తాడేపల్లి: లులూ కంపెనీతో సీఎం చంద్రబాబుకు ఉన్నది అవినీతి బంధం అని మాజీ ఎమ్మెల్సీ మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖతో పాటు విజయవాడలో కూడా రూ.వేల కోట్ల విలువైన భూములను లులూ సంస్థకు కట్టబెట్టేందుకు చంద్రబాబు చూపుతున్న ప్రేమ వెనుక భారీ అవినీతి దాగి ఉందని అన్నారు. ప్రభుత్వ భూములను ఇంత దారుణంగా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్న చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చవిచూడక తప్పదని హెచ్చరించారు. లులూ సంస్థకు చేసిన భూకేటాయింపులను వెనక్కి తీసుకోవాలి, దీనిపై జారీ చేసిన జీఓలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... లులూ గ్రూప్‌నకు దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టడం దారుణం. లులూ గ్రూప్ మీద చంద్రబాబుకి ఎందుకింత వల్లమాలిన ప్రేమో చెప్పాలి. విశాఖ, విజయవాడలో లులూ సంస్థకి భూములు కేటాయింపులను భారీ అవినీతి వ్యవహారంగా చూడాలి. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ జనవరి 17న సీఎం చంద్రబాబు కి ఒక లేఖ రాసిన వెంటనే భూముల కేటాయింపులకు కూటమి ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంది. ఆ సంస్థ నుంచి కనీసం రిక్వెస్ట్ ప్రపోజల్ రాకుండానే విశాఖలో వాల్తేరు హార్బర్‌పార్కు వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలు 99 సంవత్సరాలకు లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.150 కోట్లు ఖరీదు చేసే భూమిని ఈ ప్రభుత్వం చదరపు అడుగు కేవలం రూపాయిన్నరకే కట్టబెట్టడాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలు భూ కేటాయింపు వలన ప్రభుత్వానికి ఏకంగా రూ.2,100 కోట్ల నష్టం వాటిల్లుతుంది. మొదటి మూడేళ్లు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి లీజు వసూలు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైగా 3.30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు. 99 ఏళ్లపాటు సుదీర్ఘకాలం లీజుకివ్వడంతోపాటు లులుకి చేకూర్చిన ప్రయోజనాలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్రానికి నష్టం జరిగే ఈ చర్యను వైయస్ఆర్‌సీపీ సహించదు. రాష్ట్ర సంపదను తన వారికి అడ్డగోలుగా దోచిపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని తీరుతాం. విజయవాడలో లులూకి 4.15 ఎకరాలు విశాఖలోనే కాకుండా విజయవాడ నడిబొడ్డున బందరు రోడ్డులో పాత బస్టాండుగా పిలిచే గవర్నరుపేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని లులూ చేతిలో పెట్టింది. కేవలం రూ.156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఈ షాపింగ్ మాల్‌ను లులు అభివృద్ధి చేయనుంది. ఇందుకుగాను 99 సంవత్సరాల కాల పరిమితికి లీజు విధానంలో ఈ భూమిని లులుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రూ.156 కోట్ల పెట్టుబడి కోసం ఏకంగా రూ.600 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేసింది. విశాఖ, విజయవాడలో విలువైన భూములు లులు గ్రూపునకి చదరపు అడుగు రూ. 1.50కే కేటాయించిన కారణంగా ప్రభుత్వానికి ఏకంగా రూ. 3 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఒక పద్ధతి ప్రకారం లులూ సంస్థకి మేలు చేయాలన్న లక్ష్యంతోనే భూకేటాయింపులు చేశారు. భారీ లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే 99 ఏళ్లపాటు సుదీర్ఘకాలం లీజుకివ్వడం, మూడేళ్ల పాటు అద్దె మినహాయింపులు, 3.30 లక్షల చదరపు అడుగులు విక్రయించుకునే వెసులుబాటు తదితర నిర్ణయాల వెనుక భారీ అవినీతి దాగి ఉందన్నది వైయస్ఆర్‌సీపీ భావిస్తోంది. భారీ రద్దీగా ఉండే బందర్ రోడ్డు ప్రాంతంలో లులూ మాల్ తీసుకురావడం వల్ల ట్రాఫిక్ కి తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. పైగా తీవ్రమైన నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాల్సిపోయి ఆర్టీసీ స్థలాలను తన వారికి అప్పనంగా కట్టబెట్టడం దారుణమైన చర్య. విజయవాడ నగర ప్రజలు, ఆర్టీసీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. జీవోను వెనక్కి తీసుకోవాలి.