తాడేపల్లి: కల్తీ లిక్కర్ వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధం లేనట్టయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సీబీఐ విచారణ కోరాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారం వెలుగుచూసినా అందులో నిందితులంతా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉంటున్నారని అందుకే లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా చూసీచూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపించారు. కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి కూడా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ మీద నిందలు మోపడం సీఎం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ● రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ లిక్కర్ దందా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏకంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ఫ్యాక్టరీల గుట్టురట్టవడం, దానివెనుక తెలుగుదేశం నాయకులున్నట్టు ఆధారాలు బయటకు రావడం చూస్తుంటే అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికి ఏ విధంగా అడ్డదారులు తొక్కుతున్నారో అర్థమవుతోంది. ఆస్తులు పెంచుకోవడమే లక్ష్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరీ విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాజాగా వెలుగులోకి వచ్చిన తంబళ్లపల్లె కన్నా ముందే ఏలూరు, అనకాలపల్లి, నెల్లూరు, పాలకొల్లు, అమలాపురం, రేపల్లె వంటి ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా దందాలు వెలుగు చూశాయి. ఇంతపెద్ద ఎత్తున కల్తీ లిక్కర్ దందా బయటపడుతుంటే తనకేమీ తెలియనట్టు, అసలేమీ జరగనట్టు సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ మంత్రి సహా అధికార పార్టీ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటు. వరుస పెట్టి కల్తీ లిక్కర్ దందాలు వెలుగుచూస్తుంటే ఎక్కడా తనిఖీలు నిర్వహించడం లేదు. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం లేదు. ● కోవర్టు అయితే జయచంద్రా రెడ్డికి టికెట్ ఎందుకిచ్చారు? ములకలచెరువులో బట్టబయలైన కల్తీ లిక్కర్ వ్యవహాకానికి విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో మరో కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీతో సంబంధాలున్నట్టు ఆధారాలు బహిర్గతం కావడం రాష్ట్ర మహిళలను నిశ్చేష్టులను చేస్తోంది. ఫ్యాక్టరీల్లో తయారు చేసిన కల్తీ లిక్కర్‌ని బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసి జేబులు నింపుకునే కార్యక్రమం దాదాపు 16 నెలలుగా యథేచ్ఛగా సాగుతోంది. స్పిరిట్‌ను కలిపి కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోవడం చూస్తుంటే దాని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి మూడు క్వార్టర్ బాటిళ్లలో ఒకటి కల్తీ లిక్కర్ బాటిల్ అని ఎక్సైజ్ అధికారులే చెప్పడం చూస్తుంటే కల్తీ లిక్కర్ మాఫియాను ఏవిధంగా వ్యవస్థీకృతం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ కల్తీ లిక్కర్ దందాలో టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్ చార్జి జయచంద్రారెడ్డి సహా ఇతర టీడీపీ నాయకులు అద్దేపల్లి జనార్దన్‌రావు, కట్టా సురేంద్రనాయుడు, గిరిధర్ రెడ్డి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధిరాకపోగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడని, వైయస్ఆర్‌సీపీ కోవర్టంటూ మొండి వాదనకు తిగడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. టీడీపీ చెబుతున్నట్టు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైతే, ఆయన తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డి మీద తంబళ్లపల్లెలో ఎందుకు పోటీ చేస్తాడు? ఎప్పట్నుంచో టీడీపీలో ఉన్న శంకర్ యాదవ్‌ను కాదని టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ టికెట్‌ను వైయస్ఆర్‌సీపీ కోవర్టు అని తెలిసీ జయచంద్రారెడ్డికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి? ● జయచంద్రా రెడ్డికి ఆఫ్రికాలో నాలుగు లిక్కర్ ఫ్యాక్టరీలు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో నాలుగు లిక్కర్ ఫ్యాక్టరీలున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లోనే ప్రకటించారు. ఆ లిక్కర్ ఫ్యాక్టరీలు చూసి పార్టీ ఫండ్ పేరుతో ఆయన నుంచి భారీగా వసూలు చేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. డబ్బులు తీసుకున్నారు కాబట్టే ఎప్పట్నుంచో పార్టీలో కష్టపడుతున్న శంకర్ యాదవ్‌ని కాదని మూడు నెలల ముందు టీడీపీలో చేరిన జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫారం ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన్నే తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగిస్తున్నారు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో అమలు చేస్తున్న లిక్కర్ విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలన్న ఆలోచనతోనే ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. కిలారి రాజేశ్ ద్వారా చంద్రబాబు, లోకేశ్‌లు నడిపిస్తున్న ఈ మద్యం దందా బయట పడకుండా చూడటమే లక్ష్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి కోవర్టులంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కి దిగుతున్నారు. ● క్యూఆర్ కోడ్ లేకుండా లిక్కర్ అమ్మకాలు వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నడిపేది. సరఫరా చేసే ప్రతి బాటిల్‌పైనా ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా దాని పూర్తి వివరాలు తెలిసేవి. లిక్కర్ కు సంబంధించిన ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకి నేరుగా చేరేది. కానీ నేడు లిక్కర్ బాటిల్స్‌పై క్యూఆర్ కోడ్ లేకుండా నకిలీ బ్రాండ్లతో నేరుగా సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి ప్రభుత్వ పెద్దలే గండికొడుతున్నారు. కల్తీ లిక్కర్ అమ్మకాల ద్వారా ఐదేళ్లలో రూ. 40 వేల కోట్లు దోచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. తొలి ఏడాది రూ. 5200 కోట్లు దోచేశారు. 2019లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేస్తే, 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపుల సంఖ్యను ఏకంగా 70 వేలకు పెంచడంతోపాటు పర్మిట్ రూమ్‌లకు అనుమతులిచ్చి కల్తీ లిక్కర్ అమ్మకాలకు అధికారికంగా డోర్లు తెరిచాడు. దోచుకోవడం దాచుకోవడం తప్ప, ఎన్నికల హామీల అమలు, ప్రజా సంక్షేమంపై ఈ ప్రభుత్వం దృష్టిసారించడం లేదు. ● నాడు లిక్కర్ మరణాల పేరుతో అసత్యాలు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ లిక్కర్‌తో ఒక్క మరణం సంభవించకపోయినా 30 వేల మంది చనిపోయినట్టు విషప్రచారం చేశాడు. వైయస్ఆర్‌సీపీ హయాంలో కల్తీ లిక్కర్ వలన ఏ ఒక్కరూ చనిపోలేదని ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు స్పష్టం చేసింది. నాడు చేసిన విషప్రచారానికి గాను చంద్రబాబు.. మాజీ సీఎం వైయస్ జగన్‌కి క్షమాపణలు చెప్పాలి. ఈరోజు ఏకంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు. ఆరోజు 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెంపేశారని అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్... నేడు కల్తీ లిక్కర్ మరణాలపై ఎందుకు స్పందించడం లేదు. కల్తీ లిక్కర్ పై రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి మద్యం షాపు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించాలి.