తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగురంగం కుదేలైందని, అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడే దుర్దినాలు దాపురించాయని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ ఎం వి యస్ నాగిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతులు పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్.జగన్ పాలనలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్నదాతలను చేయిపట్టుకుని నడిపిస్తే.. చంద్రబాబు పాలనలో తిరిగి సాగు సంక్షోభంలోకి కూరుకుపోతుందని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11. 73 లక్షల హెక్టార్లలో తగ్గిన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తక్షణమే అన్నదాతలకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని.. రైతులెవ్వరూ ఆత్మహత్యలు పాల్పడవద్దని, కచ్చింతగా మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● కూటమి పాలనలో తగ్గిన సాగు విస్తీర్ణం.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఖరీఫ్ లు పూర్తయ్యాయి. గతంలో వైయస్.జగన్ హయాంలో ఐదు ఖరీఫ్ లు పూర్తయ్యాయి. ఏ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ లో ఎంత మేర సాగు జరిగిందన్న విషయాలు పరిశీలిస్తే... 15-10-2019 ఖరీఫ్ పూర్తయ్యే నాటికి 34.49 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం కాగా... 14-10-2020 నాటికి 35.95 లక్షల హెక్టార్లలోనూ, 12-10-2021 నాటికి 35.07 లక్షల హెక్టార్లలోనూ, 2022 అక్టోబరు నాటికి 34.17 లక్షల హెక్టార్లలోనూ, అక్టోబరు 2023 నాటికి పసుపు, మిర్చి పంటలను మినహాయిస్తే... 24.90 లక్షల హెక్టార్లు సాగు జరిగింది. అంటే ఐదేళ్లలో సగటున 32.94 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరిగింది. ● కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లు సాగు విస్తీర్ణం గమనిస్తే... అక్టోబరు 2024 నాటికి 27.99 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా... అక్టోబరు 2025 నాటికి 28.38 లక్షల హెక్టార్లు అంటే రెండేళ్లల సగటున 28.19 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. అంటే గత ఐదు సంవత్సరాల కంటే ఈ రెండేళ్లలో 11.73 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం తగ్గింది. ఒక హెక్టారులో సాగు జరిగితే 100 పనిదినాలు వస్తాయి. అంటే కూటమి పాలనలో 6 కోట్ల పనిదినాలు తగ్గిపోయాయి. స్త్రీ, పురుష కూలీల సరాసరి వేతనం రూ.400 అనుకంటే.. రూ.2,400 కోట్ల విలువైన వ్యవసాయ కార్మికుల పని తగ్గింది. ఇవి కాకుండా పురుగుల మందులు, డీజిల్ రో రూ.600 కోట్లు అనుకుంటే మొత్తంగా రూ.3 వేల కోట్ల విలువైన పని తగ్గింది. ఈ డబ్బులే నిత్యావసర సరుకులతో పాటు ఇతర అవసరాలకు రాష్ట్రంలో రొటేషన్ అవుతుంటాయి. అది తగ్గిపోవడంతో రాష్ట్రంలో జీఎస్టీ తగ్గింది. మరోవైపు ఎకరాకు రూ.50 వేల పంట ఉత్పత్తి విలువ లెక్కేసుకున్నా... ఈ తగ్గిన 11.73 లక్షల హెక్టార్ల సాగు వల్ల రూ.6వేల కోట్ల విలువైన సాగు ఉత్పత్తి తగ్గింది. సంపద సృష్టిస్తానని చెప్పే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే సాగు గణనీయంగా పడిపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయాయి. అయినా దీనిపై కనీసం మాట్లాడ్డం లేదు. ● తగ్గిన సాగు- కుదేలైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ.. మరోవైపు గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధలో వ్యవసాయ పనిదినాలు తగ్గిపోవడం, ఉత్పత్తి తగ్గిపోవడంతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మీద భారం పడి.... తద్వారా రాష్ట్ర జీఎస్టీ తగ్గిపోయిన పరిస్థితి. ఏ రాష్ట్రంలోనైనా పంటలు బాగా పండి,వాటికి గిట్టుబాటు ధరలు వస్తే ఆటోమేటిక్ గా భూముల ధరలు పెరుగుతాయి. దివంగత నేత డాక్టర్ వైయస్.రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో జరిగిన మార్పు ఇది. ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా భూములు ధరలు లేవు. 24 సహకార బ్యాంకులుంటే 18 బ్యాంకులు దివాళా తీసే పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పంటలు బాగా పండడం, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఎరువులు ధరలు నియంత్రణలో ఉండడంతో భూములు ధరలు పెరిగాయి. కానీ ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా భూములకు ధరలు రాలేదు. ● నిధులు లేకపోయినా వైయస్.జగన్ ఆపన్నహస్తం... ఇక 2019లో వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి ప్రభుత్వ ఖజనాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే నిధులు ఉన్నాయని... టీడీపీ ప్రభుత్వ అనుకూల పత్రిల్లోనే వార్తలు వచ్చాయి. అయినా కూడా రైతుభరోసా పేరుతో రైతులకిచ్చే సాయాన్ని రెండో ఏడాది నుంచి ఇస్తామని చెప్పినా కూడా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని తొలి ఏడాది నుంచే పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఇచ్చాం. మా హయాంలో కౌలు రైతులకూ కూడా ఇచ్చాం. రైతులు విత్తనాల కొనుక్కున్నప్పటి నుంచే ఇవ్వాలన్న లక్ష్యంతో మే నెలలో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్, రెండో ఇన్ స్టాల్ మెంట్ అక్టోబరులో, మూడో ఇన్ స్టాల్ మెంట్ రైతు ఇంట పండగ జరుపుకునే సంక్రాంతి నాటికి అందించే ఏర్పాటు చేసాం. ఐదేళ్లలో ఎలాంటి ఆటంకాలు లేకుండా 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా క్రమం తప్పకుండా వైయస్.జగన్ హయాంలో అందించాం. ● నిధులున్నా సాయం చేయని చంద్రబాబు... 2024లో అదే చంద్రబాబు ఆధ్వర్యంలోనే కూటమి ప్రభుత్వం..ట్రెజరీలో రూ.7వేల కోట్లతో పాలన మొదలుపెట్టింది. రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టి. తొలిఏడాది స్కీమ్ ను రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండో ఏడాది పీఎం కిసాన్ కింద 41,22,499 మందికి మాత్రమే రూ.2వేలు అందించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు 46.88 లక్షల మంది రూ.5వేలు రాష్ట్రం, కేంద్రం రూ.2వేలు ఇస్తున్నామని చెప్పారు. వాస్తవానికి రూ.2వేలు కేవలం 41.22లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ వచ్చింది. అంటే 5.64 లక్షల మందికి రూ.5 వేలు మాత్రమే జమ అయ్యాయి. అంటే వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి రైతు భరోసా అందిస్తే... కూటమి ప్రభుత్వ హయాంలో 46.86 లక్షల మందికి అంటే దాదాపు 6.72 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. మరోవైపు కౌలు రైతులకు కార్డులు ఇస్తానని ఇవ్వలేదు. మరో ముఖ్యమైన అంశం.. ఉచిత పంటల బీమాపథకం. భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వైయస్.జగన్ హయాంలో అమలైంది. గతంలో రుణం తీసుకున్న వ్యక్తులు అంటే కేవలం 25 శాతం కూడా పంటలబీమాలో కవర్ కావడం లేదు, అందువల్ల సాగు చేస్తున్న ప్రతి రైతును పంటలబీమా కిందకు తీసుకురావాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ హయాంలో కేంద్రం ఒక వాటా బీమా చెల్లించగా... రాష్ట్ర ప్రభుత్ం తన వాటతోపాటు రైతు కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ కూడా చెల్లించి... ఉచిత పంటలబీమా ప్రవేశపెట్టారు. పంటల బీమా కింద 2017-18 లో కేవలం 18.22 లక్షల మంత్రి రైతులు మాత్రమే కవర్ అయ్యారు. అదే 2020-21 71.30 లక్షల మంది రైతులు ఉచిత పంటలబీమా పథకం కింద కవర్ అయ్యారు. 61.75 లక్షల ఎకరాల భూమి బీమా కింద కవర్ అయింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడాల్సిన పధకాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయ విజ్ఞత లేకుండా తీసేసింది. రాష్ట్రంలో ఒకవైపు అతివృష్టి, అనావృష్టి రాజ్యమేలుతుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సాగు గణనీయంగా తగ్గిపోతుంది. అన్ని పంటలు సంక్షోభంలో ఉన్నాయి. సాగు గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి పంటా ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితుల్లో ఉచిత పంటల బీమా రద్దు చేయడం సరికాదు. రైతులకు పూర్తిగా అన్యాయమవుతున్న పరిస్థితి. రైతులు పండించే బియ్యం ఎగుమతులకి, తినడానికి కూడా పనికిరాదు.. సారా తయారుచేయడానికి మాత్రమే పనికొస్తుందని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఈ విత్తనాలేవీ రైతులు తయారు చేసినవి కాదు... ప్రతిష్టాత్మక ప్రభుత్వ పరిశోధనా సంస్దల్లో తయారు చేసి ఇచ్చినవే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోనూ హైదారాబాద్ లోనూ చివరికి చంద్రబాబు గారి ఇంట్లోనూ తినే బియ్యం రకం బీపీటీ 5204 సోనామసూరివంగడం మన బాపట్లలో తయారైంది. ఎన్ డీ ఆర్ ఎల్ ఎక్స్ 9 అని నంద్యాలలతో తయారైన వంగడమే విదేశాల్లోనూ ఇండియన్ స్టోర్ట్స్ లో దొరుకుతుంది. మార్టేరు వ్యవసాయ పరిశోధనా శాలలో దశాబ్ధాలక్రితం తయారైన స్వర్ణ అనే రకం నేటికీ వాడుతున్నారు. ప్రాంతాలకనుగుణంగా... వంగడాలు తయారవుతాయి. ఇవి కాకుండా డెల్టా ప్రాంతాల్లో మరో ప్రత్యామ్నాయ పంటను మనం చూపించగలమా ? ● మద్ధతు ధరలేని మిర్చి రైతులు... ఇక మిర్చి రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మిర్చి ధరలు దయనీయంగా పడిపోయాయి. రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయారు. వైయస్.జగన్ గుంటూరు మిర్చియార్డుకు వెళ్లినప్పుడు ప్రభుత్వం మిర్చి కనీస మద్దతు ధర రూ.11,720 అన్నారు. ఒక్క రైతుకైనా ఇచ్చారా? కేవలం మాటలకే పడిపోయారు. ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం 30 శాతానికి పైగా పడిపోతుంది. కారణం గతేడాది మద్దతు ధర లేకపోవడమే. మరోవైపు బర్లీ పొగాకు ధర కుప్పకూలింది. దానికి కూడా ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. చివరకు తమకు అనుకూలమైన రైతులే రోడ్డెక్కి ఆందోళనకు దిగిన పరిస్థితి చూశాం. సాధారణంగా రోడ్లపై టమోట పంటను పారబోయడం చూశాం. కానీ మామిడి చరిత్రలోనే తోతాపురి మామిడినిని ట్రక్కులు, ట్రక్కులుగా రోడ్ల పై పారబోసే పరిస్ధితిని తొలిసారిగా చిత్తూరు జిల్లాలో చూశాం. రూ.8 కేజీ మామిడికి ఫ్యాక్టరీలు ధర ఇస్తే.. రూ.4 ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ప్లెక్సీలు కూడా పెట్టారు. కానీ ఫ్యాక్టరీలు మాత్రం రూ.5-6 మాత్రమే ధర ఇచ్చాయని రైతులు చెబుతుంటే.. ప్రభుత్వం ఇస్తామన్న రూ.4 కేజీకి ఇంతవరకు ఇవ్వలేదు. ● తల్లడిల్లుతున్న ఉల్లి రైతులు... ఇక ఖరీఫ్ మొదట్లో మార్కెట్ కు కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల నుంచి కర్నూలు మార్కెట్ కు వచ్చే ఉల్లిపంటకు గతంలో ఎన్నడు లేనంత సంక్షోభం ఈ ఏడాది వచ్చిందని రైతులు వాపోతున్నారు. మార్కెట్ లో ధర లేనప్పుడు కిలో రూ.12 చొప్పున కొంటామని చెప్పిన ప్రభుత్వం.. కమ్యూనిటీ హాల్ ను అద్దెకు తీసుకుని ఉల్లిపంటను ఆరబోయండి అని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. మూడు, నాలుగు రోజుల పాటు 6వేల క్వింటాల్లు ఉల్లి కొని... హఠాత్తుగా ఆపేశారు. అ తర్వాత మీరు బహిరంగ మార్కెట్ లో అమ్ముకొండి, రూ.12 కంటే తక్కువ ధర ఉంటే ఆ డిఫరెంట్ అమౌంట్ ను చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని.. అదీ 45 వేల ఎకరాలకు ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు చెప్పారు. ఒక్క కర్నూలు జిల్లాలోని 45వేల ఎకరాల సాగు జరిగితే... కడప జిల్లాలో 11 వేల ఎకరాలు, నంద్యాలతో కలుపుకుని దాదాపు 66 వేల ఎకరాల్లో ఉల్లిపంట సాగు జరిగింది. వీటి పరిస్థితి ఏంటి. పంట వేసిన నెల లోపు ఇ-క్రాప్ చేయాలి. ఇప్పుడు పంట మార్కెట్ కు వేసిన వాళ్లు కొంతమంది అయితే, మరికొంత మంది మద్దతు ధర రాక పంటను పొలంలోనే దున్నేశారు. ఇప్పుడు ఇ క్రాప్ ఎలా చేస్తారు. అదే విధంగా కౌలు రైతులే ఉల్లిసాగు చేస్తారు. ట్రక్కుల ట్రక్కుల ఉల్లి కాలువల్లో పారబోశారు. పొలంలో ఉల్లి వదిలేస్తే.. ఊర్లలో అమ్మితే ఎవరు కొంటారు. ఇంతటి సంక్షోభం ఉంటే.. రైతుల నుంచి 6 వేల క్వింటాళ్ల ఉల్లికి కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. ● చేదెక్కిన పండ్ల సాగు... మరోవైపు రాష్ట్రం మొత్తమ్మీద 213 లక్షల టన్నుల పండ్ల సాగు జరిగితే దీనిలో 74 లక్షల టన్నుల అరటి పంట ఉత్పత్తి అవుతుంది. ఇందులో జీ-9 రకం ముఖ్యమైనది. కిలో రూ.18 నుంచి ర.30 అమ్మే ఈ అరటి రకం రూ.3.50 నుంచి రూ.6 కు పడిపోయింది. మరో పంట చినీ అనంతపురం, కడపలో ప్రధాన ఉత్పత్తి. కోవిడ్ లో రూ.1 లక్ష వరకు టన్ను అమ్ముడుపోయింది. ఇప్పుడు రూ.30-రూ.60 వేలకు అమ్ముడుపోయేది.. దాని ధర కూడా తగ్గిపోయింది. అది కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. కోవిడ్ లో అరటి, చినీ పంటల కొనుగోళ్లలో ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లోలో అందుబాటులోకి తెచ్చాం. కోవిడ్ లాంటి సమస్యలున్నా రైతులకు అండగా ప్రభుత్వం ఉందన్న భరోసా కల్పించాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు. పూర్తిగా రైతులను గాలికొదిలేసింది. నెల్లూరు జిల్లాలో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది. పుట్టి ధాన్యాన్ని ఎంటీయీ 1010కి రూ.13- రూ. 14వేలకు.. కెఎల్ఎన్ ఎం రకం సన్నబియ్యం రూ.15వేలకు పైగా అమ్ముకున్నారు. అందులో ఎకరాకి 3 పుట్టీలు దిగుబడి వస్తుంది. పుట్టీ అంటే 950 కేజీలు అయితే.. ఎకరాకి రూ.12 వేలు వారికి రావాల్సిన ధర కోల్పోయారు. రైతులకు ధర్మ భద్దంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.250 కోట్లు మద్ధతు ధర కోల్పోయారు. ధాన్యం అమ్మకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నట్లు? రాయలసీమలో కొద్దిగా పండే సజ్జ పంట క్వింటాల్లు రూ.2770 ధర అయితే.. రైతులు కేవలం రూ.2వేలకే అమ్ముకుంటున్న దుస్థితి. ఎక్కడా మార్క్ ఫెడ్ నుంచి ప్రొక్యూర్ మెంట్ లేదు. టమోట గతంలో మార్కెట్ బాగుంది. హఠాత్తుగా మార్కెట్ కుప్పకూలిపోయింది. ఆ టైంలో 42.50 లక్షల టన్నుల టమోట ఉత్పత్తి అయితే... ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కేవలం 10 టన్నులు మార్కె ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. ● సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రత్తి రైతులు... మరో ప్రధాన పంటలు వరి, వేరుశెనగ, ప్రత్తి రాష్ట్రంలో 80 శాతం సాగవుతున్నాయి. ఇవి సరిగా పండి, వీటికి లాభసాటిగా ధర వస్తేనే రైతులు బాగుంటారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో ప్రత్తి సాగు జరిగితే ఒక్క కర్నూలు జిల్లాలోనే 5.55 లక్షల ఎకరాలు సాగు జరింది. అంటే 51 శాతం సాగు జరిగింది. అయినా అక్కడి రైతులే సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఆగష్టు 7 వరకు అనావృష్టి అనంతరం అతివృష్టితో పూత, పిందె దెబ్బతింది. ఇవాళ ప్రత్తికి సంబంధించి ఆదోని మార్కెట్ లో 15 నుంచి 16 వేల క్వింటాళ్ల ప్రత్తి వస్తోంది. క్వింటాలు ఎమ్మెస్పీ రూ.8110 అయితే మార్కెట్ లో కనిష్టంగా రూ.3,500 గరిష్టంగా రూ.7,300 వరకు ఉంది. సీసీఐ సెంటర్లు ప్రారంభిస్తున్నామని చెపుతున్నారే తప్ప కార్యాచరణ లేదు. ఉత్పత్తి తగ్గి నాణ్యత లేకపోవడంతో ధర పడిపోయింది. అలాంటప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ ఊసెత్తడం లేదు. మొక్కజొన్న రాష్ట్రంలో 4 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతుంది. అత్యధికంగా నంద్యాలలో సాగు అవుతుంది. కనీసమద్ధతు ధర రూ.2,400 అయితే ఇవాళ రూ.2100 మాత్రమే అమ్ముడుపోతుంది. కర్ణాటక మార్కెట్ లో రూ.2,300 అమ్ముడు పోతుంది. మన దగ్గర ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి ఎందుకు కొనుగోలు చేయలేకపోతుంది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి చూపించింది. ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది. వేరుశెనగ పంట విషయానికొస్తే.. రాష్ట్రంలో సగటున 2.80 లక్షల ఎకరాల్లో జరగాల్సిన సాగు తగ్గిపోయింది. పంట తీత సమయంలో వర్షాలు రావడంతో వేరుశెనగ మద్ధతు ధర కంటే రూ.600 తక్కువకు అమ్ముకుంటున్నారు. మరో అపరాలు పంట పెసర మొత్తం 20వేల ఎకరాల్లో సాగు జరిగితే ఎన్టీఆర్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగవుతుంది. నందిగామ నుంచి అధికార పార్టీ శాసనసభ్యురాలే అసెంబ్లీ సాక్షిగా పెసరకు మద్ధతు ధర లేదని చెప్పింది. ప్రభుత్వం ఆ పని కూడా చేయలేకపోతుంది. కూటమి ప్రభుత్వం రైతులకు మద్ధతు ధర తగ్గిన పంటలకు కనీస మద్ధతు ధరలు ఇవ్వడం లేదు సరికదా.. ధరలు విపరీతంగా పడిపోయిన ప్రతిసారీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తేనో.. మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ వారి తరపున మాట్లాడితోనే హడావుడిగా కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. మామిడి, పొగాకు, ఉల్లి పంటలను రైతుల నుంచి సేకరించి వారికి ఇప్పటివరకూ చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది. ఇలా అయతే రైతులు ఈ సంక్షోభం నుంచి బయటపడతారు. ● కనీసం యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం.. ఇక రైతులకు యూరియా సరఫరా చేయడంలో ఈ ప్రభుత్వం నూటికి నూరుశాతం విఫలమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో కేవలం ఒకే ఒక్కసారి యూరియా కొరత వస్తుందేమోనన్న అనుమానం వచ్చిన వెంటనే.. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండానే కేవలం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో 24 గంటల్లోనే అదనంగా స్టాక్ ఉన్న కర్నూలు జిల్లా నుంచి తరలించి సమస్యను పరిష్కరించాం. కానీ కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైంది. ఒకవైపు కేంద్ర ఎరువులశాఖ మంత్రి లేఖ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన కోటా కంటే ఎక్కువే యూరియా ఇచ్చామని.. వైయస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు రాసిన లేఖకు బదులిచ్చారు. టీడీపీ అనుకూల పత్రికలో కూడా యూరియా కొరత మీద వార్తలు వచ్చాయి. జూన్ నెలలో 10శాతం వరి సాగు జరిగితే 2లక్షల టన్నుల యూరియా సేల్ అయింది. ఇదంతా బ్లాక్ మార్కెట్ కి పోయిందని రాశారు. యూరియా ప్రభుత్వం నిర్దేశించిన ధరకు దొరకలేదు. అలా కావాలంటే రోజుల తరబడి లైన్లో నిల్చోవాల్సిన దుస్థతి. బ్లాక్ మార్కెట్ లో మాత్రం విచ్చలవిడిగా అమ్ముకున్నారు. వరి సాగుతో యూరియా చాలా అవసరం. కౌలు రైతులు యూరియా కోసం రోజుల తరబడి నిలబడాల్సి రావడం దురదృష్టకరం. ఇలాంటి దుస్థితిపై రైతులకు రావాల్సిన యూరియా కొరత లేకుండా చూడాలని రెవెన్యూ డివిజన్ అధికారికి వినతిపత్రం ఇవ్వాలని వైయస్సార్సీపీ పిలుపునిస్తే.. దాన్ని కూడా పోలీసు బలంతో ఈ ప్రభుత్వం నిలువరించింది. ఇక రైతులకు వేరుశెనగ, సెనగ పంటలకు విత్తనాలు సబ్సిడీలో ప్రభుత్వం ఇస్తుంది. వర్షాధార పంట కాబట్టి... రూ.10 వేల ఖరీదు చేసే విత్తనాలు ఇస్తారు. గతంలో ఆర్బీకేల ద్వారా రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చాం. ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో సీడ్ కార్పొరేషన్ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎవరకి ఇచ్చారో తెలియడం లేదు. రూ.5,800 శెనగ కనీస మద్ధతు ధర కాగా.. రూ.5,400 కూడా కొనేవాళ్లు లేకుండా పోయారు. మరోవైపు వారివద్ద నున్న శెనగ కంటే విత్తనాల ధరే ఎక్కువగా ఉంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి. భారదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఎగుమతుల్లో అత్యుత్తమ స్ధానంలో ఉంది. ఈ రంగంలో పరిశోధనలు ల్యాబ్ టూ ల్యాండ్ వరకు వెళ్లాయి. పరిశోధన శాలలో పరిశోధనలు రైతు వరకు వెళ్లాయి. ఆక్వా కల్చర్ లో నేను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర ఐసీఆర్ స్దాయి వరకు అవార్డులు పొందాను. రైతు స్వయం కృషితో ఈ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇవాళ ట్రంప్ టారిఫ్ లతో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఈ రంగాన్ని రక్షించడానికి ఏమేం చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచన చేయాలి. కానీ అది జరగడం లేదు. ● అన్నదాతలూ ఆత్మహత్యలొద్దు... రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ పల్నాడు రీజియన్ లో పొగాకు, మిర్చి రైతులు 2024-25లో 25 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. 2025-26 లో సెప్టెంబరు వరకు 8 మంది చనిపోయారు బీబీసీలో రైతుల వివరాలతో సహా ప్రచురితమైంది. జిల్లా వ్యవసాయఅధికారులు సైతం అంగీకరించారు. కర్నూలులో కూడా ఉల్లి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం వారికివ్వాల్సిన పరిహారం చెల్లించడంలో ఆలస్యం, ఆలసత్వం తగదు. రైతు సోదరులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు. రైతులకు అండగా వైయస్.జగన్ నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు రాయలసీమ నుంచి సాగు సంక్షోభం వల్ల 10 లక్షల మంది రైతుల కుటుంబాలు వలసపోయారు. ... తాజాగా రాష్ట్రంలో తిరిగి అదే పరిస్థితి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిస్థితి తీసుకురావద్దని.. ప్రభుత్వం దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ఎం వీ యస్ నాగిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు ఘోష రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.