అన్నమయ్య జిల్లా: రాయచోటి జిల్లా కేంద్రం తరలింపునకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి జరిగిన ఘటన అన్నమయ్య జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామాపురం మండలం చెరువుకిందపల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రామచంద్రారెడ్డి రాయచోటి జిల్లా కేంద్రం తరలింపుపై నిరసన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అదే కారణంగా ఆయనపై దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మంత్రి అనుచరులు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ దాడిలో రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును అణిచివేయడమే ఈ దాడి లక్ష్యమని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినంత మాత్రాన దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంటోందని మండిపడ్డారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.