విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా కనుమరుగైందని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం పార్టీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆఖరికి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోందని అన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తానంటూ డైలాగులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మహిళా హోంమంత్రిగా రాష్ట్రంలో స్త్రీల రక్షణకు ముందుండాల్సిన అనిత నిత్యం వైయస్ జగన్‌పై రాజకీయ విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా చంద్రబాబు చేతకానితనం, అసమర్థత కారణంగా నేడు ఆడపిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థల వైపు వెళ్ళేందుకే భయపడే పరిస్థితిని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే... కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లపై అరాచకాలు పెరిగిపోయాయి. పనిలోనూ, కాలేజీలోనూ, చివరకి ఇళ్లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో నెల రోజులుగా ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వ్యక్తి విద్యార్థినుల శరీర భాగాలు ఫోటో తీసి, తిరిగి వాళ్లకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం ఫిర్యాదు చేసినా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. రంగరాయ వైద్య కళాశాల విద్యార్థినిలు ల్యాబ్ అసిస్టెంట్ చేస్తున్న దురాగతంపై యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కమిటీ వేసి చేతులు దులుపుకోవడం అత్యంత దుర్మార్గం. రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతున్న లైంగిక వేధింపులను సాక్షి ఇవాళ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అందరూ స్పందించడం మొదలుపెట్టారు. బాధిత బాలికలు రంగారాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే వాళ్లు కమిటీ వేశారే తప్ప ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసి ఊదరగొట్టిన శక్తి యాప్ వలన ఉపయోగం లేకుండా పోయింది. హోంమంత్రి అనిత సిగ్గుపడాలి మానవత్వం గురించి ప్రసంగాలిచ్చే హోంమంత్రి ఈ దారుణ ఘటనపై ఏం సమాధానం చెబుతారు. రంగనాయ ఘటనలో యాబై మంది విద్యార్థినులు కన్నీటితో తమ గోడు చెబుతుంటే, హోమంత్రి అనిత తన అసమర్థతకు సిగ్గుపడాలి. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెచ్చు మీరుతున్నాయి. ఒకదాన్ని మించి మరొక దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యలపై కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే వరుస ఘటనలు వినాల్సిన దుస్ఠితి రాష్ట్రంలో కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రంగరాయ మెడికల్ కాలేజీ ఘటనలో ఏ-1 గా ఉన్న కళ్యాణ చక్రవర్తి తప్పించుకున్నాడు. మరోవైపు ఈ ఘటనలో సహ నిందితులుగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ ను సస్పెండ్ చేశారు. కేవలం కంటి తుడుపుగా సస్పెండ్ చేస్తే సరిపోదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రోజూ పదుల సంఖ్యలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాలేజీ పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితల నిర్లక్ష్య ధోరణి వల్లే ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. నేరాలకు పాల్పడేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల వారికి భయం లేకుండా పోయింది. వరుస సంఘటనలు జరుగుతున్నా కళ్లు తెరవరా? గతంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అమ్మాయిల బాత్రూమ్ లలో సీసీ కెమెరాలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని కప్పిపెట్టింది. రాజమండ్రిలో ఒక నర్సింగ్ విద్యార్థిని ఇలాగే వేధించారు. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని టీడీపీ గ్యాంగ్ ఆరు నెలలుగా రేప్ చేసింది. హోం మంత్రి స్టేట్మెంట్లు మాత్రమే ఇస్తారు. జగన్ గారిని తిట్టడానికి మాత్రమే ఆమె ఉన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్ని డైలాగులు చెప్పారు, తాట తీస్తాను అన్నారు. ఆయన జిల్లాలో కాకినాడలో 50 మంది విద్యార్థులను ఫోటోలు తీస్తే మీరు ఎంతమందికి తాట తీశారు. ఈ ఘటన మీద మహిళా హోం మంత్రి సౌండ్ చేయడం లేదు. అందరూ ప్రశాంతంగా పడుకోవచ్చని చెప్పిన హోం మంత్రి ఇప్పుడేం చెబుతారు. రాష్ట్రం అత్యాచారాలకు కేంద్రం అయింది. మూడేళ్ల బిడ్డను కూడా వదలడం లేదు. ఒక్క కుటుంబాన్ని అయినా హోం మంత్రి పరామర్శించారా, భరోసా ఇచ్చారా.? ఇన్ని ఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష జరపలేదు. ఆనాడు దిశ యాప్‌తో కీచకుల పనిపట్టాం. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో 1.3 కోట్ల మంది దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని భద్రత పొందారు. ఈ ప్రభుత్వానికి రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోలీసుల బాధ్యత మొత్తం కక్ష సాధింపులకు పనికొచ్చింది తప్ప మహిళల భద్రత గురించి వారిని వినియోగించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వైయస్ జగన్ ను తిట్టడానికి పనికొస్తున్నారు తప్ప మహిళా భద్రతకు ఏమాత్రం చర్యలు లేవు. హోం మంత్రి ఉంటున్న విశాఖ లోనే గంజాయి ఏరులై పారుతోంది. డ్రగ్స్ అడ్డగా రాష్ట్రం మారింది. గంజాయి, డ్రగ్స్ ఇళ్లకు నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నారు. విశాఖలో టీడీపీ నేతలకు చెందిన వాళ్ళు డ్రగ్స్ దందా చేస్తూ పట్టుబడ్డారు. ప్రభుత్వం పూర్తిగా నిరక్ష్యంగా ఉండడంతో ఏకంగా జైల్లో గంజాయి పండిస్తున్నారు. ఇవేం ప్రభుత్వానికి కనిపించడం లేదు. నేడు కూడా యాభై మంది విద్యార్థినులను నెలల తరబడి వేధిస్తున్నా చర్యలు లేవు. కాకినాడ జనరల్ ఆస్పత్రిలో ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్రంలో కామాంధులు ఎలా రెచ్చిపోతున్నా.. తమకేం కాదనే ధైర్యం వారికెలా వచ్చింది.? గతంలో వైయస్ జగన్ హాయంలో ఇలాంటి ఘోరాల మీద వెనువెంటనే చర్యలు ఉండేవి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండేవి. ఘటన జరిగిన వెంటనే అరెస్టులు ఉండేవి. నేడు హోం మంత్రి డైలాగులు చెప్పడం తప్ప మహిళల కోసం చేస్తున్నది ఏమి లేదు. డిప్యూటీ సీఎం పవన్ తాట తీసే డైలాగులు తప్ప సొంత జిల్లాలో జరిగిన ఘోరాన్ని చూడలేకపోతున్నారు. ముందు ఈ దారుణాన్ని ఆయన ఖండించాలి. మహిళల భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.