ఈవీఎం బ్యాచ్‌ను జనం ఎగరేసి కొడతారు.. జాగ్రత్త

మాజీ మంత్రి ఆర్కే రోజా

మూడు కోతుల్లా మూసుకున్న బాబు, లోకేష్‌, పవన్‌

విద్యాశాఖ మంత్రి అంటే ఎలా ఉండాలో  ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలి

కూటమి ఎమ్మెల్యేల‌కు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా?

కొండ‌పిలో `బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ` కార్య‌క్ర‌మం

ప్రకాశం: ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే  జనం ఎగరేసి కొడతార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చ‌రించారు. శుక్ర‌వారం కొండపి నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. 

స్కాంల విజ‌న‌రీ చంద్ర‌బాబు
నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నార‌ని మాజీ మంత్రి రోజా మండిప‌డ్డారు. విజన్ ఉంది..  విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నార‌ని విమ‌ర్శించారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు  మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి  జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. 
`కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే  లోకేష్  చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్‌ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు. 

పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖ‌మంత్రి అంటే ఎలా ఉండాలో  ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్‌ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు  వైయ‌స్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.

పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే  భయపడటానికి ఇక్కడ ఉన్నది  లోకేష్ కార్యకర్తలు కాదు... వైయ‌స్ జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే  జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి  రోజా అన్నారు. 

Back to Top