మచిలీపట్నం: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా మెగా డియస్సీ నిర్వహించి నియామక పత్రాలిస్తామని హామీ ఇచ్చి.. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం నిలువుగా మోసం చేసిందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. మచిలీపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... 25 వేల ఉపాధ్యాయపోస్టుల భర్తీ చేస్తానని నమ్మించిన చంద్రబాబు ప్రభుత్వం.. కేవలం 15,941 పోస్టులు మాత్రమే భర్తీ చేయడాన్ని తప్పు పట్టారు. ఇది కచ్చితంగా నిరుద్యోగులను మోసం చేయడమేనని తేల్చి చెప్పారు. మరోవైపు శాసనసభలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, బాలకృష్ణలు మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి పదవి కోసం కామినేని శ్రీనివాస్ విచక్షణ లేకుండా మాట్లాడితే..బాలకృష్ణ తప్పతాగి కళ్లునెత్తికెక్కి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● మెగా డియస్సీ కాదు దగా డియస్సీ... మెగా డియస్సీ అంటూ 16 నెలల హంగామా చేసిన కూటమి ప్రభుత్వం గురువారం మందడంలో డియస్సీలో ఎంపికైన 15,941 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో భారీ హంగామా సృష్టించింది. భారీ సినిమా షూటింగ్ ను తలపిస్తూ... ఈవెంట్ మేనేజ్ మెంట్ తరహాలో ఈ కార్యక్రమం నిర్వహించడం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ల దిగజారుడు తనానికి నిదర్శనం. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే 25 వేల పోస్టులతో మెగా డియస్సీ నిర్వహించి, 100 రోజుల్లోపు నియామకాలు పూర్తి చేస్తామని కూటమి నేతలు ప్రచారంతో ఆర్భాటం చేశారు. మెగా డియస్సీ మీద మొదటి సంతకం అని చెప్పి దాన్ని కేవలం 15,941 పోస్టులకే పరిమితం చేశారు. వాస్తవానికి అప్పటికే వైయస్.జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన 6,100 పోస్టులను కూడా తమ ఖాతాలో కలుపుకున్న కూటమి ప్రభుత్వం కేవలం 15,941 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. అంటే కూటమి ప్రభుత్వం భర్తీకి నిర్ణయించిన పోస్టులు కేవలం పదివేలు మాత్రమే. టీటీసీ, బీఈడీలు చేసిన అభ్యర్ధులు ఎన్నో ఎళ్లుగా కష్టపడి వాళ్ల ప్రతిభమీద ఉద్యోగాలు సంపాదించుకుంటే... మధ్యలో కూటమి ప్రభుత్వ హంగామా, ప్రచార ఆర్భాటం ఎందుకు ? ఇది మెగా డియస్సీ కాదు, దగా డియస్సీ. ● ఆర్భాటాలు లేకుండా 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చిన వైయస్.జగన్.. వైయస్.జగన్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 1.35లక్షల శాశ్వత ఉద్యోగులను గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించారు. ఐదేళ్ల కాలంలలో 2.14 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమిస్తే... వైద్య, ఆరోగ్యశాఖలో సుమారు 50 వేల పైచిలుకు ఉద్యోగ నియమాకాలు చేపట్టారు. ప్రతిభతో కష్టపడి చదువుకుని ఉద్యోగాలు పొందిన వారితో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ రోజూ ఇలా ఆర్భాటాలతో ప్రచారం చేసుకోలేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నాయకుడు వైయస్.జగన్. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ఆర్టీసీలో ఉన్న 51 వేల మందిని ప్రభుత్వంలో ఉద్యోగులుగా విలీనం చేశారు. ఆ రోజు ఈ 51 వేల మందిని పిలిచి ఉంటే భారీ సభ అయ్యుండేది. ● డియస్సీలో అడుగడుగునా తప్పులే... డియస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి నియామకాల అన్నీ తప్పలు తడకలే. మెరిట్ లిస్టు ప్రకటించలేదు. మొదటి ప్రాధాన్యత కింద ఏది పెడితే అదే ఆర్డరు జారీ చేశారు. 15వేల పై చిలుకు మందికి నేరుగా నియామకాపత్రాలు పంపించారు. డియస్సీ రాసిన 3లక్షల మందికి ఎందుకు మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు. డియస్సీ పేరుతో ఏం తంతు జరుగుతుంది ? చంద్రబాబునాయుడు 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నారు.అప్పటి డియస్సీ అభ్యర్ధుల గోడును వైస్.జగన్ ముఖ్యమంత్రి గా వచ్చేంతవరకు ఎందుకు పరిష్కారం కాలేదు? మీ పరిపాలనాతప్పులు వలన కోర్టు కేసులతో వయసైపోయినా వారికి దిక్కులేకుండా పోయింది. బిఈడీ చేసి వేరే ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి. మీ హయాంలో సమస్యను పరిష్కరించలేదు. ఏళ్లతరబడి ఉద్యమాలు చేసిన వారి సమస్యకు చివరకు వైయస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కారం లభించింది. మీరు చేసిన పాపాలకు చివరకు వైయస్.జగన్ హాయంలో న్యాయం జరిగింది. సమాచార హక్కు చట్టం కింద విద్యాశాఖకు ఓ ఉపాధ్యాయుడు పెట్టిన అర్జీ ద్వారా రాష్ట్రంలో ఇంకా 27,409 ఉపాధ్యాయ పోస్టుల ఇంకా ఖాళీగా ఉన్నాయని సమాధానం ఇచ్చారు. మరి మీరు కేవలం 15వేల పైచిలుకు పోస్టులు మాత్రమే ఎందుకు భర్తీ చేస్తున్నారు. ఎన్నికల ముందు జబ్బలు చరుస్తూ... దగా మాటలు మాట్లాడారు. 2025 డియస్సీ నోటిఫికేషన్ లో మీరు చేసింది పచ్చి దగా. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు టీచర్లుగా పనిచేస్తున్న వారికి డియస్సీలో వెయిటేజ్ మార్కులు కూడా ఇవ్వలేదు. అన్నేళ్లుగా ప్రభుత్వాలు వారితో వెట్టిచాకిరీ చేయించుకుని వారికి వెయిజేట్ మార్కులు ఇవ్వకపోవడం వల్ల వారికి అన్యాయం జరిగింది. మరోవైపు ప్రశ్నాపత్రాల్లోనూ అనేక తప్పులున్నాయి. దాన్ని సరిచేసి ఏమైనా మార్కులు ఇచ్చారా? లేదా? అన్నది ఎవరికీ తెలియని ప్రశ్న. ● ఈవెంట్ మేనేజిమెంట్ గా మారిన ప్రభుత్వ పాలన... ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది మొదటి నెల జాబ్ కేలండర్ ఇస్తామని ఇప్పుడేం చేస్తున్నారు ? 2014లో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, అది లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇది మోసం కాదా? ఈ దఫా 2024లో ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలిస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. రెండూ లేవు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ 2014, 2024 ఎప్పుడైనా అదే దగా, అదే మోసం. చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమంటారు. మీరు విమానాలు, హెలీకాప్టర్లలో తిరుగుతున్నారు. నిరుద్యోగులు సైకిళ్ల మీద తిరుగుతున్నారు. ఎక్కడ నిలదీయాలి? ఇంత మోసానికి పాల్పడి, హంగు,ఆర్భాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఈవెంట్ మేనేజిమెంట్ గా మార్చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. పాత పెన్షన్లు ఇవ్వడానికే సీఎం చంద్రబాబు విమానం, హెలీకాప్టర్ లలో వెళ్తాడు. ఇక్కడ షామియానా ఖర్చు రూ.1 కోటి. అక్కడికి వెళ్లి ఒక పెన్షన్ ఇచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తరహాలో స్ట్రిప్టు ప్రకారం జరుగుతుంది. ఆకస్మికంగా వెళ్లినట్లు హంగామా చేస్తూ... ఆటో ఎక్కినట్లు నటిస్తారు. ఇద్దరికీ కాలర్ మైక్ లు ఉంటాయి. కర్నూలులో రైతుబజారుకి వెళ్లారు. ఇవాళ కర్నూలులో ఉల్లి రైతులు రోడ్లమీద పారబోస్తున్నారు. వారిని పట్టించుకోరా? చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతులు పండించే ముతక బియ్యం ఎవరూ తినరు, అది సారా, బ్రాందీ తయారీకీ మాత్రమే పనికి వస్తుందని చెబుతున్నారు. మరి పొగాకు, మిర్చి, కందులు, పెసలు, మినుములు, ఉల్లికి గిట్టుబాటు ధర ఉందా? నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ఏ పంటకు గిట్టుబాటుకు ధర ఉంది? మామిడికి, అరటికి ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర ఉంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఛాలెంజ్ చేస్తున్నాను. మామిడి రైతులకు కేజీకి కనీసం నాలుగు నయాపైసలు ఏ ఒక్కరికైనా మీరు సాయం చేశారా? ఇది పచ్చి దగా. వైయస్.జగన్ రైతుల కోసం ఎక్కడికి వెళితే అప్పుడు హడావుడి చేస్తారు. కేంద్ర మంత్రులను కలుస్తారు. అప్పుడు వీరికి రైతులకు గుర్తుకువస్తారు. అంటే అప్పటివరకు ఈ ప్రభుత్వం పాలన గాలికొదిలేసి... ముగ్గురు మూడు విమానాల్లో తిరుగుతున్నారు. ● ఈనాడు కిరణ్ - సిగ్గులేని రాతలు... ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్ కి కనీసం సిగ్గు లేదు. వైయస్.జగన్ 51 సార్లు బెంగుళూరు వెళ్లి వచ్చాడు అని రాస్తున్నాడు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఢీపాక్టో ముఖ్యమంత్రి ముగ్గురూ కలిసి ఎక్కడ ఉంటున్నారు. హైదరాబాద్ ఎన్ని సార్లు వెళ్లి వస్తున్నారు. శుక్రవారం చంద్రబాబు కొడుకు వెళ్లి సోమవారం వస్తాడు. శనివారం తండ్రి హైదరాబాద్ వెళ్లి సోమవారం వస్తాడు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండి వారానికో పదిరోజులకో ఒకసారి షూటింగ్ కు వచ్చినట్లు ప్రత్యేక విమానంలో వచ్చి వెళ్తాడు. ఎక్కడైనా ప్రజలు, రైతులు కష్టాల్లో ఉంటే చూసి పరామర్శించేవాళ్లు లేరు. సిగ్గు లేకుండా వైయస్.జగన్ మీద, వైయస్.భారతి మీద పడి ఏడుస్తారు. తప్పుడు రాతలు రాస్తారు. కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియా వైయస్.జగన్ మీద పడి ఏడవడం మానేసి ప్రజల కష్టాల వైపు చూసి ఏడవమని హితవు చెబుతున్నాం. అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడిగా, పాలపక్షంతో ధీటుగా, అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా, 40శాతం ఓట్లు గెల్చుకున్న పార్టీగా ప్రజల తరపున తన గళం వినిపించడం కోసం, ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీయడం కోసం సరైన సమయాన్ని ఇచ్చే దానికి అవకాశం కల్పించాలని వైయస్.జగన్ కోర్టును ఆశ్రయించారు. దానిమీద ఏ మాత్రం వయస్సుకు, తాను కూర్చున్న కుర్చీకి కూడా విలువ ఇవ్వకుండా అవాకులు, చవాకులు మాట్లాడుతుంటే...కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆయనకు తాళం కొడుతూ మాట్లాడారు. కైకలూరులో ఎన్ని దారుణాలు జరిగినా, రోడ్లు సక్రమంగా లేకపోయినా, ప్రజలు కష్టాల మీద, దళితవాడ లో జనసేన పార్టీ కి చెందిన వాళ్లు కత్తులతో కిరాతకంగా దాడి చేస్తే దాని మీద ఏ రోజూ మాట్లాడలేదు. పైగా ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ల జోలికి వెళ్లవద్దని చెబుతాడు. ఆయన తన నియోజకవర్గానికి సంబంధించిన విషయం కాకుండా సినిమాల మీద, సభలో చర్చలో లేని అంశంపై మాట్లాడారు. సినిమాల గురించి, సినిమా టిక్కెట్ల రేట్లు గురించి సంబంధం లేని అంశం మాట్లాడుతూ...వైయస్.జగన్ గారి దగ్గరకు చిరంజీవిగారు, సినిమా పరిశ్రమ ప్రతినిధులు అందరూ నడిచివచ్చారు. తీరా వచ్చిన తర్వాత నేను మాట్లాడను, సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతారు అని అంటే చిరంజీవి గారు కేకలు వేసారు, అప్పుడు భయపడి వైయస్.జగన్ వాళ్లతో చర్చించారు అని నిస్సిగ్గుగా మాట్లాడారు. కనీస విచక్షణ, ఇంగిత జ్ఞానం లేకుండా... మంత్రిపదవి కోసం నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఊరు పొమ్మని, కాడి రమ్మంటున్న వయసులో పచ్చి పాపపు మాటలు మాట్లాడారు. చిరంజీవి గారు గడ్డిపెట్టారు. ● తప్పతాగిన బాలకృష్ణ.... పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా విమానాల్లో తిరగడం, తన బావ చంద్రబాబు వంగివంగి దండాలు పెట్టడం చూసి బాలకృష్ణ భరించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రితో సమానంగా కాన్వాయ్, పోలీసు భద్రత చూసి కుత, కుతలాడుతూ బాలకృష్ణ రగిలిపోతున్నాడు. సాధారణంగా డ్యూటీకి వచ్చినప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లకు మద్యం సేవించి వచ్చారేమోనని బ్రీత్ ఎనలైజర్ తో పరీక్ష చేస్తారు. చివరకు బ్రీత్ ఎనలైజర్లను అసెంబ్లీ గేటు వద్ద కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పతాగి కళ్లునెత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఎవరు సైకో? బాలకృష్ణే సైకో. సిగ్గు లేకుండా నేను కలవలేదని చెబుతున్నాడు. వేద మంత్రాలు, దేవుడి పద్యాలు, పురాణాలు బట్టీపెట్టి.. మైక్ లో వాటిని వల్లవేయడం... మద్యం తాగి నోటికొచ్చినట్లు మాట్లాడ్డం పరిపాటుగా మారింది. ● నాతో మాట్లాడలేదని ప్రమాణం చేయగలవా... బాలకృష్ణ నాతో ఫోన్ లో మాట్లాడాడు. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాతో మాట్లాడలేదని నువ్వు ప్రమాణం చెయ్యగలవా బాలకృష్ణ. సంస్కారవంతమైన ఎన్టీఆర్ దంపతులకు పుట్టి.. అసెంబ్లీ సాక్షిగా ఇంత సంస్కారహీనంగా మాట్లాడుతావా? అఖండ సినిమా కోసం వైయస్.జగన్ ను కలవడానికి అపాయింట్ మెంట్ ఇప్పించమని నాకు స్వయంగా ఫోన్ చేసి అడిగావు. మిరయాల రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి వచ్చి నా తో ఫోన్ లో మాట్లాడించాడు. నేను అదే విషయం వైయస్.జగన్ గారికి చెప్పాను. అఖండ సినిమా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చయ్యాయి, అదనపు షోలు కోసం చూసీ, చూడనట్టు పొమ్మని అడిగారని చెప్పాను. దాంతో వాళ్లకు కావాల్సింది చేసి పెట్టండని వైయస్. జగన్ చెప్పారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి భాష మాట్లాడతావా? ● వైయస్.జగన్ తండ్రి గారు చేసిన సాయం మర్చిపోయావా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సిన వాడివి, మనిషి జన్మ ఎత్తిన ఎవడూ ఆ సాయాన్ని మర్చిపోడు. వైయస్.జగన్ ను కలవలేదని చెప్పు, రాజకీయంగా విభేదించు. మీ బవసతారకం ఆసుపత్రి బిల్లులు కోసం డాక్టర్ హరికృష్ణకు ఫోన్ చేయలేదా? మీ ఆసుపత్రి బిల్లులు గురించి ఇబ్బంది పెట్టారా? మీరు అమరావతిలో బసవతారకం కేన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థలం తీసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రి నిర్మాణం నిలిపివేశారు. ఇప్పుడు మరలా శంకుస్థాపన చేస్తున్నారు. ఎవరు సైకో? ఎవరివి సైకో ఆలోచనలు ? మీకు చిరంజీవిగారితో విభేదాలు ఉండవచ్చు, పవన్ కళ్యాణ్ తోనూ ఉండొచ్చు. అది మీరు తేల్చుకొండి. కానీ ఇతరుల మీద పడి ఎందుకు ఈ ఏడుపులు. చిరంజీవి గారికి విలువ ఇచ్చి సొంత అన్నలా చూసుకుంటే.. ఇవాళ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి వాళ్ల వళ్ల చాలా నిందలు మోసాం. కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ లాంటి దుర్మార్గుల నోళ్లు మూతపడేలా చిరంజీవి గారి ఇవాల్టికి మంచి పనిచేశారు. ఆయన చర్యలను స్వాగతిస్తున్నాం. ● వైయస్.జగన్ జీవోనే అనుసరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... సినిమా ఇండస్ట్రీ పట్ల మేం తీసుకున్న నిర్ణయాలు తప్పుడువి అయితే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మేము ఇచ్చి జీవోలను ఎందుకు రద్దు చేయడం లేదు? అదే జీవోలను అనుసరించి సినిమా వాళ్లను మీ దగ్గరకి ఎందుకు రప్పించుకుంటున్నారు. మీ కాళ్ల దగ్గరకి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మీరు ఎందుకు నియంత్రిస్తున్నారు? మీరు పై నుంచి ఊడిపడ్డారా ? మీరు చేస్తే మంచి పనులు, వైయస్.జగన్ చేస్తే పాపపు పని అవుతుందా? ఆ రోజు వైయస్.జగన్ చేసింది తప్పైతే మీరు ఆ జీవోను రద్దు చేయవచ్చు కదా? ఓటీటీలో నెలకు రూ.100 కడితే ఇంట్లోనే సినిమా చూసే పరిస్థితి వస్తున్న నేపధ్యంలో...పేదవాడికి ధియేటర్లులో సినిమా అందకుండా ఉంటే పరిస్థితి ఉంటే.. సినిమా పరిశ్రమ దెబ్బతింటుందని ఆ రోజు వైయస్.జగన్ సినిమా ప్రతినిధులకు చెప్పారు. సామాన్యుడికి ఏకైక ఎంటర్ టైన్ మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్ధితి రాకూడదన్నదే నా తపన అని చెప్పారు. దీంతో పాటు అగ్ర నటులు రెండేళ్లకో, ఏడాదికో ఒక సినిమా తీస్తే.. సాంకేతిక నిపుణులు, చిన్న నటులు ఇబ్బంది పడతారని చెప్పారు. మీరు నాలుగు సినిమాలు చేస్తే బాగుంటుందని కూడా చెప్పారు. విశాఖలో స్థలాలు ఇస్తాం, స్టూడియోలు ఏర్పాటుచేయాలని కూడా చెప్పారు. షూటింగ్ లు చేద్దామని కూడా చెప్పారు. చిరంజీవి, వైయస్.జగన్ పరస్పరం సోదర వాత్సల్యంతో ఆ రోజు వ్యవహరించారు. ఇంత గొప్పగా వైయస్.జగన్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు సినిమా పరిశ్రమను వాడుకోవడం తప్ప ఏనాడైనా ఉపయోగపడ్డారా? అని సూటిగా నిలదీశారు.