శ్రీకాకుళం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ప్రజలంతా ఐక్యమై తిప్పికొట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బుధవారం బూర్జ మండలంలో వైయస్ఆర్‌సీపీ 'కోటి సంతకాల' కార్యక్రమం ఉధృతంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించే ఈ సంతకాల సేకరణలో భాగంగా, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో పలు గ్రామ పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. వైయస్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ విద్య, వైద్య సేవలను దూరం చేయాలని చూస్తున్న ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.బుధవారం ఉదయం 9 గంటలకు అల్లెన గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం 10:30 గంటలకు డొంకలపర్త, 11:00 గంటలకు తుడ్డలి, మధ్యాహ్నం 12:00 గంటలకు లక్కుపురం గ్రామాల్లో సభలు నిర్వహించారు. ఈ గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంగా సంతకాల సేకరణలో పాల్గొని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ చింతాడ రవికుమార్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమాన్ని, వారి వైద్య అవకాశాలను దెబ్బతీసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మన అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు, ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ సంతకం చేసి తమ నిరసనను తెలియజేయాలి అని కోరారు.