చంద్రబాబు బతుకంతా అబద్ధాలే..

దళితులకు ఎవరేం చేశారో చర్చిద్దాం.. రా బాబూ..

చంద్రబాబుకు మరోసారి ఛాలెంజ్ విసిరిన మంత్రి మేరుగు నాగార్జున

‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా’ అన్న మాటలపై నాలుక మడతేస్తున్న బాబు

అధికారంలో ఉంటే పెత్తందార్లు.. అధికారంపోతే పేదలు, దళితులు బాబుకు గుర్తొస్తారు

విశాఖ‌ప‌ట్నం: చంద్రబాబు, లోకేశ్‌ల పర్యటనలకు ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో తండ్రీకొడుకులిద్ద‌రూ పేదరికం, దళితులు అంటూ కొత్తకొత్త మాటలు.. సరికొత్త రాగాలు పలుకుతున్నార‌ని, వారి మాట‌లు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంద‌ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఎన్నికలు, ఓట్లు అవసరం అనుకున్నప్పుడల్లా చంద్రబాబుకు కొత్తకొత్త మాటలు.. కొత్తహామీలు గుర్తుకొస్తున్నాయన్నారు. అందుకే,  ప్రజలు అమాయకులు.. తాను ఏం చెప్పినా నమ్ముతారనే భ్రమలో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడన్నారు. వైజాగ్ వైయ‌స్‌ఆర్‌సీపీ కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంకా ఏమన్నారంటే..
గతంలో ఎవరైతే దళితుల్ని కించపరిచి అవమానపరిచారో.. నేడు వారే దళితులంటే ఎనలేని ప్రేమ ఉందంటూ.. మాయమాటలు చెబుతూ మభ్యపెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు దళితుల్ని ఉద్దేశించి గతంలో ఏమన్నాడో.. అప్పట్లో దళితుల నుంచి చంద్రబాబు, టీడీపీ ఎంత తీవ్రమైన వ్యతిరేకతను తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఎంత బలమైన దళిత వ్యతిరేకి అనేది, దళిత ద్రోహి అనేది అర్ధమవడానికి ఈ వీడియోలు చూస్తే అర్థమవుతోంది. - ఈ సందర్భంగా... గతంలో దళితుల్ని ఉద్దేశించి హేళనగా, అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబు మాటల్ని టీవీస్క్రీన్‌పై ప్రసారం చేశారు. 
-  ‘దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..’ అని ఆనాడు చంద్రబాబు మాట్లాడిన మాటలు రికార్డుల్లో ఇప్పటికీ భద్రంగా ఉంటాయి కదా.. మరి, ఈరోజు మాత్రం తాను అలా అనలేదు.. ఇలా అన్నానని నాలుక మడతేయడం ఎంతవరకు సబబు అనిని అడుగుతున్నాను. నువ్వు దళితుల్ని చులకనగా  మాట్లాడినప్పుడు.. వాళ్లు నిన్ను ఛీత్కరించుకుంది నిజం కాదా..? అని చంద్రబాబును  ప్రశ్నిస్తున్నాను.
- అదే చంద్రబాబు కొడుకు లోకేశ్.. దళితులు ఏం పీకారు.. ఏం పొడిచారు.. అని మాట్లాడిన మాటలు నిజం కాదా..?
- బీసీల తోకలు కత్తిరిస్తానన్నది చంద్రబాబు కాదా.. ?
- ఈ వీడియోలు సాక్ష్యాలు కాదా..?
- వీడియో, ఆడియో సాక్ష్యాలు ఉన్నా.. చంద్రబాబు దొరికిన దొంగలా తప్పించుకోవాలని చూస్తున్నాడు. 

బతుకంతా అబద్ధాలే.. 
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి.. ఫార్టీఇయర్స్‌ పొలిటికల్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు బతుకంతా అబద్ధాలతోనే నడిచింది. అధికారంలో ఉన్నప్పుడు పెత్తందార్లకు వత్తాసు పలికి.. అధికారంలో లేనప్పుడు పేదల పేరుతో ఓట్లు దండుకోవాలని చూసే నయవంచకుడు ఈ చంద్రబాబు.  స్కీముల పేరుతో ప్రతిదీ స్కాము చేసిన వ్యక్తి చంద్రబాబు. పేదల పేరుతో సంక్షేమ పథకాలు పెట్టి, వాటి ముసుగులో తన పార్టీ కార్యకర్తలకు  ఇష్టానుసారంగా దోచి పెట్టిన వ్యక్తి, తద్వారా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన పెద్ద గజదొంగ ఈ చంద్రబాబు. ఇతను ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం ఎంత దురదృష్టమో అందరూ ఆలోచించాలి. 

- చంద్రబాబు ఎంత అబద్దాలకోరనేది అతను గతంలో మాట్లాడిన మాటలు చూస్తే తెలుస్తుంది. వ్యవసాయం దండగన్నది ఈ ప్రబుద్ధుడే.. కానీ, నా మాటల్ని వక్రీకరించారంటూ రైతుల దగ్గర మొసలికన్నీరు కారుస్తాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నది చంద్రబాబు కదా..? కానీ, తానన్న సందర్భం, వాతావరణం వేరు అంటూ ఈరోజు కొత్తకొత్తగా మాట్లాడుతున్నాడు. ఏనాడైనా, బాబు అధికారంలో ఉన్నప్పుడు దళితులు గానీ, ఆయన పార్టీలో పనిచేసిన దళిత నేతలు గానీ తలెత్తుకుని తిరిగారా..? అని అడుగుతున్నాను. ఇందుకు చంద్రబాబు నుంచి సమాధానం రావాలని నిలదీస్తున్నాను.  

పేరేమో దళితులది.. ఇన్నోవా కార్లేమో పెత్తందార్లకు..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు చేసిన మేలేంటి..? ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలేంటి..? వాటిల్లో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల పేర్లు చంద్రబాబు చెప్పగలరా..? అని ప్రశ్నిస్తున్నాను. ఐదేళ్లు అధికారం నడిపిన బాబు జమానాలో దళితలుకు రూ.33వేల కోట్లు ఖర్చు పెడితే.. అందులో ఎంత అవినీతి జరిగిందో.. పేదల పేరిట పెత్తందార్ల చేతికి ఇన్నోవా కార్లతో సహా.. దళితులకు, పేదలకు దక్కాల్సిన నిధులను తన అనుయాయులకు, తన పార్టీ నేతలకు ఏవిధంగా కట్టబెట్టారో అందరికీ తెలిసిందే.. అదే మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల కాలంలోనే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రూ. రూ.53వేల కోట్లు ఖర్చు చేశామని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడా మధ్యవర్తులు, దళారులు లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా సంక్షేమాన్ని జమ చేశామని చెప్పుకుంటున్నాం. 

అణగారినవర్గాలు, నిమ్నజాతుల శ్రేయస్సుకు ఆశాజ్యోతిగా పనిచేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌  ఆలోచనలకు అనుగుణంగా నేడు దళిత పక్షపాతిగా మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని ఆదుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో వారికి అగ్రభాగం కల్పించి సామాజికవిప్లవానికి తెరదీసిన ఘనత మా నాయకుడికే దక్కుతుంది. ఆనాడు బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పేలా.. ఈరోజు దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో నాయీబ్రాహ్మణులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగం పదవులు కట్టబెట్టారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని పెడతానని మాయమాటలు చెప్పి తప్పించుకున్న చంద్రబాబు ద్రోహాన్ని దళితులెవరూ మరిచిపోలేరు. మరి, ఈరోజు మేం విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం.  

 ఛాలెంజ్‌ను స్వీకరించలేని దద్దమ్మ చంద్రబాబు
ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ హయాంలో ఎంత నిధులు కేటాయించారు.? ఏమేరకు అభివృద్ధికి పాటుపడ్డారు..మరి, మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకొచ్చిన నాలుగేళ్లల్లో మేమెంత నిధులు కేటాయించి.. అభివృద్ధిలోకి తెచ్చామనే అంశంపై చర్చకు రమ్మని నేను ఇప్పటికే చంద్రబాబుకు ఛాలెంజ్‌ విసిరాను. అయితే, ఆయన స్పందించకుండా.. వాళ్లపార్టీలోని ఓ తాగుబోతు మాజీమంత్రిని నా మీదకు ఉసిగొల్పుతాడా..? పైగా, నేను తాగుబోతునంటూ ఆ మాజీనేత మాట్లాడతాడా..? దమ్ముంటే, బాబు సమక్షంలోనే నేనూ, ఆ మాజీమంత్రి వైద్యపరీక్షలు చేయించుకుని అసలైన తాగుబోతులెవరో తేల్చుకుంటానికి సిద్ధమా..? అని నిలదీస్తున్నాను. బాబు హయాంలో హాస్టళ్లు మూసేసి దళిత పిల్లల్ని నిరక్ష్యరాస్యులుగా మార్చితే.. మా నాయకుడు నాడు-నేడు పేరిట ఆ హాస్టళ్లను తెరిపించి సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఇంగ్లీషు మీడియం చదివిస్తున్న గొప్ప విద్యావేత్తగా నిలిచారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఏమీ చేయలేని దళితద్రోహివని చర్చకు రమ్మని చాలెంజ్‌ చేశాను. ఏదిఏమైనా మా పరిపాలనలో జరుగుతున్న దళితుల అభివృద్ధిని చూసి చంద్రబాబు ఈరోజైనా మారాలని కోరుకుంటున్నాను. లేదంటే, మా ఛాలెంజ్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేస్తున్నాను. 

2024లో బాబును ఓడగొట్టేందుకు ప్రజలు సిద్ధం
పేద, బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి అహరహం కృషిచేస్తున్న మా నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. మేం గడపగడపకు మన ప్రభుత్వం, మా భవిష్యత్తు జగనన్నే కార్యక్రమాలతో ఊరూరూ పర్యటిస్తున్నప్పుడు  ఈరోజు ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలు అందుతున్నాయని లబ్ధిదారులు ఆనందంగా చెబుతున్నారు. అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి ఎన్నో పథకాలతో దళితుల జీవనశైలి మార్పును కళ్లారా చూస్తున్నాం. పేదల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే.. చంద్రబాబు, లోకేశ్‌లలో కడుపుమంట తీవ్రమైనందునే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 28చోట్ల  కిందటి ఎన్నికల్లో ఓడించిన చంద్రబాబుకు రాబోయే రోజుల్లో కూడా పరాభవం తప్పదని చెబుతున్నాను. 2024లో కూడా ఆయన్ను, ఆయన పార్టీ రథచక్రాలను ఊడగొట్టి ఓడగొట్టేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాను.

Back to Top