తాడేపల్లి: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నుంచి టీడీపీ, పోలీసులు కుమ్మక్కై సృష్టించిన అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు 35 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ఆధారాలతో మేం ఫిర్యాదులు చేసినా కనీసం ఒక్క దానిపైన కూడా ఎన్నికల కమిషనర్ చిత్తశుద్దితో చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. అందువల్లే ఈ ఎన్నికల్లో టీడీపీ యథేచ్ఛగా పోలీసులను కాపలా పెట్టుకుని మరీ దొంగ ఓట్లు వేయించుకుందని, మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రజాస్వామ్యంను పట్టపగలే ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వ అరాచకానికి రాష్ట్ర ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్‌తో గెలిచారు: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు ముందు రెండు రోజుల నుంచే ఒక్క కేసు కూడా లేని వైయస్ఆర్‌సీపీ నాయకులను కార్యకర్తలను వందల మందిని పోలీసులు బైండోవర్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పోలింగ్ కేంద్రాలను ఒక ఊరి నుంచి మరో ఊరికి స్వాపింగ్ చేశారు. పక్క జిల్లాల నుంచి వేల సంఖ్యలో రౌడీలను పులివెందుల్లో రంగంలోకి దించారు. మంత్రి వర్గం మొత్తాన్ని, టీడీపీ సీనియర్ నాయకులను, స్థానిక ఎమ్మెల్యేలను మొత్తాన్ని పులివెందుల లోనే మోహరించారు. అడుగుడునా అన్యాయాలు, అరాచకాలు, దాడులు చేసి ఆఖరుకి ఎన్నికల్లో కూడా బూత్ క్యాప్చరింగ్ చేసి రిగ్గింగ్ కి పాల్పడ్డారు. మా పార్టీ సానుభూతిపరులు, ఓటేసేందుకు రాకుండా స్లిప్పులు లాక్కుని వెనక్కి పంపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కర్రలతో రౌడీలను పహారా పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన క్షణం నుంచి ఏ ఒక్క విషయంలోనూ పోలీసులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదు. మా పార్టీ నాయకుల కార్లను కర్రలు, రాడ్లతో ధ్వంసం చేసి అందులో ప్రయాణిస్తున్న మా ఎమ్మెల్సీ బీసీ నాయకుడు రమేశ్ యాదవ్ మీద దాడి చేశారు. ఎన్నికల కమిషన్ దోషిగా నిలబడింది: దొంగ ఓట్లతో టీడీపీ చేసిన బరితెగింపు కార్యక్రమం గురించి ఆధారాలతో సహా మా అధ్యక్షులు వైయస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి వివరిస్తే జిల్లా కలెక్టర్ కూడా భయపడిపోయాడు. వెంటనే కలెక్టర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించినట్టు ఫోటోలతో చేసిన పోస్టులు సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ కలెక్టర్ కూడా ఇంతలా బరితెగించి ఉండడేమో. నారా లోకేష్ సోషల్ మీడియా అకౌంట్ లో దొంగ ఓట్లు వేస్తున్న వారి ఫోటోలు ఇప్పటికీ అలాగే ఉంచారు. ఇంత లోపభూయిష్టంగా జరిగిన ఈ ఎన్నికల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ దోషిగా నిలబడింది. పోలింగ్ జరుగుతుండగానే ఎన్నికల కమిషన్ వద్ద ధర్నా నిర్వహించాం. అన్ని బూత్‌లలో రిగ్గింగ్ చేస్తున్నారని, సీసీ కెమెరాలు పరిశీలించాలని ఎన్నికల కమిషన్‌ని వేడుకున్నాం. కానీ అప్పుడు స్పందించకుండా, అక్రమాలన్నీ జరిగిపోయాక అర్దరాత్రి 2 గంటలు దాటాక రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కి ఆదేశాలిచ్చారు. ఎవరి కోసం ఈ కంటితుడుపు చర్యలు? స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్ వ్యవహరించాల్సింది ఇలాగేనా? మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా బూత్‌లోకి ప్రవేశించి రౌడీయిజం చేయడంపైనా ఈసీ కనీసం చర్యలు తీసుకోలేదు. ఈసీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల పోలింగ్ సీసీ టీవీ ఫుటేజ్‌లు బయటపెట్టాలి. ఈసీని కలిసి ప్రతిసారీ టీడీపీ అరాచకాలపై వివరాలు అందించాం: దశాబ్దాలుగా వైయస్ఆర్‌సీపీకి కంచుకోటగా ఉన్న పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కేవలం 683 ఓట్లే వచ్చాయంటే చిన్నపిల్లలు కూడా నమ్మరు. అప్రజాస్వామ్య పద్ధతిలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగే ప్రమాదం ఉందని, పోలీసులు, అధికారులు ఏకపక్షంగా అధికార టీడీపీకి సపోర్టు చేస్తున్నారని ఆధారాలతో సహా పలుమార్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి వైయస్ఆర్‌సీపీ తరఫున ఫిర్యాదు కూడా చేశాం. అయినా అక్కడ నుంచి కూడా కనీస స్పందన రాలేదు. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తూ ఈసీకి మొత్తం 35 వినతిపత్రాలు సమర్పించాం. 17సార్లు వ్యక్తిగతంగా కలిసి, 18 వినతి పత్రాలు ఈమెయిల్స్ ద్వారా పంపించాం. డీఐజీ నేరుగా పులివెందుల్లో నిలబడి టీడీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆధారాలతో సహా వివరించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈసీకి చూపించాం. మా పార్టీ అభ్యర్థులతోపాటు ఏజెంట్లకు రక్షణ కల్పించాలని చెప్పాం. ఎన్నికల వ్యవహారాన్ని మొత్తం వెబ్ క్యాస్టింగ్ చేయాలని విన్నవించాం. కానీ మా అభ్యర్థనలను ఈసీ పెడచెవిన పెట్టింది. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పదే పదే ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కోరినా ఆమె సరిగా స్పందించలేదు. పోటీలో ఉన్న అభ్యర్ధినే బయటకు రానివ్వలేదు: మా పులివెందుల అభ్యర్థి హేమంత్ రెడ్డి బయటకు రాకుండా 5 గంటలకే టీడీపీ గూండాలు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. కనీసం ఆయన ఓటు తానే వేసుకోనివ్వలేదంటే ఎన్నికలు ఎంత దారుణ పరిస్థితుల్లో జరిగాయో అ సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన టీడీపీ నాయకులు పులివెందులలో తిష్టవేసి అరాచకాలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. కానీ స్థానికుడైన మా ఎంపీ అవినాశ్‌రెడ్డిని మాత్రం పోలీసులు బలవంతంగా తరలించారు. డీఐజీ నేరుగా ఎంపీ ఉన్న కార్యాలయానికి చేరుకుని బయటకు వెళ్లనీయకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాడు. కేవలం ఏడాది మాత్రమే పదవీకాలం ఉన్న ఒక్క జెడ్పీటీసీ గెలవడానికి అధికార టీడీపీ చేయని అకృత్యాలు లేవు. పోలింగ్ రోజున జరిగిన దొంగ ఓట్ల వ్యవహారంపై మా అధ్యక్షులు ఆధారాలతో సహా వివరించారు. ఆఖరుకి రీపోలింగ్ రోజున కూడా ఇలాగే చుట్టుపక్క ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను పిలిపించుకుని వచ్చి దొంగ ఓట్లు గుద్దుకున్నారు. మా హయాంలో కుప్పంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాం కాబట్టే 6 స్థానాల్లో అయినా వారు విజయం సాధించారు.