చిత్తూరు: ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. నారా చంద్రబాబు పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని ఆమె తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా ఆర్కే రోజా.. గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి దిగిన తీరు దారుణం. అమెను, ఆమె భర్తను నిర్బంధించి, కారు మీద దాడి చేయడం ఏమిటి? అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం మరింత భయంకరం. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధిపై ఇలా దాడి చేయడం అమానుషం. బూతులు తిడుతూ, కర్రలు, రాళ్లు వర్షంలా కురిపించడమేమిటి? "రెడ్ బుక్" పేరుతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు ఇది నిదర్శనం. హారికగారు ఏం తప్పు చేశారు? ఒక బీసీ మహిళా నాయకురాలు తాను పని చేస్తున్న పార్టీ సమావేశానికి హాజరయ్యే హక్కు లేదు? అదే తప్పా? టీడీపీ, జనసేన గూండాలు బీసీ మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని భావిస్తున్నారా? దాడి చేసి ఆ హక్కును కైవసం చేసుకున్నట్టు భావిస్తున్నారా? మీరెవరు వారిని అడ్డుకోవడానికి? చంద్రబాబు గారు—"ఆడపిల్ల మీద చెయ్యి వేసిన రోజు, అది ఆఖరి రోజవుతుంది" అన్న మాట మీది కదా? ఇప్పుడు మీ పార్టీకి చెందినవాళ్లు చెయ్యివేస్తే... నిజంగా అది వారికీ చివరి రోజవుతుందని చూపిస్తారా? పవన్ కళ్యాణ్ గారు—"ఆడపిల్లల జోలికొస్తే మక్కెలు విరగ్గొడతా" అన్నదే మీ మాట కదా? ఇప్పుడు బీసీ మహిళా జడ్పీ ఛైర్మన్ మీద దాడి చేసిన మీ జనసేన కార్యకర్తల మక్కెలు విరగ్గొడతారా? ప్రజల ముందు మీ బాధ్యత స్పష్టం చేయండి. మీరు ఆడబిడ్డల, బీసీల పక్షాన నిలబడతారా? లేక గూండాలకు అండగా నిలుస్తారా?