తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైన ప్రతిచోటా బాధితులకు అండగా వైయస్ జగన్ నిలబడుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అటు హామీల అమలుతో పాటు, ఇటు రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మామిడి రైతుల కోసం బంగారుపాళెం వెళ్ళేందుకు వైయస్ జగన్ సిద్దమపడిన తరువాతే ప్రభుత్వంలో కనీస కదలిక వచ్చిందని అన్నారు. చంద్రబాబు అసమర్థ పాలనను ఎత్తి చూపుతున్న వైయస్ జగన్ ఉనికినే ఓర్వలేని స్థాయికి కూటమి సర్కార్, దానికి భజన చేసే ఎల్లో మీడియా చేరుకుందని, దానిలో భాగంగానే కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వం రైతుల్ని నట్టేట ముంచింది కూటమి పాలనలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మిర్చి, పొగాకు, మామిడి, అరటి, ధాన్యం, కోకో.. ఇలా ఏ పంట చూసినా దేనికీ మద్ధతు ధర దక్కడం లేదు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉందని, మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని డూపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులన్ని నట్టేట ముంచారు. రైతు గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వ్యవసాయశాఖ మంత్రి జగన్‌ని తిట్టడానికి తప్పించి మద్ధతు ధర కోరుతూ రోడ్డెక్కిన రైతులను పరామర్శించిన దాఖలాలు లేవు. మధ్యవర్తులు, మిల్లర్లు కలిసి అడ్డగోలుగా రైతుల్ని దోచుకుంటుంటే కనీస స్పందన కరువైంది. పౌరసరఫరాల శాఖ మంత్రి మూడు చోట్ల పర్యటిస్తే టీడీపీ సానుభూతిపరులైన రైతులే ఆయన్ను నిలదీశారు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల కష్టాలు పగవాడికి కూడా రావొద్దనేంతలా నష్టపోయారు. అయినా ప్రభుత్వం నుంచి వారిని ఆదుకోవాలన్న స్పృహ ఒక్కరికీ లేకపోయింది. మిర్చి యార్డు ఉన్న గుంటూరులో కేంద్ర మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆ వైపు కన్నెత్తి చూడలేదు. కేంద్రంతో మాట్లాడి ఎంఎస్‌పీ కోసం ప్రయత్నించాలన్న ఆలోచన కూడా చేయకపోవడం విడ్డూరం. ఆఖరి క్షణం దాకా వైయస్ జగన్ పర్యటన అడ్డుకోవాలని కుట్ర రైతుల సమస్యలపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ స్పందించి మాట్లాడేవరకు కూడా ప్రభుత్వంలో చలనం ఉండటం లేదు. ప్రభుత్వం స్పందించదు. మద్దతు ధర ప్రకటించదు. రైతులను పరామర్శించరు. కానీ వారి పక్షాన వైయస్ జగన్ వెళ్లి గళం విప్పితే మాత్రం ఓర్వలేరు. పొగాకు రైతుల కోసం వైయస్ జగన్ పొదిలి వెళితే కొంతమంది పచ్చ సైకో బ్యాచ్‌ను రెచ్చగొట్టి అక్కడ మోహరించి పోలీసుల పహారాతో మా ర్యాలీ మీద దాడులు చేయించారు. దానిపై ప్రజల దృష్టిమరల్చేందుకు 10 తెలుగుదేశం అనుకూల మీడియా ఛానెళ్లలో డిబేట్లు పెట్టించి మా నాయకులు జగన్ మీద విషం చిమ్ముతుంటారు. మామిడి రైతుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వైయస్ జగన్ వెళ్తుంటే హెలిప్యాడ్‌కి పర్మిషన్ ఇవ్వకుండా చివరి దాకా ఇబ్బంది పెట్టారు. తీరా పర్యటన ముగిశాక 100 మీటర్ల దూరంలో పర్మిషన్ ఇస్తామంటే మేం ఒప్పులేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే పల్ప్ ఫ్యాక్టరీకి 100 మీటర్ల దూరంలో హెలిప్యాడ్‌కి పర్మిషన్ ఇచ్చినట్టు ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నా. అబద్ధపు ప్రకటనలతో రైతులకు దగా బంగారుపాళెం వెళ్ళే రోజు కేబినెట్ మీటింగ్‌లో టేబుల్ ఎజెండాగా మామిడి రైతులకు కేజీ రూ.4 సబ్సిడీకి కొనుగోలు చేసేలా రూ.260 కోట్లు కేటాయిస్తున్నట్టు తీర్మానం చేశారు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేసే బాబు మార్కు రాజకీయం. కానీ ఇవ్వాళ్టి వరకు నిధులకు సంబంధించి జీవో ఇచ్చిందే లేదు. రాష్ట్రంలో ఒక్క మామిడి రైతు నుంచి కూడా రూ.4ల సబ్సిడీ ధరకు కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కానీ ముగ్గురు మంత్రులు హడావుడిగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకుని 80 శాతం కొన్నామని ఒకరు, 90శాతం పంట కొనుగోలు చేశామని ఇంకొకరు పొంతన లేని అబద్ధాలు చెప్పారు. పైగా జగన్ కి మర్యాద తెలియదని చెప్పే వారు, జగన్‌ను ఉద్దేశించి ఆ పత్రికా సమావేశంలో వాడు వీడు అని మాట్లాడారు. వీరంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాలుగు గోడల మధ్య కూడా వైయస్ జగన్ ఎవర్నీ వాడు వీడు అని మాట్లాడటం జరగలేదు, జరగదు. అలాంటి వారు జగన్‌కి సంస్కారం నేర్పుతున్నారు. 6.50 లక్షల టన్నులు పంట పండితే 80 శాతం కొన్నామని వ్యవసాయశాఖ మంత్రి చెబితే, 90 శాతం కొన్నామని సివిల్ సప్లయస్ మంత్రి చెప్పారు. కానీ జిల్లా కలెక్టర్ మాత్రం జూలై 7న బీబీసీ ఛానెల్ తోమాట్లాడుతూ 67 శాతం (2 లక్షల టన్నులు) మామిడి కొనుగోలు చేశామని చెప్పారు. కానీ జూలై 8వ తేదీన మంత్రులు సమావేశం ఏర్పాటు చేసి తమకు నచ్చినట్టు 80 శాతం కొన్నామని ఒకరు, 90 శాతం మామిడి కొన్నామని ఇంకొకరు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఇదేకాకుండా రూ.4 ల సబ్సిడీ పేరుతో రూ. 260 కోట్లు కేటాయించినట్టు రైతుల్ని దగా చేశారు. కానీ దానికి ఫైనాన్స్ కాంకరెన్స్ లేదు. బీఆర్వో రిలీజ్ లేదు. సీఎఫ్ఎంఎస్‌లో నిధులు విడుదల చేయలేదు. సీఎం నారా చంద్రబాబు సైతం సబ్సిడీ పేరుతో రైతులకు అబద్ధాలు చెప్పాడు. పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు రూ.8లకు కొంటున్నారని, ప్రభుత్వం రూ.4ల సబ్సిడీ ఇస్తుందని పచ్చి అబద్ధం చెప్పారు. ర్యాంపుల వద్ద రూ.2 లకు కొనుగోలు చేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలో రూ.4లు ఇస్తున్నారు. కానీ రూ.8లకు కొంటున్నామని చెప్పి మోసం చేశారు. ఆంధ్రాలో జ్యూస్ ఫ్యాక్టరీ నుంచి మొదలుపెడితే తమిళనాడు వరకూ వేల కొద్దీ మామిడి కాయల లారీలు కిలోమీటర్ల పొడవునా బారులుదీరి ఉన్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్దతు ధరకి కొంటుంటే ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది? ఫ్యాక్టరీ వాళ్లు కొనేలోపు రవాణా చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. లోడులో సగం మామిడి పండి, కుళ్లిపోయి పారబోయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లా రైతుల నుంచి మాత్రమే సబ్సిడీకి కొంటామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తోతాపురి పండించిన రైతుల నుంచి కూడా సబ్సిడీ ధరకు కొనుగోలు చేయాలి. రూ.260 కోట్ల సబ్సిడీకి సంబంధించి తక్షణమే జీవో రిలీజ్ చేయాలి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటి? వాస్తవానికి మామిడి పంటను పండించే వారిలో మెజారిటీ వాటా టీడీపీ మద్ధతు దారులే ఉన్నారు. పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు కూడా దాదాపు టీడీపీ నాయకులే. అయినా వైయస్ జగన్ పార్టీలు చూడకుండా రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశంతో బంగారుపాళెంలో రైతులను పరామర్శించడానికి వచ్చారు. దీనిపైనా టీడీపీ కుట్రలు చేసిందంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? వైయస్ జగన్ వచ్చి వెళ్లాక ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ధరలు రూ.6 నుంచి రూ.6.50వరకు పలుకుతున్నాయి. చిత్తూరులో తోతాపురి మామిడి పంటను పండిస్తున్న రైతులకే కాకుండా నూజివీడు, తుని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తోతాపురి మామిడి పంటను పండించే రైతులకు కూడా మద్ధతు ధర ప్రకటించాలి. స్థానిక ఎమ్మెల్యేలు మామిడి రైతుల సమస్యల మీద ముఖ్యమంత్రిని నిలదీయాలి. వైయస్ జగన్ వచ్చే రోజు కొనుగోళ్లు బంద్.. మ్యాంగో మార్కెట్ ఖాళీ వైయస్ జగన్ 9వ తేదీన బంగారుపాళెం వెళ్తున్నట్టు ప్రకటించిన వెంటనే 8వ తేదీన ఒక్క కాయ కూడా లేకుండా కొనేశారు. ప్రభుత్వంలో అంత భయం ఉంది కాబట్టే ఆయన రైతుల పక్షాన పోరాడి వారికి న్యాయం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో కాయలే లేనప్పుడు మామిడి కాయలు తొక్కేశారని ప్రచారం చేసుకోవడం మరో వింత. వైయస్ జగన్ వచ్చే రోజున మామిడి కాయలు కొనకుండా ఆపేశారు. దీంతో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రైతులు రోడ్డు మీద మామిడి కాయలు పోసి నిరసన తెలిపారు. దానికి కూడా రైతుల మీద కక్షపూరితంగా కేసులు నమోదు చేశారు. తమ మామిడి కాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి నిరసన తెలిపితే దానికి తోట యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్ల మీద కూడా కేసులు పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? వైయస్ జగన్ రాబోయే రెండు రోజుల ముందు ఇలాగే టీడీపీ నాయకులు రోడ్డుపై ట్రాక్టర్లతో తెచ్చి మామిడికాయలు పారబోశారు. ఇది టీవీ5లో కూడా ప్రసారమైంది. మరి వారి మీద ఎస్పీ ఎందుకు కేసులు నమోదు చేయలేదో మంత్రులు నాదెండ్ల, అనగాని, అచ్చెన్నాయుడు చెప్పాలి. వైయస్ జగన్ మిర్చి రైతులను పరామర్శించడానికి గుంటూరు మిర్చి యార్డుకి వెళితే కేసు పెట్టారు. ఆ తర్వాత రోజే ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రిని కలిశారు. మిర్చి రైతులను పరామర్శించడమే జగన్ చేసిన తప్పయితే మీరెందుకు ఢిల్లీ వెళ్లారు. పొగాకు రైతుల కోసం జగన్ పొదిలి వెళ్లినప్పుడు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. జగన్ వచ్చేదాకా ఏం చేశారు? మామిడి రైతుల కోసం బంగారుపాళ్యెం వెళ్లినప్పుడూ అంతే. జగన్ వస్తారని తెలియగానే జూన్ 10న మామిడి రైతుల కష్టాల పరిశీలన పేరుతొ ఒక కమిటీ వేశారు. బంగారుపాళెం పరిసర ప్రాంతాల్లో జూన్ 10 వరకు ఫ్యాక్టరీలు తెరవకపోవడంతో వైయస్ జగన్ వెళ్లారు. జగన్ వచ్చేదాకా రైతుల సమస్యల గురించి పట్టని ఈ ప్రభుత్వం, ఆయన వస్తుంటే మాత్రం ఇప్పుడా వెళ్లేది అంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటు. కర్నాటక రైతుల నుంచి మామిడి కాయలు సబ్సిడీ ధరకు కొనాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కి జేడీఎస్ కి చెందిన మరో కేంద్ర మంత్రి కుమారస్వామి లేఖ రాస్తే దానికి అంగీకరిస్తూ రూ.16లకు 2.50లక్షల టన్నులు కొంటామని చెప్పారు. ఆ లేఖ కళ్లముందే కనిపిస్తున్నా దాన్ని కూడా అపహాస్యం చేస్తూ టీవీ5లో తప్పదోవ పట్టించేలా కథనాలు ప్రసారం చేశారు. విద్యార్ధినులను కీచకులు వేధిస్తే సీఎం పరామర్శించరా? అమ్మ ఒడి పేరుని తల్లికి వందనంగా మార్చేసి లబ్ధిదారులను తీవ్రంగా వంచించిందే కాకుండా ఆ పథకాన్ని లోకేష్ కనిపెట్టాడని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. కొడుకు తప్పు చేస్తే తండ్రి దండించాల్సిందిబోయి తండ్రే బరితెగించి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు. జనం నవ్వుతారనే కనీస ఆలోచన చేయడం లేదు. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌ను ఎవరో కొట్టారని సీఎం చంద్రబాబు హెలిక్యాప్టర్ లో నుంచి ఫోన్ చేసి మాట్లాడినట్టు ఆ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది. మరి నిన్న కాకినాడలోని రంగరాయ మెడికల కళాశాలలో కీచకులు విద్యార్థినులను చెరబడితే చంద్రబాబు వారిని ఎందుకు పరామర్శించలేదు? ఫొటో గ్రాఫర్ మీద దాడి వార్తను మెయిన్ పేజీలో వేసిన ఆంధ్రజ్యోతి, కీచకపర్వాన్ని మాత్రం జిల్లా పేజీకే పరిమితం చేసింది. ఏడాది కాలంగా రాష్ట్రంలో మహిళల మీద ఎన్నో దారుణాలు జరిగితే ఏ ఒక్క సంఘటనలోనూ బాధితులకు చంద్రబాబు ఫోన్ చేసి నేనున్నానని ధైర్యం చెప్పింది లేదు.