ప‌ట్ట‌ప‌గ‌లే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

శ్రీ‌కాకుళం జిల్లాలో దారుణం

శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట గ్రామ సమీపంలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణ హ‌త్య జ‌రిగింది. గ్రామంలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త, ఉప సర్పంచ్ సత్తారు గోపి (35) దారుణ హత్యకు గురయ్యాడు. రాళ్లు, కర్రలతో దుండగులు తల, శరీర భాగాలపై కొట్టి అతన్ని హతమార్చిన ఘటన పట్టపగలు న‌డిరోడ్డుపై జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ హత్య వెనుక టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

సత్తారు గోపి వైయ‌స్ఆర్‌సీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్రియాశీల‌క‌ కార్యకర్తగా గుర్తింపు పొందాడు. ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజులకే అదే గ్రామంలో మరో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కూన ప్రసాద్ హత్యకు గురైన ఘటన స్థానికంగా ఉద్రిక్తతను రేకెత్తించింది. ఈ రెండు హత్యల వెనుక రాజకీయ కక్షలే కారణమని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో బాధితుడి బంధువులు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేసినప్పటికీ, ఈ ఘటన స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఈ హత్యను టీడీపీ నాయకులు ప్రోత్సహించిన దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.

వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఈ ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చట్టం, లా అండ్ ఆర్డ‌ర్‌ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయ‌ని, రెడ్ బుక్ రాజ్యాంగంలో య‌థేశ్చ‌గా హ‌త్య‌లు, అరాచ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని మండిప‌డుతున్నారు. “సత్తారు గోపి హత్య రాజకీయ కక్ష సాధింపు చర్య. టీడీపీ కార్య‌క‌ర్త‌లు బహిరంగంగా హత్యలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యలపై వెంటనే నిష్పక్షపాత విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Back to Top