ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు

ఇది డ్రైవర్ల సేవ కాదు... డ్రైవర్లకు దగా

మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

మచిలీపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)

లారీ, టిప్పర్ డ్రైవర్లకు కూటమి సర్కార్ మొండిచేయి

ఆనాడు 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారన్న నారా లోకేష్

నేడు కేవలం 2.90 లక్షల మందికే సాయంను ఎలా పరిమితం చేశారు?

డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు ఏమయ్యిందీ?

వాహన కొనుగోలు రుణాలకు 5 శాతానికి పైబడిన వడ్డీ సబ్సిడీ ఏదీ?

చలానాల భారం తగ్గిస్తానన్న హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు?

కూటమి మేనిఫేస్టోలో చెప్పిన హామీల అమలు ఏదీ?

సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)

మచిలీపట్నం: రాష్ట్రంలో ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, వారికి నేడు పండుగ కాదు.. దండుగ రోజుగా గుర్తుండేలా చేశారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మచిలీపట్నం క్యాంప్ కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడుతూ... కూటమి పార్టీలు ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫేస్టోలో ప్రకటించిన దానికి, నేడు చేస్తున్న దానికి ఏమాత్రమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన లక్షలాధి మంది ఆటోడ్రైవర్లు, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అయిదేళ్ళపాటు మేనిఫేస్టోలో చెప్పినట్లుగా వాహనమిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సీఎంగా వైయస్ జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. నేడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ, తమ గొప్పతనంను సిగ్గులేకుండా చంద్రబాబు చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే...

చంద్రబాబు, పవన్, లోకేష్‌లు మూడు ఖాకీచొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో ఈ రోజు ఓ భారీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో ఆధార్‌ కార్డ్ ఉన్న ప్రతి స్త్రీకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటూ ఎన్నికలకు ముందు ఇదే కూటమి పార్టీలు ప్రచారం చేశాయి. మహిళలు స్వేచ్ఛగా ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చంటూ సాక్షాత్తు చంద్రబాబు ఊదరగొట్టారు. ఎన్నికలు అయిపోయి ఏడాదైనా, కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఉచిత బస్సు ఊసే ఎత్తలేదు. దీనిపై వైయస్ఆర్‌సీపీ పలుసార్లు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలోని మహిళాలోకం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో చివరికి రెండు నెలల కిందట ఉచిత బస్సు ప్రయాణానికి అనేక ఆంక్షలతో అనుమతులు ఇచ్చారు. బస్సుల సంఖ్య, సర్వీసుల సంఖ్య తగ్గించేసి, లాంగ్ రూట్‌లో ఎక్కువగా తిరిగే బస్సులను కేటగిరిలోంచి తీసేసి, పరిమితంగా మాత్రమే ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతులు ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోడ్రైవర్లు బేరాలు లేక ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ పొట్టకొట్టిందంటూ నిరసన కార్యక్రమాలు చేశారు. వారి ఆందోళనను చూసి కంగారుపడ్డ కూటమి సర్కార్ ఈ రోజు 'ఆటో డ్రైవర్ల సేవలో' కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో 2,90,669 మంది ఆటోడ్రైవర్లకు రూ.436 కోట్లు డబ్బులు వేశామని, ఇటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని, తానే ఈ సాయాన్ని తొలిసారిగా అందచేస్తున్నట్లుగా చంద్రబాబు  ప్రకటించుకున్నారు. చంద్రబాబు చెప్పుకుంటున్న గొప్పలను చూసి ఆటోడ్రైవర్లే అవాక్కయ్యారు. ఆటోస్టాండ్‌ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు, తాను పెట్టబోయే యాప్‌ ద్వారా ఇంటి నుంచే బేరాలను అందుకోవచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూం ఏర్పాటు  చేసి, బేరాలు వచ్చేలా చేస్తానంటూ ఆటోడ్రైవర్లను ఊహాలోకంలో విహరింపచేశారు. 

అయిదేళ్ళు ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర అందించాం

వైయస్ జగన్ గారు 2017లో మచిలీపట్నంకు పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు స్థానిక ఆటోడ్రైవర్లు ఆయనను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను గురించి వివరించారు. సొంత ఆటోతో ఉపాధి పొందుతున్న తమకు ఆర్థికంగా చేయూతను అందించాలని విజ్ఞప్తి చేశారు. వారి కష్టాలను విన్న వైయస్ జగన్ తరువాత ఏలూరులో జరిగిన బహిరంగసభలో సొంత ఆటోతో ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది 2,36,344 మంది, రెండో ఏడాది 2,74,476 మంది, మూడో ఏడాది 2,56,646 మందికి, నాలుగో ఏడాది 2,61,516 మందికి, అయిదో ఏడాది 2,75,931 ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద ఏడాదికి రూ.10 వేలు సాయం అందించారు. మా హయాంలో ఆటోడ్రైవర్‌కు వివాహం జరిగి, ఆటోలు వారి కుటుంబసభ్యుల పేరు మీద ఉన్నా కూడా వారికి వాహనమిత్ర ఇచ్చాం. చలానా బకాయిలు ఉన్నా కూడా వారికి ఎక్కడా నిరాకరించలేదు. వైయస్ఆర్‌సీపీ 2019 మేనిఫేస్టోలో చాలా స్పష్టంగా సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ కాబ్ నడిపేవారికి ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, రిపేర్లు తదితర అవసరాల కోసం ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించాం. ఆ మేరకు మాట నిలబెట్టుకున్నాం. ఇందుకు సంబంధించి మా పార్టీ మేనిఫేస్టోను కూడా చూపిస్తున్నాం. 

కూటమి మేనిఫేస్టోను డ్రైవర్లకు చూపించగలరా?

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ళలో గత ప్రభుత్వం కన్నా అదనంగా చంద్రబాబు ఇచ్చింది 15వేల మందికి మాత్రమే. ఎన్నికలకు ముందు మేనిఫేస్టోలో ఆటో డ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు, ప్రమాదబీమా, హెల్త్ ఇన్సూరెన్స్, డ్రైవర్ల పిల్లకు విద్యారుణాలు, వాహన కొనుగోలుకు అయిదుశాతం వడ్డీ సబ్సిడీతో ప్రభుత్వపరంగా రుణాలు ఇస్తామని అన్నారు. బ్యాడ్జ్ కలిగిన ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. టీడీపీ మేనిఫేస్టోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఆ రోజు చెప్పినట్లుగా ఆ మొత్తాలను ఇచ్చారా? చలానాలు ఉంటే ఆ ఆటోకు సంబంధించిన డ్రైవర్‌కు డబ్బులు వేయలేదు. పెళ్ళైన ఆటోడ్రైవర్ కుటుంబసభ్యుల పేరుతో ఆటో ఉన్నా డబ్బు వేసేందుకు నిరాకరించారు. ఇదేనా ఆటోడ్రైవర్లకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు?

లోకేష్ ఆనాడు మాట్లాడినది మరిచిపోయారా?

యువగళం పాదయాత్ర సందర్భంగా ఆనాడు నారా లోకేష్ మాట్లాడుతూ 'రాష్ట్రంలో 13 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉంటే, కేవలం పదిశాతం మందికి మాత్రమే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వాహనమిత్ర ఇస్తోందంటూ' ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వారికి ఏడాదికి పదివేలు ఇస్తూ, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆ డబ్బును కొట్టేస్తోందని' అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆటోడ్రైవర్ల సంక్షోమం కోసం బోర్డ్ ఏర్పాటు చేసి ప్రమాదబీమా, ఆరోగ్య బీమా, ఆటో బీమాలను అతి తక్కువ ధరకే అందిస్తామని, సబ్సిడీపై ఎలక్ట్రిక్ ఆటోలు, స్టాండ్‌లలో తాగునీరు, టాయిలెట్లు, ఆటో స్టాండ్‌లలో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 2023లో లోకేష్‌ మాట్లాడిన దానిపై పత్రికల్లో వచ్చిన వార్తాకథనాలను కూడా అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తున్నాం. లోకేష్ చెప్పిన లెక్కల ప్రకారం చూసినా రెండేళ్ళ కిందటే 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే, ఇప్పటికి వారి సంఖ్య కనీసం 15 లక్షల వరకు అయినా పెరిగి ఉంటుంది. ఈ లెక్కల ఎన్ని లక్షల మందికి రూ.15 వేల చొప్పున వేయాలి? ఎలా కేవలం 2.90 లక్షల మందికే ఇస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం చేసింది డ్రైవర్ల సేవ కాదు... డ్రైవర్లను దగా చేయడం. ఆటోడ్రైవర్లను మోసం చేసిన రోజు ఇది. సమాజంలో కడుపేదలుగా ఉండి, రెక్కలు ముక్కలు చేసుకునే వారిని మోసం చేశారు. ఆటోడ్రైవర్లకు పండుగ కాదు, దండుగ రోజు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లు చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు పదిహేను లక్షల మంది వరకు ఉన్న డ్రైవర్లకు రూ.15 వేలు ఎప్పుడు వేస్తారు? ఈ రోజు ఆటోల్లో తిరిగిన చంద్రబాబు, పవన్, లోకేష్‌లు అదే ఆటోల్లో కృష్ణాజిల్లా పరిధిలోని ఏ ఊరికి వస్తారో చెప్పాలి? ఈ గోతుల రోడ్లలో వారు గమ్యం చేరేలోపు ఆసుపత్రిలో చేరక తప్పదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు కిరణ్‌లు చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు చేసే ప్రతి పనికి బాకాలు ఊదే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.

Back to Top