తిరుపతి: సీఎం చంద్రబాబు కుట్రలు, పోలీస్ ఆంక్షలను సైతం ప్రజాభిమానంతో అధిగమించి వైయస్ జగన్ చిత్తూరు పర్యటన విజయవంతంగా జరిగిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ, అధికార బలంతో రైతుల ఆవేదనను అణిచివేయాలని చూసిన చంద్రబాబుకు ఇది చెంపపెట్టని అన్నారు. మామిడి రైతులను ఆదుకోవడంలో విఫలమైన ఈ ప్రభుత్వం, అండగా నిలిచేందుకు వచ్చిన వైయస్ జగన్ పట్ల చూపిన దుర్మార్గంపై రైతుల నుంచి వచ్చిన ఆగ్రహంతో ప్రభుత్వం తోకముడిచిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తద్వారా రైతులకు మద్ధతు ధర కల్పించాలని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బంగారుపాళ్యెం పర్యటనకు వచ్చారు. హెలిప్యాడ్ వద్దకు 30 మంది మాత్రమే రావాలి, మొత్తం అభిమానులు 500లకు మించకూడదంటూ అడ్డగోలు నిబంధనలు విధించడమే కాకుండా నోటీసులు, కేసుల పేరుతో ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. అంతే కాకుండా పలుచోట్ల గృహ నిర్బంధాల పేరుతో రైతులను భయాందోళనలకు గురిచేశారు. అధికారం ఉంది కదా అని పోలీసులను అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి గత వారం రోజులుగా చంద్రబాబు చేసిన ప్రయత్నం హిట్లర్ నియంత పాలనను తలపించింది. చిత్తూరు ఎస్పీతో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయించి జగన్ పర్యటనకు వెళ్లిన వారిపై రౌడీషీట్లు తెరుస్తామని భయపెట్టారు. వైయస్ జగన్ పర్యటనకు అభిమానులు, రైతులు రాకుండా అడ్డుకోవాలనే కుట్రతో బంగారుపాళ్యెం చుట్టుపక్కలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, దాదాపు 1600 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేసి జగన్ కోసం వచ్చే వారిని భయాందోళనలకు గురిచేశారు. ఆఖరికి జగన్ పర్యటనకు వచ్చే కార్లు, బైకులు, ట్రాక్టర్లు పెట్రోల్, డీజిల్ కూడా పోయొద్దంటూ పెట్రోల్ బంకు యజమానులకు ఆదేశాలిచ్చారు. జగన్ అంటే జనం, జగన్ వస్తే జన ప్రభంజనం ఉంటుందని మరోసారి రుజువైంది. రోడ్లను బ్లాక్ చేస్తే కాలినడకనే కొండలు, వాగులు దాటుకుంటూ ఆయన పర్యటనను విజయవంతం చేశారు. పోలీసుల అడ్డంకులు, లాఠీచార్జీల దాడులను లెక్కచేయకుండా వచ్చిన అభిమాన సంద్రం కూటమి ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గరపడ్డాయని సమాజానికి తెలియచెప్పాయి. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మంత్రి అచ్చెన్న అబద్ధాలు వైయస్ జగన్ పర్యటన పూర్తయిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలను తప్పదోవ పట్టించాలనే ప్రయత్నంలో అన్ని అబద్ధాలు చెప్పారు. లేని సమస్యను సృష్టించడానికి వైయస్ జగన్ బంగారుపాళ్యెం పర్యటనకు వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం మామిడి రైతులను గాలికొదిలేస్తే వారి పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయడానికి రావడం వైయస్ జగన్ చేసిన తప్పా? సమస్య నిజంగా లేకుంటే వైయస్ జగన్ చిత్తూరు వస్తానని చెప్పగానే పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో చంద్రబాబు హడావుడిగా మీటింగ్ పెట్టుకునేవాడా? జగన్ పర్యటన ఖరారైన తర్వాతనే రైతులకు రూ.6ల రశీదులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 80 శాతం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు మరో అబద్ధం చెబుతున్నారు. అచ్చెన్నాయుడు పొలాలకు వస్తే ఇంకా 50 శాతం పంట చెట్లకే ఉందని నిరూపిస్తాం. కోసిన మామిడి కాయలు కూడా రోడ్ల పక్కన లారీల్లో కుళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి 1.50 లక్షల టన్నులు మాత్రమే కొన్నారని ఇంకా 1.70 లక్షల టన్నులు కొనాల్సి ఉందని నాలుగు రోజుల క్రితమే చెప్పారు. ఆ లక్షన్నర టన్నులు కూడా 35 రోజులుగా సేకరించిన పంట. ప్రభుత్వం ఎన్ని భయాందోళనలకు గురిచేసినా జగన్ పర్యటన విజయవంతం కావడంతో ఏం చెప్పాలో తెలియక డబ్బులు ఖర్చు చేసి ప్రజలను తీసుకొచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. 6 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ పర్యటన కోరామని మరో అబద్ధం చెప్పారు. ఎస్పీ అనుమతిచ్చిన చోటనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆయన చెప్పిన రూట్ మ్యాప్ లోనే వస్తుంటే ఎస్పీ అడ్డుకున్నారు. శశిధర్ అనే మా కార్యకర్తను పోలీసులు లాఠీలతో రక్తం కారేలా కొట్టారు. వందల మందిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు.