రాష్ట్రంలో భూపందేరంలో భారీ అవినీతి

కారుచౌకగా బినామీలకు ఖరీదైన భూముల దారాదత్తం

 సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం

పలాస వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్‌ సెల్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు

  లులూ సంస్థతో చంద్రబాబు లాలూచీ

  విశాఖ, విజయవాడల్లో రూ.వేల కోట్ల భూముల అప్పగింత

  రియల్ ఎస్టేట్ కంపెనీలకు చౌకగా ప్రభుత్వ భూముల విక్రయం

  ప్రభుత్వ ఆస్తులను అడ్డంగా దోచుకుంటున్న చంద్రబాబు

  మండిపడ్డ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు 

  
పలాస: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను సీఎం చంద్రబాబు అవినీతి దాహంతో తన బినామీలకు భూపందేరం చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్‌ వింగ్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పలాసలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ భూకేటాయింపుల్లో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. లులూ కంపెనీతో చంద్రబాబుకు ఉన్న లాలూచీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో మొట్టమొదటి సారిగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు చౌకగా భూములను ఇస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..

కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రజల ఆస్తులను తన సొంత మనుషులకు, బినామీలకు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. చంద్రబాబు సింగపూర్‌కు వెళ్ళేముందు మాట్లాడుతూ విజయవాడలో లులూ మాల్‌కు స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు విశాఖలో నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన భూమిని లూలూ మాల్‌కు కట్టబెట్టారు. వారం రోజులకు ముందు విశాఖలో ఐటీ స్పేస్‌ కోసం సత్వా డైవలపర్స్‌, కపిల్ సంస్థకు దాదాపు ముప్పై ఎకరాలు, ఎఎన్‌ఎస్‌ఆర్ అనే సంస్థకు కొంత భూమిని కేటాయించారు. ఎస్‌ఐపీబీలో అనుమతులు ఇస్తూ, భూకేటాయింపులు చేస్తూ జీఓలు జారీ చేస్తున్నారు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకువస్తామంటూ చేస్తున్న ప్రయత్నాల్లో తెరవెనుక బాగోతంలా ఈ భూకేటాయింపులు నిలుస్తున్నాయి. 

లులూ సంస్థతో చీకటి ఒప్పందాలు

రాష్ట్రంలో లులూ గ్రూప్ విశాఖ, విజయవాడల్లో షాపింగ్‌ మాల్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనిలో ఎన్నివేల ఉద్యోగాలు వస్తాయి? అక్కడ పనిచేసే వారికి లక్షల్లో జీతాలు వస్తాయా? ఇలాంటి సంస్థకు 13 ఎకరాలను ఏడాదికి 99 పైసలకు లీజుకు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో ఎకరం భూమి రూ.150 కోట్లు రేటు పలుకుతోంది. అంటే దాదాపు రూ.2000 కోట్లకు పైగా విలువైన భూమిని లులూ మాల్‌కు అప్పగిస్తున్నారు. నగరం నడిబొడ్డునే ఈ మాల్ ఉండాలా? నగరం శివార్లలో ఏర్పాటు చేస్తే, దానికి వినియోగదారులు వెళ్ళరా? ఈ పదమూడు ఎకరాల్లో 22 లక్షల ఎస్‌ఎఫ్టీ బిల్డింగ్‌ను నిర్మించవచ్చు. ఇప్పుడు అక్కడ ఒక ఎస్‌ఎఫ్‌టీ రూ.14వేలు పలుకుతోంది. అంటే సుమారుగా మొత్తం ప్రాజెక్ట్ విలువ రూ.3100 కోట్లు అవుతుంది. లులూ మాల్‌ వారు ఎంత గొప్పగా కట్టినా బిల్డింగ్ వ్యయం రూ.1000 కోట్లు మించదు. దీనిని బట్టి ప్రభుత్వానికి వచ్చే నష్టం దాదాపు రూ.2100 కోట్లు. ఇలా మాల్ పెడతామంటూ ప్రభుత్వానికి లులూ సంస్థ కనీసం ఆర్‌ఎఫ్‌సీ కూడా పంపలేదు. జనవరిలో చంద్రబాబును కలిసి లెటర్ పెట్టగానే ఆఘమేఘాల మీద ఈ భూమిని లీజ్‌కు ఇచ్చేశారు. అలాగే విజయవాడలోని కీలకమైన ప్రాంతంలో ఉన్న రూ.600 కోట్ల విలువైన నాలుగున్నర ఎకరాలను కూడా లులూ మాల్‌కు 99 ఏళ్ళకు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ భూమిలో దాదాపు ఏడు లక్షల ఎస్‌ఎఫ్‌టీలతో నిర్మాణం చేయవచ్చు. విజయవాడలో ఈ రోజు ఒక ఎస్‌ఎఫ్‌టీ రూ.12000 ఉంది. ఆ లెక్కన చూసినా రూ.840 కోట్లు ప్రాజెక్ట్ వ్యయం అవుతుంది. ఈ భూమిలో లులూ సంస్థ నిర్మాణానికి చేసే వ్యక్తం రూ.150 కోట్లు మాత్రమే. అంటే దాదాపు ప్రభుత్వానికి రూ.600 కోట్లకు పైగా నష్టం. పెట్టుబడుల కంటే నాలుగు రెట్లు అదనంగా ఎవరైనా భూములను ఇస్తారా? చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 

 ఇచ్చుకో... పుచ్చుకో... పేరుతో అవినీతి

ఇంత బాధ్యతారాహిత్యామ? ఇంత బరితెగింపా? ప్రజల సొత్తును ఇలా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తారా? చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని చాలా ఖరాఖండిగా చెబుతున్నారు. సుపరిపాలన పేరుతో తెలుగుదేశం నేతలు ప్రజల్లోకి వెళుతుంటే, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీ.. పేరుతో మేం ప్రజల్లోకి వెళుతుంటే పెద్ద ఎత్తున వైయస్ఆర్‌సీపీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. ఏడాది కాలంలోనే 90 మంది ఎమ్మెల్యేలపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వేల్లో వెల్లడవుతోంది. ఇంత ప్రజావ్యతిరేకతను కూడా లెక్కచేయకుండా ముందుకు వెడుతున్నారంటే గత ఎన్నికల్లో మాదిరిగా ఈవీఎంల మేనేజ్‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే విలువైన ప్రభుత్వ భూములను కూడా ఎటువంటి జంకు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్నారు. ఇందులో ఇచ్చుకో... పుచ్చుకో... అనే పద్దతుల్లో డబ్బు చేతులు మారుతోంది. 

-  ఊరు, పేరు లేని ఉర్సా కంపెనీకీ ఇలాగే కేటాయింపులు

గతంలో ఉర్సా క్లస్టర్స్ అనే ఊరుపేరు లేని కంపెనీకి అత్యంత ఖరీదైన భూములను అప్పగించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో నారా లోకేష్‌ అమెరికాకు వెళ్ళిన సందర్భంలో ఉర్సా ప్రమోటర్లను కలిశారు. వారు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చి ఒక కంపెనీని రిజిస్టర్ చేశారు. తరువాత నెల రోజుల్లోనే ఉర్సాకు ఏప్రిల్ నెలలోనే 99 పైసలకు ఎకరం కట్టబెట్టేశారు. కనీస ఆర్థిక సామర్థ్యం లేని ఆ సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి ముందు టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకి 99 పైసలకే భూములను ఇచ్చారు. ఈ కంపెనీతో ఒప్పందంలో ఆ సంస్థలు 2029 తరువాత నుంచి ఉద్యోగాలను కల్పిస్తారు. వైయస్ జగన్ హయాంలో ఇన్ఫోసెస్‌, ఆదానీ డెటా సెంటర్, అమేజాన్ వంటి సంస్థలు వచ్చాయి. వారితో ఇలాగే ఒప్పందాలు చేసుకున్నారా? విశాఖలో ఐటీ అభివృద్దికి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే కృషి చేశారు తప్ప, చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా చేయలేదు.  

-   చింతా గ్రీన్‌ ఎనర్జీకి 5 పవర్ ప్రాజెక్ట్‌లు

గత రెండుమూడు నెలల కిందట చింతా గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీకి అయిదు చోట్ల పవర్ ప్రాజెక్ట్‌లు మంజూరు చేశారు. ఈ సంస్థలో డైరెక్టర్లు చింతా విశ్వేశ్వరరావు, నట్లూరి గౌరీనాథ్‌. ఇందులో చింతా విశ్వేశ్వరరావు నవయుగ కంపెనీ అధినేత. పోలవరం ప్రాజెక్ట్‌ను నవయుగకు చంద్రబాబు గతంలో నామినేషన్ పద్దతిలో కేటాయించిన విషయం ప్రజలకు తెలుసు. ఈ చింతా గ్రీన్ ఎనర్జీ ఫిబ్రవరిలో ఢిల్లీలో రిజిస్టర్ అయ్యింది. ఈ కంపెనీకి ఏప్రిల్, మే నెలలోల అయిదు చోట్ల పవర్ ప్రాజెక్ట్‌లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఉన్న అవినీతి బాగోతం బయటపెట్టాలి. 

-   మిట్టల్ సంస్థ చెల్లింపులకు వాయిదాలా?

అర్సెల్లార్ మిట్టల్ తో సంప్రదింపులు చేసింది వైయస్ జగన్ హయాంలోనే. వారిని ఒప్పించి పరిశ్రమ పెట్టేందుకు రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనిని నారా లోకేష్‌ వీడియో కాల్ మాట్లాడగానే మిట్టల్ రాష్ట్రానికి వచ్చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. అర్సెల్లార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్రమోటర్స్ జాయింట్ వెంచర్‌గా  రెండు దశల్లో లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దానికి రెండువేల ఎకరాల భూమిని ఎకరం రూ. 51 లక్షల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించింది. సుమారు 1.72 కోట్ల సామర్థ్యంతో స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఈ సంస్థకూడా దాదాపు రూ.1100 కోట్లతో భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఆ కంపెనీకి మొదట రూ.450 కోట్లు కట్టించుకుని, మిగిలిన మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. లక్ష కోట్లతో పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థకు కేవలం రూ.1100 కోట్లు ప్రభుత్వానికి భూమి కోసం చెల్లించాల్సి ఉంటే, ఇన్ని వాయిదాలు ఎలా ఇస్తారు? ఇవి కాకుండా పన్నుల్లో అనేక రాయితీలు ఇచ్చారు. దీని వెనుక ఉన్న లాలూచీ ఏమిటీ?

-   పవన్ కళ్యాణ్ సన్నిహితుడికి చౌకగా 1200 ఎకరాలు భూమి

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు అనేక ఆర్థిక అంశాలు చర్చలోకి వచ్చాయి. టీజీ విశ్వప్రసాద్ అనే వ్యక్తి ఈ సినిమా నిర్మాణ సంస్థకు ఉన్న బనాయిలను తాను చెల్లిస్తానని చెప్పి, ఆ సినిమాను రిలీజ్ చేయించారు. అందుకు గానూ ఈ టీజీ విశ్వప్రసాద్‌కు కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఈ మొబిలిటీపార్క్ అభివృద్ది పేరుతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే కంపెనీకి 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరం కోటి రూపాయలు ఉన్న భూమిని కేవలం ఎకరా రూ.15 లక్షలకు కేటాయించారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మదనపల్లి వద్ద హార్సిలీ హిల్స్‌ వద్ద సినిమా రంగ నిర్మాణానికి నాలుగు ఎకరాలు కేటాయిస్తే, దానిపై ఎల్లో మీడియా, టీడీపీ పెద్ద ఎత్తున విష ప్రచారం చేసింది. 

-  రియల్ ఎస్టేట్ కంపెనీలకు తక్కువ రేటుకే భూములు

సత్వా కంపెనీకి, కపిల్ గ్రూప్‌కు 30 ఎకరాలు, ఎఎన్‌ఎస్‌ఆర్‌కు 10 ఎకరాలు కేటాయించారు. ఐటీ కంపెనీలకు స్థలం కేటాయించామని చెప్పారు. వరల్డ్ ట్రేట్ సెంటర్స్ విశాఖలో కడతారని ప్రకటించారు. సత్వా అనే కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. వేలంలో ఖరీదైన భూములను కొనుగోలు చేసే సామర్థ్యం ఉంది. ఐటీ కంపెనీల పేరుతో వాటికి భూములు కేటాయించి, రాయితీలు ఎలా ఇస్తారు? దేశంలోనే మొట్ట మొదటి సారిగా రియల్ ఎస్టేట్‌ కంపెనీలకు వ్యాపారాలు చేసుకునేందుకు తక్కువ రేటుకు భూములును ఇస్తున్నారు.

Back to Top