నెల్లూరు జిల్లా: కరేడు రైతుల అభిష్టానికి భిన్నంగా బలవంత భూసేకరణ ఆపాలని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ డిమాండ్ చేశారు. కందుకూరు నియోజకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం బెల్ట్ షాపులు కల్తీ మందుల తయారీకి కేంద్రంగా మారిందని, రేషన్ మాఫియా, ఇసుక దందాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కందుకూరు రేషన్ మాఫియాలో స్థానిక ఎమ్మెల్యేకు వాటా ఉందని, నియోజకవర్గంలో జరిగే ప్రతి పనికి కప్పం కట్టమని హుకుం జారీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. కరేడు రైతులను వారి అభిప్రాయాలను గౌరవించకుండా బలవంతంగా భూములు సేకరణ చేయడం సమంజసం కాదని రైతుల అవిష్టానికి భిన్నంగా వ్యవహరించరాదని అన్నారు. కరేడు రైతుల భూమి పోరాటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వంలో ఇండోసోల్ ప్రాజెక్టుకు చేవూరు ప్రాంతంలో భూములు కేటాయిస్తే ముడుపులు స్వీకరించిన కూటమి ప్రభుత్వం కరేడు ప్రాంతంలో వ్యవసాయ భూములను ఇందుసోల్ సోలార్ ప్రాజెక్టుకు కేటాయించి కరేడు ప్రాంత ప్రజలు, రైతులు మధ్య ఆందోళన నెలకొనే విధంగా వ్యవహరిస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర రాక వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక అల్లాడిపోతున్నారని తక్షణమే రైతు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు 2024లో సూపర్ సిక్స్ ఇస్తానని హామీలు ఇచ్చి ప్రజలకు పంగనామాలు పెట్టాడని బాబు మోసపు మాటలు నమ్మిన ప్రజలు తీవ్ర ఆవేదనతో బాధపడుతున్నారని తెలిపారు. బాబు అబద్ధపు హామీలను ప్రజలకు వివరించి తెలియజేయుటకు బాబు మేనిఫెస్టో రీకాలింగ్ ప్రోగ్రామ్ అని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నియోజకవర్గ స్థాయి మీటింగు జరిపామని మండల,గ్రామ, ఇంటింటి మీటింగులు జరిపి బాబు అబద్ధపు హామీలను ఎండ కట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనకు అధికారులు సహకరిస్తున్నారని కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని భ్రమలో బతుకుతున్నారని అవినీతి పరిపాలనకు అధికారులు సహకరిస్తే భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి పాలిటిక్స్ డైవర్ట్ చేసి బతకాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని ఎల్లకాలం డైవర్ట్ పాలిటిక్స్ చెల్లవని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ జగన్ అంటే ఒక నమ్మకం అని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా పరిపాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి అని అన్నారు. జగన్ మాట ఇస్తే మడిమ తిప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదల ముంగిటకు చేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారని అన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం చేస్తున అరాచక పరిపాలన ఎంతో కాలం సాగదని ఎవరు ఎన్ని అనుకున్న 2029లో ఎన్నికల జరిగిన, జెమిలి ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. మండల, గ్రామ స్థాయి బాబు రీ కాల్స్ మేనిఫెస్టో కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు అభిమానులు,ప్రజలు అందరూ విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి వైసిపి నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బాబు షూరిటి మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించి అందలి విషయాలను విశదపరిచారు.