నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి

ప్రజాస్వామ్యం గురించి లోకేష్ మాట్లాడటం సిగ్గుచేటు

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో రిగ్గింగ్‌ చేసి గెలిచిన విషయం మరిచారా? 

మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాధ్‌ రెడ్డి

వైయస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాధ్‌ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
   
రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి లోకేష్ 

రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకశక్తులను ప్రోత్సహిస్తున్నదే లోకేష్

వైయస్ జగన్ కోసం వచ్చిన అభిమానుల పైనా అక్కసుతో కామెంట్లు

మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాద్‌రెడ్డి ఆగ్రహం

9న రైతాంగ సమస్యలపై వైయస్ఆర్‌సీపీ ఉద్యయం

ఉల్లి, చీనీ, మినుముకు రేటు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు

వైయస్ఆర్‌సీపీ నేతలు రఘురామి రెడ్డి, రామసుబ్బా రెడ్డి వెల్లడి

వైయ‌స్ఆర్‌ కడప జిల్లా: డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని మాట్లాడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వైయస్ఆర్‌ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాద్‌ రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్‌ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రఘురామిరెడ్డి, పార్టీ ముఖ్యనేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాద్‌ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నారా లోకేష్ ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆగ్రహం ఆక్షేపించారు. పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకుని, కిరాయి మూకలతో రిగ్గింగ్ చేసి గెలిచిన విషయాన్ని లోకేష్ మరిచిపోయారా అని ప్రశ్నించారు. చివరికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా వచ్చిన అభిమానుల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా లోకేష్ తన అక్కసును వెళ్ళగక్కుకున్నాడని, రాజకీయంగా దిగజారుడు కామెంట్లు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...

తాజాగా వైయస్ఆర్‌ కడప జిల్లాకు వచ్చిన నారా లోకేష్‌ ప్రజల గురించి కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడాడు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామికంగా జరిగిందని ఎలా అంటున్నాడో అర్థం కావడం లేదు. అధికార దుర్వినియోగానికి ఈ ఎన్నిక ప్రతీక. అలాంటి ఎన్నికను గురించి నారా లోకేష్ సిగ్గు లేకుండా గొప్పగా చెప్పుకున్నాడు. ప్రజల వద్దకు వెళ్లి ఈ ఎన్నికల గురించి అడగ్గలరా? మీరు నిజంగా ఓటు హక్కును వాడుకున్నారా అని ప్రశ్నించి చూడండి. బయటి నుంచి కిరాయి మనుషులను తెచ్చుకుని, రింగింగ్ చేసి, ఓట్లు వేసుకుని గెలిచి, ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని మాట్లాడుతున్నాడు. ఎల్లకాలం రోజులు ఇలాగే ఉంటాయనుకోవడం లోకేష్‌ అవివేకం. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని చెప్పుకోవడం వారి దివాలాకోరుతనంకు నిదర్శనం. వైయస్ జగన్ గారు ఇలాగే చేస్తే చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో గెలిచేవారేనా? ప్రజాగళం అంటూ లోకేష్ ప్రజల్లో తిరగగలిగేవాడా? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజాస్వామిక స్పూర్తితో పనిచేసింది కాబట్టే మీకు పూర్తి స్వేచ్చ లభించింది. ఈ రోజు రాజ్యాంగాన్న పక్కకుపెట్టి, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకానికి పాల్పడుతున్నాడు. ఈవీఎంల పుణ్యమా అని అధికారాన్ని దక్కించుకున్నారే తప్ప, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వారు కాదు కూటమి నేతలు. పోలీసులను అడ్డం పెట్టుకుని పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో గెలిచారు. ప్రతిపక్ష నాయకుడుగా వైయస్ జగన్ పులివెందులకు వచ్చారు. ఉల్లి, చీనీ రైతుల కష్టాలను తెలుసుకుని, వారి గ్రామాలకు వెళ్లి వారితో మాట్లాడారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అరాచకం సృష్టించి వెడితే, అక్కడికి వెళ్ళి వారికి ధైర్యం చెప్పారు. ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు వస్తే, దానిని చూసి సహించలేక లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశాడు. వీఐపీ పాస్‌లు, ప్రోటోకాల్స్ అంటూ అర్థంలేకుండా తన అక్కసును వెళ్ళగక్కాడు. ప్రజాధరణ ఉన్న నాయకుడిగా వైయస్ జగన్‌ను కలవడానికి వచ్చే వారందరికీ సమయాన్ని కేటాయించడానికి పార్టీ యంత్రాంగం చేసుకునే ఏర్పాట్లపైనా వక్రీకరణ ప్రచారానికి తెగబడ్డారు. 

రైతు సమస్యలపై దృష్టి ఏదీ?

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 9 వ తేదీన రైతులకు సంబంధించి వైయస్ఆర్‌ కడప జిల్లా వ్యాప్తంగా యూరియా, ఉల్లి కొనుగోళ్ళకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు నిర్వహించబోతున్నాం. జిల్లా అధికారులకు డిమాండ్ పత్రాలు అందచేయబోతున్నాం.  గతంలో ఉల్లి క్వింటా రూ. నాలుగు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు రేటు పలికితే, నేడు క్వింటా ఉల్లిని రూ.300 లకు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఒక్కో ఎకరానికి లక్షా ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు చేసిన రైతులు నేడు పంటను కోయడానికి కూడా ముందుకు రావడం లేదు. కూలి ఖర్చులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితే గత ప్రభుత్వంలో ఏర్పడితే ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.12000 లకు క్వింటా ఉల్లి కొనుగోలు చేశాం. అలాగే యూరియా కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఆర్బీకేల్లో సరిపడినంత యూరియాను గతంలో మేం అందుబాటులో ఉంచితే, నేడు యూరియా బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. సీజన్ ప్రారంభంలోనే ఎంత యూరియా కావాలో ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన కూడా లేకపోవడం దారుణం. రూ.270 కి అమ్మాల్సిన యూరియా నేడు రూ.600 లకు విక్రయిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా అమ్ముతామని ఆంక్షలు విధిస్తున్నారు. గత ప్రభుత్వంలో క్వింటా రూ.12వేల వరకు అమ్ముడుపోతే, నేడు రూ.3000 లకు కూడా అమ్ముడుపోవడం లేదు. గతంలో చీనీ టన్ను లక్ష రూపాయలకు అమ్ముడుపోతే నేడు రూ.15 వేలకు కూడా కొనుగోలు జరగడం లేదు.  

మా హయాంలో సాధించిన వాటికి లోకేష్ ప్రారంభోత్సవాలు

వైయస్ఆర్‌ కడప జిల్లాలో 2020 డిసెంబర్‌లో ఏపీఐఐసీ ఎగ్జిక్యూటీవ్ సెంటర్‌కు సంబంధించి సీఎంగా వైయస్ జగన్ భూమిపూజ చేశారు. ఎంఎస్ టెక్నోడాం ఇండియా ప్రైవేటు లిమిటెడ్, టెల్సానా వరల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పనులకు 10, జులై 2023లో సీఎంగా వైయస్ జగన్ ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ పరిశ్రమల నిర్మాణం పూర్తయ్యి ఇప్పుడు అవి ప్రారంభంలోకి వచ్చాయి. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటీవ్ సెంటర్‌ను ఇక్కడికి తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలోని వైయస్ఆర్‌సీపీ నేతలు కృషి చేసి సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ సెంటర్‌ను విజయవాడకు తరలించే యత్నం చేసిన ఘనత తెలుగుదేశం నాయకులకే దక్కింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, నిరసనలు వెల్లువెత్తడంతో తిరిగి ఈ సెంటర్‌ను ఇక్కడ కొనసాగిస్తున్నారు. కేంద్ర నిధులతో గత ప్రభుత్వంలో మూడూ సెంటర్లు మంజూరయితే, వాటిల్లో ఒక సెంటర్‌ను కడపజిల్లాలో పెట్టడం జరిగింది. ఇక్కడి సెంటర్‌ను కూడా తరలించాలని చంద్రబాబు, లోకేష్‌లు భావించడం దుర్మార్గం కాదా? చింతకొమ్మదిన్నెలో స్కూల్‌కు స్మార్ట్‌ కిచెన్‌ను నారా లోకేష్ ప్రారంభించారు. అదే స్కూల్‌లో దాదాపు 25 కొత్త గదులను, స్కూల్ ఆధునీకరణ, ల్యాబ్‌ల ఏర్పాటును గత ప్రభుత్వంలో నాడు-నేడు కింద నిర్మించాం. అలాగే స్కూల్‌లో టాయిలెట్ల నుంచి అన్ని వసతులను కల్పించాం. వీటిని పరిశీలించకుండా కేవలం స్మార్ట్‌ కిచన్‌ను మాత్రమే ప్రారంభించి, మొత్తం విద్యావ్యవస్థను తామే ఉద్దరిస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థనే భ్రష్టుపట్టించాడు. అసమర్థ మంత్రిగా నిలిచిపోయాడు.

రాజోలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై మాట మార్చిన లోకేష్: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం

కేసీ కెనాల్ కింద వైయస్ఆర్ కడప జిల్లాలో 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దానికి పది టీఎంసీల అలాట్‌మెంట్ ఉంది. ఆ నీటిని స్టోరేజీ చేయడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లను నిర్మించడానికి రాజోలి రిజర్వాయర్‌కు వైయస్ఆర్‌ హయాంలో శంకుస్థాపన చేశారు. వైయస్ జగన్ గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ రావాలని టెండర్లు పిలిచారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్‌ లు కూడా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీ కెనాల్‌కు ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చాలా అవసరం. దీనిపై తాజాగా  మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఆర్థిక భారంతో కూడుకున్నది, దీనిని చేపట్టలేమని చేతులెత్తేశాడు. ఇంత మోసం ఎక్కడైనా ఉంటుందా? రాజోలి రిజర్వాయర్‌ నిర్మిస్తేనే కేసి కెనాల్ కింద ఉన్న ఆయకట్టుకు హామీ ఉంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

రైతులను గాలికి వదిలేసిన కూటమి సర్కార్ :  మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి   

రాష్ట్రంలో రైతును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతు సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు రాజంపేట, కడపజిల్లాలో పర్యటించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారికి పట్టలేదా? కేవలం తమ ప్రచార ఆర్భాటాలకు ఇస్తున్న ప్రాముఖ్యత తప్ప నిజంగా ప్రజల గురించి, వ్యవసాయం గురించి వారికి పట్టడం లేదు. నేడు యూరియా దొరకక రైతులు అల్లాడుతున్నారు. బ్లాక్ మార్కెట్ దారులకు యూరియాను అందించి, కమీషన్లు దండుకుంటున్నారు. గతంలోనే చంద్రబాబు వ్యవసాయం దండుగ అన్నాడు. దానిని నేడు నిరూపిస్తున్నారు. గతంలో పంటలు నష్టపోయినా, గిట్టుబాటు ధరలు అందకపోయినా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేంది. నేడు చంద్రబాబు ఆర్బీకేలను, ఈ క్రాప్ విధానాన్ని, మార్కెట్ ఇంట్రవెన్షన్‌ను నిర్వీర్యం చేశాడని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మండిపడ్డారు.

Back to Top