గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైల్ లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టు తారక్ ప్రతాప్ రెడ్డి ని వైయస్ఆర్‌సీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంచార్జి నూరి ఫాతిమా, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డిలతో కలిసి జోగి రమేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారనే కక్షతో, తప్పుడు కేసులు పెట్టి, జైళ్ళకు పంపుతున్న దుర్మార్గమైన ప్రభుత్వంను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి తాము పెడుతున్న తప్పుడు కేసులను న్యాయస్థానాలు ఆక్షేపిస్తున్నాయనే ఉద్దేశంతో అమాయకులపై గంజాయి కేసులు కూడా బనాయించే దారుణమైన పరిస్థితులు తొలిసారిగా చూస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పాలన చేయాల్సిన ప్రభుత్వమే దిగజారుడుతనంతో, చట్టాలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చేస్తోందని, మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం తెగబడుతోందని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు తారక్ ప్రతాప్‌రెడ్డి, సాయి భార్గవ్, సవీంద్రారెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేసిన ఉదంతాలే ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయని అన్నారు. ప్రజలకు ఆకర్షనీయమైన హామీలను గుప్పించి, ఎన్నికలకు ముందు వారిని మాయచేసి, అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేస్తున్న వైనంను ప్రశ్నించడాన్ని తట్టుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థతను ప్రజలు ప్రశ్నిస్తే, వారిపైన కూడా కేసులు పెడతామనే సందేశాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోందా అని ప్రశ్నించారు. నియంత పాలన ఉన్న దేశాల్లో కనిపించే పోకడలను సీఎం చంద్రబాబు ఏపీలో అమలు చేస్తున్నారని అన్నారు. న్యాయస్థానాలు ఒకవైపున సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై కన్నెర్ర చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వంలో మార్పు కనిపించడం లేదని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... అసెంబ్లీ హౌస్‌లో మేన్షన్ హౌస్ తాగి రావచ్చా? అసెంబ్లీ హౌస్‌లో మేన్షన్ హౌస్ తాగి రావచ్చా? స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు గత అయిదేళ్ళలో ఏం చేశాడు, ఎం మాట్లాడారో ప్రజలకు తెలుసు. అలాగే నటుడు, నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ హౌస్‌లో మేన్షన్ హౌస్ తాగి రావచ్చా? శాడీస్ట్‌లు అందరూ ఒకేచోట చేరి, దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టిస్తున్నారు. బాలకృష్ణ నందమూరి వారసుడా? లేక నారా వంశానికి వారసుడా? ఆయన నిజంగా నందమూరి వారసుడే అయితే ఆయన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన వారసుడు అవుతాడు. కానీ నేడు టీడీపీకి అధ్యక్షుడుగా నారా చంద్రబాబు ఉన్నారు. అటువంటప్పుడు ఆయన ఎన్టీఆర్‌కు రాజకీయ వారసుడు ఎలా అవుతాడు? ఆయన తన ఇంటిపేరును నందమూరికి బదులు నారా బాలకృష్ణ అని మార్చుకోవాలి. చంద్రబాబుకు తొత్తుగా మారిపోయాడు. ఆయన మేన్షన్ హౌస్ తాగి వచ్చాడా అనేది తెలియాలంటే బ్రీత్ ఎనలైజర్‌ను పెట్టాలి. కూటమి అరాచకాలు డిజిటల్ డైరీలో నమోదవుతున్నాయి: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంచార్జి నూరి ఫాతిమా కూటమి ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. రాజకీయ కక్షసాధింపులకు పోలీస్ వ్యవస్థను వినియోగించుకుంటున్నారు. సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు తారక్, సాయి భార్గవ్ లను అరెస్ట్ చేశారు. సాయి భార్గవ్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలపై మళ్ళీ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చట్టవిరుద్దంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవు. డిజిటల్ బుక్ లో బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా బాధితులకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. గంజాయి కేసులు పెట్టే స్థాయికి దిగజారారు: మనోహర్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయలేక, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దీనినే సోషల్ మీడియా ప్రజలు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతోంది. గతంలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, దాడుల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రశ్నించడంతో వందల మంది సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై తప్పుడు కేసులు పెట్టింది. సుప్రీంకోర్ట్ తీర్పులను కూడా ఉల్లంఘిస్తూ పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం చట్టవిరుద్దంగా వ్యవహరించేలా చేసింది. దీనిపై కోర్ట్‌లు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కి వేసి, మళ్ళీ తన నైజాన్ని చాటుకుంటోంది. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటం, ప్రజాసమస్యలపై పాలన అధ్వాన్నంగా మారడంతో అందరి దృష్టిని మళ్ళించేందుకు మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెగబడింది. దీనిలో భాగంగానే తారక్ ప్రతాప్‌రెడ్డిని కూడా అక్రమ కేసులతో అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల కిందట మరో సోషల్ మీడియా కార్యకర్త సువీంద్రారెడ్డిపై ఏకంగా గంజాయి కేసు పెట్టి, తాము ఎంతవరకు దిగజారిపోతారో ఈ ప్రభుత్వం చాటుకుంది.