విశాఖపట్నం: నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన కోసం వచ్చిన మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ పర్యటనకు అశేష జనవాహిని తరలి వచ్చిందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. విశాఖ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు 60 కి.మీ కాగా, అక్కడికి వెళ్లడానికి జగన్‌గారికి ఏకంగా 6 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు, పలువురు ఆయన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారని, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజుతో కలిసి, విశాఖపట్నంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమర్‌నాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: ● జగన్ గారికి ప్రజల పూర్తి సంఘీభావం: ఉమ్మడి విశాఖ జిల్లాలో వైయస్ జగన్ పర్యటనను విజయవంతం చేయడం ద్వారా కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించబోవడం లేదన్న విషయాన్ని ప్రజలు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. జగన్‌గారి పర్యటనను విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలు, మేధావులకు మా ధన్యవాదాలు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, పేదవాడికి వైద్య విద్యను అందుబాటులో ఉంచాలి. అందుకే ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించాలి. అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న లక్ష్యంతో, నాడు సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ దిశలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి, వాటిలో 7 కాలేజీల పనులు పూర్తి చేశారు. వాటిలో 5 కాలేజీల్లో గత మూడేళ్లుగా అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వైద్య విద్య చదవాలన్న కోట్లాది పేద విద్యార్దుల ఆశలు, ఆకాంక్షలను దూరం చేసింది. ఇదే కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి కారణంగా నిలుస్తోంది. అందుకే వారంతా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ● మహత్తర లక్ష్యంతో మొదలుపెడితే..: మెడికల్ కాలేజీల విషయంలో తమ పార్టీ విధానాన్ని నిర్మాణం ఆపివేసిన నర్సీపట్నం వైద్య కళాశాల సాక్షిగా జగన్‌గారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ ఒక ఆధునిక దేవాలయం అన్న ఆయన, వాటి ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యను మరింత చేరువ చేయాలని, ఆ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలని భావించారు. అందుకే ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, తమ హయాంలో 7 కాలేజీల పనులు పూర్తి చేశారు. ఇప్పుడు పది కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం వైద్య విద్యను అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను దూరం చేస్తోంది. అందుకే జగన్‌గారి పర్యటనకు ఉవ్వెత్తున తరలివచ్చి, ప్రభుత్వ నిర్ణయం తప్పు అని తేల్చి చెప్పారు. ● పీపీపీ విధానం వల్ల ఫీజుల మోత: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50 శాతం ఉచిత సీట్లలో ట్యూషన్ ఫీజును కేవలం రూ.15 వేలుగా మా ప్రభుత్వ హయాంలో నిర్ణయించాం. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కొనసాగి ఉంటే ఇప్పుడు కూడా అంతే ఫీజు ఉండేది. కానీ, ఇప్పుడు ఆ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వాటిలో ఫ్రీ సీటు వచ్చినా రూ.3.50 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అంటే పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి కాలేజీలు అప్పగిస్తే, మెరిట్ ద్వారా సీటు వచ్చినా కూడా రూ.3.50 లక్షలు ట్యూషన్ ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక బీ కేటగిరీలో ఫీజు రూ.19 లక్షల నుంచి రూ.20 లక్షలు కాగా, మేనేజ్‌మెంట్ కోటాలో, అదే బీ కేటగిరీ సీట్ల ఫీజు మూడు రెట్లు ఎక్కువగా, అంటే రూ.60 లక్షలుగా నిర్ణయించారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో మారిస్తే, మెరిట్‌లో సీట్లు సాధించిన విద్యార్ధులు నష్టపోయే పరిస్ధితి వస్తుంది. ● దారి పొడవునా సమస్యల ఏకరువు: జగన్‌గారి పర్యటనలో విశాఖ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరాగా, పలు చోట్ల చాలా మంది ఆయన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి పర్యటన మొదలైన వెంటనే కాకానినగర్ వద్ద జగన్‌గారిని కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ప్రతినిధులు జగన్‌గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వారికి సంఘీభావం ప్రకటించిన జగన్‌గారు, పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు కూటమి ప్రభుత్వం గోపాలపట్నంతో పాటు విశాఖలో పలు ప్రాంతాల్లో రోడ్డున పడేసిన స్ట్రీట్ హాకర్స్ కూడా జగన్‌గారిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు. వారికి కూడా పార్టీ తరపున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి.. చోడవరం, మాడుగుల నుంచి వచ్చిన రైతులు గడిచిన 10 మాసాలుగా చెరుకు బకాయిలను చెల్లించలేదని చెప్పారు. మరోవైపు తమకు ఏడాదిగా జీతాలు ఇవ్వలేదని కార్మికులు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.89 కోట్లు ఇచ్చి, షుగర్ ఫ్యాక్టరీని కాపాడిన విషయాన్ని గుర్తు చేసిన వారు, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.35 కోట్లు బకాయి పడిందని చెప్పారు. అనంతరం కృష్ణంపాలెంలో ఏపీఐఐసీ నిర్వాసితులు, తాళ్లపాలెం తర్వాత రాజీపేట బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు తాము నష్టపోతున్న విషయాన్ని జగన్‌గారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం బాధితులను ఒప్పించకుండా ముందుకు వెళ్తే.. వారికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తం 60 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా 6 గంటలు పట్టిందంటే.. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తెలుస్తోంది. వీటన్నింటి ద్వారా ఉత్తరాంధ్రకు ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తోందన్న విషయం కూడా తేటతెల్లమైంది. ● జగన్ గారి హయాంలో ఉత్తరాంధ్ర ప్రగతి: వైయస్.జగన్ హయాంలో ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి, మూలపేట పోర్టు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరు ట్రైబల్ యూనివర్సిటీ, విజయనగరం, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం మెడికల్ కాలేజీలు, ఇన్ ఫోసిస్ సంస్థలు, ఆదానీ డేటా సెంటర్, ఎన్ టీ పీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు వంటి ఇన్ని అభివద్ధి కార్యాక్రమాలు చేపట్టారు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతిపాదించి నిర్మించిన గ్లాస్ బ్రిడ్జికి కూడా చంద్రబాబు ప్రారంభించి ఫోటో తీసుకుంటారు. ఇన్ని చరిత్రలో నిల్చిపోయే కార్యక్రమాలు వైయస్ఆర్‌సీపీలో చేశాం. చంద్రబాబునాయుడు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క కార్యక్రమము కూడా గుర్తుకు రాదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. ● విశాఖ సీపీ తీరు అభ్యంతరకరం: మొత్తంగా వైయస్.జగన్ పర్యటనకు నిబంధనల పేరుతో ఎన్ని అంక్షలు పెట్టినా, ఎంతగా నియంత్రించినా, స్థానిక నేతలను అడ్డుకుని నిర్భంధించినా అన్ని అడ్డంకులను దాటుకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా విశాఖపట్నం కేజీహెచ్ వద్ద పోలీస్ కమిషనర్ ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరం. సీపీ హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆయన రాజకీయ నాయకుడి తరహాలో మాట్లాడారు, దాన్ని సరిదిద్దుకోవాలని ఆయనకు సూచిస్తున్నాం. ● సీఎం రమేష్ క్యాపిటలిస్ట్ మ్యాన్: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అంటే కామన్ మ్యాన్ కాదు కాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకు ప్రైవేటీకరణ కార్యక్రమాలే నచ్చుతాయి. ఆయనకు భూములు, షుగర్ ఫ్యాక్టరీలు, కాలేజీలు కావాలి. ఆయన ఉత్తరాంధ్రను ఉద్ధరించడానికి రాలేదు.. ఆయన ప్రజలను మరిచిపోయి చాలా కాలం అయింది. ఆయన అనకాపల్లి వచ్చింది సహజ వనరుల దోపిడీ కోసమేనని అక్కడి జనం అనుకుంటున్నారు. పీపీపీ విధానం మంచిదంటున్న సీఎం రమేశ్.. ఒకటి రెండు మెడికల్ కాలేజీలు కొనుక్కునే ఆలోచనలో ఉన్నారు. అందుకే పీపీపీ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఋషికొండపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి. ఋషికొండ వైఎస్ జగన్ ది అయితే.. చంద్రబాబు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేయమనండి. ● పిల్లల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదు: నర్సీపట్నం కార్యక్రమం తర్వాత వైయస్.జగన్ విశాఖపట్నం చేరుకుని, కేజీహెచ్‌లో జాండిస్‌తో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్ధులను పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార్లకు, మంత్రుల సమన్వయలోపం వల్ల పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఇద్దరు బాలికల కుటుంబాలకు పార్టీ తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పు: కెకె రాజు - వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో జగన్ గారు ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 5 కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేసుకుని క్లాసులు కూడా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైయస్.జగన్ మార్కు ఆరోగ్య రంగంపై ఉండకూడదన్న కక్షతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్.జగన్ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. దీన్ని మరింత ఉధృతం చేసి, ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగేలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా వైయస్.జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఆయన పర్యటనను ప్రభుత్వ పెద్దలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఏమీ చేయలేకపోయారు. జగన్‌గారికి ప్రజల నుంచి వచ్చిన బ్రహ్మాండమైన స్పందనతో కూటమి నేతలకు కళ్లు బైర్లు కమ్మాయి. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్‌తో పాటు ప్రజలకు అనేక హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. వారందరూ తమ కష్టాలను వైయస్.జగన్ కు చెప్పుకున్నారు. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు తీరని అన్యాయం చేశాడు. మరోవైపు ఈ ప్రాంతానికి వలస వచ్చిన నాయకులకు కూడా ప్రజలు రాజకీయ భవిష్యత్తు కలిపించినా.. కూటమి పార్టీ నేతలు మాత్రం కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు. వారి రాజకీయ భవిష్యత్తును ప్రజలు రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలపడం ఖాయమని కే కే రాజు హెచ్చరించారు.