శ్రీ సత్య సాయి జిల్లా: మంత్రి సవిత అవినీతికి అంతే లేదని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం బ్రహ్మసముద్రం, చల్లపల్లి, నడింపల్లి పంచాయతీలలో బుధవారం బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రీ కాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో పేరుతో ఇంటింటా పర్యటించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టారు. సూపర్ సిక్స్ పథకాలంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏ ఒక్క పంటకు నష్టపరిహారం చెల్లించలేని చేతకాని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పులివెందులలో రిగ్గింగ్ నిన్నటి రోజు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని టిడిపి రౌడీలు దొంగ ఓట్లు వేసి రిగ్గింగ్ చేశారని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ విమర్శించారు. ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.