శ్రీకాకుళం : రాష్ట్రంలో రైతాంగానికి కనీసం అవసరమైన ఎరువులు కూడా అందించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్‌కు రైతులతో కలిసి ధర్మాన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా రైతులు ఇంకా ఎరువుల కోసం తలుపుతడుతున్న పరిస్థితి దారుణమని ధర్మాన మండిపడ్డారు. కలెక్టర్కు గోడు చెప్పాలనుకుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమని దుయ్యబట్టారు. ఆర్బీకేల వంటి రైతు అనుకూల విధానాలను గతంలో వైయస్ఆర్‌సీపీ తీసుకువచ్చినా, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. నేడు ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం ఎరువుల లభ్యతపై చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.