అమరావతి ముద్దు..రాష్ట్రాభివృద్ధి వద్దు..ఇదే బాబు నినాదం

 వెనుకబడిన ప్రాంతాలపై చంద్రబాబుకు ఎందుకంత ధ్వేషం

అధికార వికేంద్రీకరణను మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు

చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలా? 

చంద్రబాబే అధికార ఉన్మాది

బీసీజీ నివేదికను బోగి మంటల్లో వేయమనడం ఎంత వరకు సమంజసం?

చంద్రబాబు గ్లోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

కమ్యూనిస్టులు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి?

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

కాకినాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వెనుకబడిన ప్రాంతాలపై ఎందుకంత ధ్వేషమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. అమరావతి ముద్దు..రాష్ట్రాభివృద్ధి వద్దు అన్నదే చంద్రబాబు నినాదమని, అన్ని ప్రాంతాల అభివృద్ధే వైయస్‌ జగన్‌ నినాదమని వివరించారు. చంద్రబాబే అధికార ఉన్మాది అని మండిపడ్డారు. కాకినాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..కన్నబాబు మాటల్లోనే..

చంద్రబాబు సిగ్గు లేకుండా  మళ్లీ రోడ్డు మీదకు వచ్చి గతంలో ఏ తప్పు చేశారో అదే తప్పు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబుకు ప్రేమ ఉండటం సహజం. మీ ప్రేమను అర్థం చేసుకుంటాం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై ధ్వేషమెందుకో అర్థం కావడం లేదు. అమరావతిలో రాజధాని పెట్టినప్పుడే మీ ప్రేమ అర్థమైంది. మిగతా ప్రాంతాలపై ధ్వేషం పెంచుకోవడం తప్పుకాదా చంద్రబాబు. ఇటు విశాఖ ఉత్తరాంధ్రలో ప్రధాన నగరం, అటు కర్నూలు రాయలసీమలోనే ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అధికార వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చకు దారి తీసినప్పుడు దానిపై ప్రభుత్వంపై కూడా ఒక ఆలోచన చేస్తుంది. దానికి ఒక మంచి సలహా ఇవ్వడం మానేసి తెల్లారింది మొదలు శోకాలు పెడుతున్నారు.  విశాఖ, శ్రీకాకుళం, కర్నూలులో అభివృద్ధి జరుగొద్దా? ..మీరు చెప్పిన ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలా? మీరు వేసిన అంచనాల ప్రకారమే రూ. లక్ష తొమ్మిది వేల కోట్లు తీసుకువచ్చి అమరావతిలో పెట్టాలా?. ఏం..మిగతా జిల్లాలు అభివృద్ధి చేయవద్దా? తాగునీటి, సాగునీటి అవసరాలు లేవా? విద్యా, వైద్య వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదా? తమరే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారు. రూ. రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు. లక్ష కోట్ల అప్పు ఇప్పుడు పుడుతుందా? . ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాలను ఎలా విస్మరిస్తారంటే ప్రభుత్వం స్పందించకూడదా? చంద్రబాబు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. విశాఖ వెళ్లి నడిబొడ్డుపై నిలబడి ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను వ్యతిరేకిస్తున్నానని చెప్పే దమ్ముందా? కర్నూలు నడిబొడ్డుపై నిలబడి ఇక్కడ జ్యూడిషియల్‌ క్యాపిటల్‌ను వ్యతిరేకిస్తున్నానని చెప్పగలవా? అమరావతిపై మీకెందుకు ప్రేమా? ఆలు లేదు..చూలు లేకపోయినా మీరు రోడ్డెక్కి ప్రజలను రోడ్డుపైకి తెచ్చారు. మాయలపకీర్‌ ప్రాణాలు చిలుక చేతిలో ఉన్నట్లు..చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉన్నట్లు గిజగిజ అల్లాడిపోతున్నారు. చంద్రబాబు భాషను అదుపులో పెట్టుకోవాలి. మీ సీనియారిటీకి, మీరు వాడే భాష తగదు. మీ 40 ఏళ్ల ఇండస్ట్రీకి మీ భాష తగదు. ముఖ్యమంత్రిని ఉన్మాది అంటున్నారు. అధికార ఉన్మాది అంటే దేశం మొత్తం వేలెత్తి మీవైపే చూపుతుంది. అధికార ఉన్మాదంతోనే కదా ఎన్టీఆర్‌ కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది. అధికార ఉన్మాదంతోనే కదా ఓటుకు కోట్లు కేసును నెత్తిమీదికి తెచ్చుకుని రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి పెట్టే బేడ సర్దుకుని అమరావతికి వచ్చింది. అధికార ఉన్మాదం కాదా ఈ రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైంది. ఈ రాష్ట్ర విభజన సమయంలో 2008లోనే మీ పార్టీ పోలిట్‌బ్యూరోలో తీర్మానం చేసింది వాస్తవం కాదా?.
బీసీజీ రిపోర్ట్‌ను బోగి మంటల్లో పడేయాలని చంద్రబాబు అంటున్నారు. ఏడు నెలల ముందే ఈ రాష్ట్రంలో ప్రజలు బోగి మంటలు వేసుకున్నారు. ఆ మంటల్లో  ఎవరెవర్ని వేశారో..ఆ మంటల్లో ఎవరి హహకారాలు వినిపిస్తున్నాయో మీకు తెలుసు. నీకు నచ్చకపోతే బోగి మంటల్లో వేస్తావా.  ఇదే బీసీజీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నీతి అయోగ్‌కు కన్సల్టెన్సీగా ఉన్నప్పుడు మీకు మంచిగా అనిపించేది. ఇప్పుడు వాస్తవం చేదుగా అనిపిస్తుందా?.నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా నిబద్ధతతో వ్యవహరించాలి. జీఎన్‌ రావును తిట్టావు. విజయ్‌కుమార్‌ను కూడా తిట్టారు. శివరామకృష్ణన్‌ కమిటీ రాజధానిని అమరావతిలో పెట్టమని చెప్పిందంట. అప్పట్లో ఈటీవీలో శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక వివరాలను కన్నబాబు మీడియాకు వివరించారు. శివరామకృష్ణన్‌ ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఒక నిపుణుడు. లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌నారాయణ కూడా మూడు రాజధానులు మంచి నిర్ణయమే అన్నారు. మన దేశంలోనే 14 రాష్ట్రాల్లో రాజధాని, హైకోర్టులు వేరు వేరుగా ఉన్నాయి. కమిటీ నివేదికలు చంద్రబాబు ఆ రోజు ఎందుకు అమలు చేయలేదు. మీ ఇష్టప్రకారమే కదా నారాయణతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సలహాదారు చెబితే జీఎన్‌ రావు రాసి ఇచ్చారని హేళనగా మాట్లాడుతున్నారు. జరిగిన తప్పులు సరిదిద్ధడమే పరిపాలకుల లక్ష్యం. రాజధానికి లక్ష కోట్లు ఖర్చు చేసే స్థోమత మన వద్ద లేదు. చంద్రబాబు తెచ్చిన అప్పులకే రూ.570 కోట్లు వడ్డీ కడుతున్నాం. ఇంత సాధ్యమా? రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి కానీ..కూలీ ఖుత్బుషా మాదిరిగా అమరావతిని మహా నగరంగా నిర్మించాలని చంద్రబాబు భావించారు.  సీఎం వైయస్‌ జగన్‌ ఏం చెబుతున్నారు. వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలకు సమతుల్యత వస్తుంది. అందరికి సమానమైన గౌరవం దక్కుతుందని సీఎం ఉద్దేశం. చంద్రబాబు ఏమంటున్నారు. విశాఖలో రాజధాని పెడితే అనంతపురానికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందని చెబుతున్నారు.  ఢిల్లీ ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? మొన్నటి వరకు ఉమ్మడి ఏపీకి శ్రీకాకుళం ఎంత దూరమో తెలియదా?. రాజధాని అంటే అనువైన నగరంలో మౌలిక వసతులు నిర్మించుకునేది. దానికి టేపులు పెట్టి దూరం కొలుస్తున్నారు. ఇవన్నీ చెబితే రాయలసీమ ప్రాంతం వాసులు వ్యతిరేకించకపోరా అని భ్రమలో ఉన్నారు. ఇవాళ దీక్షలో ఓ మహిళ నాలుగు గాజులు చందా ఇచ్చారని, మరో మహిళ సభకు భర్తకు చెప్పకుండా వచ్చారని, ఆమెను భర్త ఏమనకుండా చంద్రబాబు సముదాయించడం..ఏమిటీ డ్రామా? కత్తి కాంతారావు సినిమా మాదిరిగా చూపిస్తే జనం ఏమనుకుంటారు. చంద్రబాబు మాయలో పడిన వారు ఇంత వరకు బతికి బట్ట కట్టలేదు. రాజకీయంగా చాలా మంది విలవిల కొట్టుకున్నారు. తాజాగా కమ్యూనిస్టులను రాజధాని ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఇదే పెద్దలు చంద్రబాబుపై నమ్మకం లేక 7 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో ఆయనతో జత కట్టలేదు. సీపీఐ నారాయణ మాట్లాడుతున్నారు..గతంలో కమ్యూనిస్టులు పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా  ఇళ్లు, మంచినీరు, మౌలిక వసతులపై ఉద్యమాలు చేసేవారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అడగకుండానే అన్ని చేస్తున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, మంచినీళ్లు, ఆసుపత్రులు, వైద్యసేవలు, ఆరోగ్యశ్రీ పెంపు, అదనంగా ఆర్థికసాయం ఇచ్చేసరికి కమ్యూనిస్టులకు పని లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు వెనుకలా వెళ్లి ఉద్యమం చేస్తున్నారు. నారాయణను సూటిగా అడుగుతున్నాను..ఎప్పుడైన ఫ్యూడలిస్టులు, క్యాప్టలిస్టుల పక్కన నిలబడి ఉద్యమం చేశారా?. ఫ్యూడలిస్టు విధానానికి నారాయణ మద్దతు పలుకుతున్నారా? ఇదా మీరు చేసే పని? గతంలో ల్యాండ్‌ఫూలింగ్‌ సమయంలో ఇతరుల కన్న తక్కువ పరిహారం ఇస్తే చంద్రబాబుకు వ్యతిరేకంగా అప్పుడు ఎందుకు ఉద్యమం చేయలేదు. కౌలు సరిపోదని ఎందుకు ఉద్యమం చేయలేదు. ఇవాళ మిగతా ప్రాంతాల ప్రయోజనాలకు కూడా ఆలోచించకుండా చంద్రబాబుతో కలిసి ఉద్యమం చేస్తున్నారు. ఎటు వెళ్తున్నారో ఆలోచించండి..ఏదో పాట ఉన్నట్లుగా ఆ గట్టున ఉంటారో..ఈ గట్టున ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం. రాష్ట్రంలోని విశాల ప్రయోజనాల పక్షంలో ఉంటారా? చంద్రబాబు అనుచరులు, వారి సహచరుల ప్రయోజనాల పక్షాన నిలబడుతారో కమ్యూనిస్టులు తేల్చుకోవాలి?. ఎవరూ కూడా అమరావతికి, అక్కడి రైతులకు వ్యతిరేకం కాదు. అమరావతి రైతులకు నూటిని నూరు శాతం న్యాయం చేయాలని కోరుకునేవాళ్లం. అమరావతి బ్రహ్మండమైన లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ రావాలని కోరుకుంటున్నాం. అక్కడ నిలబడి మాట్లాడాలని కోరుకుంటున్నాం. అక్కడ లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఉంటుందంటే..కాదు రాజధాని మార్చేస్తున్నారని గోల చేస్తున్నారు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసేది కరెక్టా? కాదా అన్నది ఆలోచించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అమరావతి ముద్దు..రాష్ట్ర అభివృద్ధి వద్దు అన్నది చంద్రబాబు నినాదం. రాష్ట్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరమన్నది సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నినాదం. 

Back to Top