నంద్యాల: ఎన్నికల సమయంలో 143 హామీలు ఇచ్చి ఒక్కటైనా అమలు చేశారా అని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సూపర్‌సిక్స్ అంటూ ఎన్నికల సభల్లో ఊదరగొట్టి..అధికారంలోకి వచ్చాక ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ప్రతి నెల 1వ తేదీ పింఛన్ల పంపిణీతో ఈవెంట్స్, అమరావతి, యోగాంధ్ర అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో వైయస్ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ..`రాష్ట్రంలో ప్రజలు అప్పుల పాలవుతున్నా సీఎం చంద్రబాబు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు స్వలాభం కోసమే ప్రభుత్వం నడుపుతున్నారు, పేదలను ఆదుకోవాలనే ఆలోచన చేయడం లేదు. ఎన్నికల సమయంలో ఓటరు ఇంటికెళ్లి నా కుటుంబం అన్న సీఎం చంద్రబాబు, గెలిచాక నాకేంటి సంబంధం అంటున్నాడు. ఏదైనా సమస్యపై మాజీ సీఎం వైయస్ జగన్ గళమెత్తితేగాని కూటమి ప్రభుత్వంలో చలనం ఉండడం లేదు. ఆయన వస్తున్నారంటే అప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తోంది. ఇప్పుడు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ మాజీ సీఎం వైయస్ జగన్ సమస్య తెలుసుకోవడానికి వస్తే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు` అని శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అహ్మద్‌హుస్సేన్, సయ్యద్‌మీర్, అంబాల ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.