వీరమరణం పొందిన మేజర్ భరద్వాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న తగిన సాయాన్ని అందించాలని కోరారు. దేశం రక్షణలో సేవలందిస్తున్న ప్రతి సైనికుడికి సమాజం గౌరవం, గుర్తింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, సైనిక సేవ పట్ల స్పూర్తి పెంచే విధంగా ఇలాంటి వీరుల కథలను విస్తృతంగా ప్రచారం చేయాలని అభిప్రాయపడ్డారు. మేజర్ భరద్వాజ్ చేసిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆయన కుటుంబానికి గుంటూరు ప్రజలంతా తోడుగా ఉంటారని ఫాతిమా పేర్కొన్నారు.