విజయనగరం: వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు. శనివారం మెరకముడుదాం మండలంలో తీవ్రంగా దెబ్బతిన్న బొప్పాయి సాగును చిన్న శ్రీను, వైయస్ఆర్‌సీపీ నాయకులు పరిశీలించారు. చిన్న బంటుపల్లి గ్రామంలో తీవ్రంగా దెబ్బతిన్న బొప్పాయి సాగును పరిశీలించించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..`విజయనగరం జిల్లాలో కురిసిన అకాల వర్షం వలన వందలాది ఎకరాలలో వరి , అరటి , జొన్న, బొప్పాయి, కాయగూరలు తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 500 ఎకరాలలో పంటలు నీట మునిగాయి. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి , రైతులకు తగిన పరిహారం ప్రకటించి ఆదుకోవాలి. మా ప్రభుత్వంలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఏ సీజన్‌కు సంబంధించి నష్టపోతే అదే సీజన్‌లో రైతులను ఆదుకున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పంటల భీమా అమలు కాకపోవడంతో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతోంది` అని గుర్తు చేశారు.