జడివానలో.. జన ఉప్పెన

 విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మాకవరపాలెం మెడికల్‌ కాలేజీ దాకా అడుగడుగునా నీరాజనం

 విశాఖపట్నం,  అనకాపల్లి: సాగర తీరంలో జన ఉప్పెన ఎగసిపడింది. ఉత్తరాంధ్ర పర్యటనలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా,  బెదిరింపులకు పాల్పడినా వెరవకుండా సంక్షేమ సారథికి తోడుగా జనవాహిని ఉప్పొంగింది. మండుటెండలో గంటల తరబడి నిరీక్షించి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. మధ్యాహ్నం తర్వాత జోరు వర్షంలోనూ అదే జోరు కొనసాగింది. పూల వర్షాలు, హారతులు, గజ మాలలతో బ్రహ్మరథం పట్టారు.  

 

అడుగడుగునా నీరాజనం
విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పర్యటన గోపా­లపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదుగా నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ వరకు సాగింది. 63 కిలోమీటర్ల దూరానికి సాధారణంగా గంటన్నర పడుతుంది. కానీ జనహోరులో వైఎస్‌ జగన్‌ పర్యటనకు 6 గంటలకు పైగా పట్టింది. గోపాలపట్నం వద్ద ప్రారంభమైన జన యాత్ర మాకవరపాలెం మెడికల్‌ కళాశాలకు చేరేసరికి సాగరాన్ని తలపించింది. 

వేపగుంట వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జగన్‌ను చూసేందుకు పోటెత్తారు. సుజాతనగర్, చినముషిడివాడలో కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పెందుర్తి జంక్షన్‌ నుంచి పినగాడి జంక్షన్‌ వరకూ ఆత్మీయ నేతతో కరచాలనానికి పోటీ పడ్డారు. అక్కడి నుంచి జాతీయ రహదారిపై సబ్బవరం మీదుగా అనకాపల్లిలో కొత్తూరు జంక్షన్‌కు చేరుకున్నారు.

జోరు వానలోనూ..
అనకాపల్లి నుంచి జన ప్రవాహం జగన్‌ కాన్వాయ్‌ను ముందుకు కదలనీయకుండా చేసింది. ఆ సమయంలో భారీ వర్షం పడినా వెనక్కు తగ్గలేదు. కొత్తూరు జంక్షన్‌ నుంచి కశింకోట మీదుగా.. తాళ్లపాలెం వరుకూ జనాలతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు కుండపోతగా వర్షం పడుతున్నప్పటికీ.. తడుస్తూనే జై జగన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సీపట్నంలోకి ప్రవేశించాక జై జగన్‌ నినాదాలు మిన్నంటాయి. వై.భీమవరం, కన్నూరుపాలెం మీదుగా సాయంత్రానికి మాకవరపాలెం మెడికల్‌ కాలేజీకి చేరుకున్నారు. 

రాత్రి నుంచి అక్కడే బస..
వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలియడంతో మాకవరపాలెం మెడికల్‌ కళాశాల ప్రాంగణానికి గురువారం వేకువజామునే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. ముందురోజు సాయంత్రం నుంచి పోలీసులు బెదిరిస్తున్నా వెనుకంజ వేయలేదు. కొందరు ముందురోజు రాత్రే చేరుకుని అక్కడే నిద్రించారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు 12 గంటల పాటు ఎండ, వాన, తిండి పట్టించుకోకుండా వేచి చూశారు. వైఎస్‌ జగన్‌ మెడికల్‌ కళాశాల ప్రాంగణం వద్దకు రాగానే కేరింతలు కొట్టారు.  

ఆంక్షలు ఛేదించుకుని
ఒకవైపు పోలీసుల బారికేడ్లు.. ఆటోవాలాలకు బెదిరింపులు... అర్ధరాత్రి నుంచే పోలీస్‌ దిగ్భందంలో మెడికల్‌ కాలేజీ రోడ్డు..! ఇలా వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం హోరు ముందు తుస్సుమన్నాయి. జగన్‌ కాన్వాయ్‌ సాగిన ప్రతి జంక్షన్‌ జన హోరుతో దద్ధరిల్లిపోయింది. జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. 

ఉత్తరాంధ్రలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు సర్కారు మొదటి నుంచీ తీవ్రంగా యత్నించింది. అందులో భాగంగా మొదట రోడ్డు మార్గానికి అనుమతిచ్చేది లేదని అటు అనకాపలి ఎస్పీ, ఇటు విశాఖ పోలీసు కమిషనర్ల ద్వారా చెప్పించారు. అవసరమైతే హెలికాప్టర్‌ ద్వారా వెళ్లాలంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌ పర్యటన కొనసాగుతుందని... రోడ్డు మార్గంలోనే వస్తారని పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం చివరకు రోడ్డు మార్గం రూట్‌ మార్చి పర్యటనకు అనుమతించింది. 

అయితే ఇందుకోసం ఏకంగా 18 షరతులను విధించింది. ఇక ఆటోవాలాలను పిలిపించి జగన్‌ పర్యటనకు జనాలను తరలిస్తే కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా బెదిరించింది. మరోవైపు ఎక్కడికక్కడ రాత్రికి రాత్రి బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాత్రి నుంచే కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని ఎక్కడికక్కడ అడ్డగించి ఆరా తీశారు. ఎక్కడకు వెళుతున్నారంటూ సవాలక్ష ప్రశ్నలు వేశారు. అయినప్పటికీ వైఎస్‌ జగన్‌ వచ్చే సమయానికి ఎక్కడికక్కడ జనంతో జంక్షన్లన్నీ నిండిపోయాయి. 

ఆర్టీసీ బస్సుల్లో కొందరు... నడుచుకుంటూ మరికొందరు.... పోలీసుల కళ్లుగప్పి.... పొలాల్లో నడిచి, బైకులపై వచ్చి చివరకు తమ అభిమాన నేత వద్దకు చేరుకున్నారు. ఫలితంగా 65 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు ఏకంగా 6 గంటలకుపైగా సమయం తీసుకుందంటే జనవాహిని ఎలా ఉందో పరిస్థితిని ఊహించుకోవచ్చు. మొత్తంగా అటు పోలీసుల లెక్కలకు మించి ఇన్ని ఆంక్షల మధ్య కూడా ప్రభంజనంలా జనం తరలిరావడంతో చేసేదేమీ లేక చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. 

Back to Top