తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై శాసనసభలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెంటనే క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మేల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినే విరూపాక్షి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తూ.. శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ సీఎం వైయస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరడం ఏ మాత్రం సరికాదని తేల్చి చెప్పారు. అసలు అసందర్భంగా ఆ అంశాన్ని ప్రస్తావించి, అప్పుడు సభలో లేని జగన్‌గారి గురించి, కామినేని శ్రీనివాస్ విమర్శలు చేశారని, అందుకు వెంటనే బహిరంగ క్షమాపణ కోరాలని కోరారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వాటిపై దుమారం రేగడంతో మాట మార్చడం కూటమి ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, విరూపాక్షి, శివప్రసాద్‌రెడ్డి ఆక్షేపించారు. నిజానికి సినీ ప్రముఖులు తనని కలిసినప్పుడు, అప్పటి సీఎం శ్రీ వైయస్ జగన్ వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించి, చాలా గౌరవంగా మాట్లాడారని, వారి పట్ల ఎక్కడా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపలేదని, వారిని అవమానపర్చలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ, ఆ తర్వాత మొన్న కూడా చిరంజీవిగారు వెల్లడించారని గుర్తు చేశారు. అయినా ఉద్దేశపూర్వకంగా జగన్‌గారిని నిందిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దురుద్దేశంతో జగన్‌గారిని నిందించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఇప్పుడు చాలా అమాయకంగా తన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరడం అసమంజసమని, అందుకు బదులుగా ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినే విరూపాక్షి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.