విజయనగరం: కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా..రాష్ట్ర ప్రజలు మాత్రం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు( చిన్న శ్రీను) అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల తీరుపై ఆయన స్పందించారు. `పులివెందులలో కూటమి ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడింది. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఓటర్లను ఓటు వేయనీయకుండా రిగ్గింగ్ చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్ధినం. సాక్షాత్తు ఆ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేసుకున్నారంటేనే అక్కడ ఎన్నికలు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో జరిగాయన్నది మనం అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతుంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పులివెందుల జడ్పిటిసి ఎన్నిక నిర్వహించారు. అక్కడ అక్రమాలకు పాల్పడి "ఇదిగో పులివెందులలో మేము గెలిచాము , వైయస్ఆర్సీపీ జనాదరణ లేదని" చెప్పేందుకు కూటమి బరితెగించింది అంతే తప్ప కూటమి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. అక్కడ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓట్లు తాము వేస్తే.. తీర్పు ఎలా ఉండేదన్నది రాష్ట్రంలో అందరికీ తెలుసు. కూటమి చేస్తున్న అక్రమాలకు, దౌర్జన్యాలకు రారున్న రోజుల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు` అని మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు.