కర్నూలు: రాష్ట్రంలో క్రైస్తవుల ఆస్తులను ఆక్రమించిందీ, అమ్ముకున్నది చంద్రబాబు, ఆయన అనుచరులేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వాళ్లు కూడా క్రైస్తవుల ఆస్తులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, అన్యాక్రాంతం చేసి అక్రమంగా కొట్టేశారని అన్నారు. క్రైస్తవుల ఆస్తులను ఎవరు ఆక్రమించి అమ్ముకున్నారో నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చంద్రబాబుకు దమ్ముంటే తమతో వస్తే అమరావతి రాజధాని ప్రాంతంతో సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కొల్లగొట్టిన క్రైస్తవ ఆస్తులను చూపుతామని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎవరు క్రిస్టియన్ల ఆస్తులను కొల్లగొట్టారనే విషయంగా బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబును నిలదీశారు. ఈ విషయంగా ఎక్కడికైనా వచ్చి బహిరంగంగా చర్చించడానికి, టీడీపీ నేతలు అమ్ముకుతిన్న క్రైస్తవుల ఆస్తులను చూపించడానికి కూడా తాము సిద్దమేనని నాగార్జున సవాల్ చేశారు. గుంటూరు-కృష్ణా జిల్లాల్లో క్రైస్తవ ఆస్తులను అడ్డగోలుగా దోచేశారుః అమరావతి రాజధాని ప్రాంతంతో సహా, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో క్రైస్తవ ఆస్తులను, దళితుల అసైన్డ్ భూములను అడ్డగోలుగా దోచేశారని, చంద్రబాబు, ఆయన అనుచరులు దోచేసిన క్రైస్తవ ఆస్తులను చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు, విజయవాడలో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో రండి మేము చూపిస్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక.. క్రైస్తవులు, దళితుల ఆస్తులను కాపాడటంతోపాటు, రాష్ట్రంలో పాస్టర్లకు గౌరవవేతనాలను ఇవ్వడంతో పాటు, దళిత క్రిస్టియన్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని అన్నారు. అలాగే దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పారు. వందేళ్ళ తర్వాత భూసర్వే జరిపించి, భూ సంస్కరణలు తెచ్చి, 22 ఏ, అసైన్డ్ భూములకు సంబంధించి దాదాపు 35 లక్షల ఎకరాలకు నిజమైన అర్హులకు హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. దళితులపై కేసులు ఎత్తేసినా విమర్శలా..? చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు, ఎన్నో అమానుషాలు జరిగాయని అన్నారు. దళితులపై పెత్తందారులు పెట్టించిన కేసులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తివేయిస్తే వాటిని కూడా రాజకీయమంటున్న చంద్రబాబుకు సిగ్గుందా అని దుయ్యబట్టారు.కొంత మంది దళితులను తన దగ్గర పెట్టుకొని చంద్రబాబు వారితో నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఓ గజదొంగ అంటూ తీవ్రంగా ఆరోపించారు. దళితులకు మేలు జరిగే కార్యక్రమాలను కోర్టుకు వెళ్లి అడ్డుకున్న చరిత్ర కూడా చంద్రబాబుదేనని మంత్రి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఒక గజదొంగః ఎన్నికలు వస్తున్నాయని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఓ గజదొంగ. మా మీద దాడులు, అఘాయిత్యాలు చేయించారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. దళితులపై అమానుషంగా కేసులు పెట్టారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రం వారిపై కేసులు ఎత్తివేశారు. చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల ప్రజలకు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని మేలు చేస్తున్న ఈ ప్రభుత్వంపైనా, జగన్ మోహన్ రెడ్డిగారిపైనా, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. చంద్రబాబుకు మతిస్థిమితంలేదని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. రామోజీ ఎల్లో రాతలు-బాబు మాటలు అందులో భాగమేనన్నారు. జగన్ మోహన్ రెడ్డిగారి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయంగా మనుగడ కోసమే చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల ఇస్తామంటే కేసులు పెట్టారు. నాడు-నేడు కింద స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బాగుచేసిన చరిత్ర వైఎస్ జగన్ గారిదే. వైఎస్సార్‌సీపీకి దళితుల సంపూర్ణ మద్దతు ఉంది అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.