కందుకూరు మరణాలు చంద్రబాబు చేసిన హత్యలే..

పబ్లిసిటీ పిచ్చితో 8 మంది అమాయకులను బలి తీసుకున్నాడు

ప్రచార యావతో ఇరుకు సందుల్లో రోడ్‌షో పెట్టి అమాయకులను చంపాడు

చంద్రబాబు అనే వ్యక్తి మన రాష్ట్రంలో జన్మించడమే ఈ రాష్ట్రం చేసుకున్న ఖర్మ

నీ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఆ కుటుంబాలకు ఆ ప్రాణాలను తెచ్చి ఇవ్వగలదా..?

చంద్ర‌బాబును ప్ర‌ధాన దోషిగా చేర్చి స‌మ‌గ్ర విచార‌ణ చేయాలి

చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపాటు

నెల్లూరు: చంద్రబాబు ప్రచార పిచ్చి, అధికార దాహం, లేనిది ఉన్నట్టుగా చూపించాలనే ప్రయత్నం 8 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. కందుకూరు మరణాలు చంద్రబాబు చేసిన హత్యలేనని, ఈ ఘటనలో ప్రధాన దోషి చంద్రబాబేనని, ఎఫ్‌ఐఆర్‌ కట్టి.. సమగ్ర విచారణ జరపాల్సిందేనని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సభకు విపరీతమైన జనాలు వచ్చారని చూపించుకోవాలనే పబ్లిసిటీ పిచ్చితోనే కూలీకి వచ్చిన 8 మంది అమాయకులు చనిపోయారని, మరో 5గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఎన్ని పొరపాట్లు చేయాలో అన్నీ చంద్రబాబు చేశాడని, చనిపోయిన వారి కుటుంబానికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, సంతాపం, నీ విచారం ఆ కుటుంబానికి పోయిన ప్రాణాలను తెచ్చి ఇవ్వగలదా..? అని నిలదీశారు. 

నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటనపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రచార పిచ్చితోనే చంద్రబాబు 8 మంది ప్రాణాలను బలితీసుకున్నాడని మండిపడ్డారు. ఇదేం ఖర్మ అని చంద్రబాబు అనడం కాదు..  చంద్రబాబు పుట్టడమే ఈ రాష్ట్రం చేసుకున్న ఖర్మ అని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి విలేకరుల సమావేశం నిర్వహించారు.

మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. 
‘‘చంద్రబాబు ఏర్పాటు చేసే సమవేశాలన్నీ ఇరుకుగా ఉండే ప్రాంతాలు. జనం ఎక్కువ మంది వచ్చారని చూపించడానికి చంద్రబాబు గత కొద్దిరోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కొంతమంది మీడియాలో బాకా ఊదుతున్నారు. చంద్రబాబు సభకు విశేషమైన జనం వచ్చారు.. కిలోమీటర్ల దూరంలో జనం నిలబడ్డారని చూపిస్తున్నారు. 

చంద్రబాబు ఒక ప్రత్యేకమైన టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ సమావేశం పెట్టాలి.. కూలికి ఎంతమంది జనాలను సమీకరించాలి. డ్రోన్‌ కెమెరాలో ఏ విధంగా కవర్‌ చేసి ఉన్నది లేనట్టుగా చిత్రీకరించాలనేదానిపై దృష్టిపెట్టాడు. అందులో భాగంగానే నిన్న కందుకూరులో రోడ్‌షో చేపట్టారు. 

చంద్రబాబు అధికార దాహం, లేనిది ఉన్నట్టుగా చూపించడానికి చేసే ప్రయత్నం నిన్నటి రోడ్‌షోతో స్పష్టంగా అర్థం అవుతుంది. కూడలిలో రోడ్‌షో ఏర్పాటు చేశాడు. జనాన్ని ఎక్కువగా ఉన్నారని చూపించాలనే అత్యుత్సాహంతో ఆ సమావేశానికి నిర్ణయించిన ప్రదేశానికంటే ఆయన ప్రచార వాహనాన్ని ముందుకు తీసుకువచ్చాడు. 20 అడుగుల వెడల్పు ఉండే రోడ్డులో చంద్రబాబు వాహనం రావడం, అక్కడున్న గ్రూపు రాజకీయాలు పోటాపోటీగా రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు కట్టారు. జనాలు అటూఇటూ వెళ్లిపోకుండా ఫ్లెక్సీల మధ్యలో నిలబడితే డ్రోన్‌ కెమెరాలతో చూపించి చంద్రబాబు సభకు చాలా మంది జనం వచ్చారని చూపించడానికి చేసిన ప్రయత్నం వికటించి 8 మందిని బలితీసుకున్నాడు. 

ఎన్ని పొరపాట్లు చేయాలో.. ఎన్ని చేయకూడదో.. అన్ని రకాల పొరపాట్లు చేసి ఆ 8 మంది చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. ఇది శవ రాజకీయం కాదు.. ఇది వాస్తవం. 8 మందిని చంద్రబాబు పొట్టనబెట్టుకున్నాడనే ఆవేదనతో మాట్లాడుతున్నాం. కూలి డబ్బులు ఇస్తారని వచ్చి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ప్రతీ హృదయాన్ని కలచివేస్తోంది. 

చంద్రబాబు రావడం, వచ్చిన తరువాత ఇరుకు సందులో బస్సు పెట్టడం, తనతో కొంతమంది తీసుకొచ్చి అప్పటికే ముందు చేరిన జనం వెనకవచ్చినవారితో తోపులాట జరగడం, ఫొటో షూట్‌లో బస్సును ముందుకు, వెనక్కి పోనివ్వడం, దాని వల్ల వెనకున్నవారు, ముందున్నవారు తొక్కిసలాటకు గురయ్యారు. పక్కన ప్రమాదకరంగా డ్రైనేజీ ఉందని చెప్పినా.. కనీసం ఆ మాత్రం స్పృహ లేకుండా అక్కడే బస్సును నిలిపాడు. 

చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం ఎంతమందిని బలిచేసుకుంటాడని ప్రశ్నిస్తున్నాం. గతంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి వచ్చిన వారిని నిలువరించి షూటింగ్‌ పిచ్చితో, పబ్లిసిటీ పిచ్చితో ఆరోజున 29 మంది చావుకు కారణమయ్యాడు. నిన్న కందుకూరులో జరిగిన దుర్ఘటనలో పక్కనే ఆస్పత్రి ఉండటం వల్ల క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స అందించారు. ఆస్పత్రి సమీపంలో లేకపోతే ఇంకా చాలామంది ప్రాణాలు గాల్లో కలిసేవి. 

నిన్నటి కందుకూరు ఘటనలో పక్కనే ఆస్పత్రి ఉంది కాబట్టి క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించడం జరిగింది. సీఎం వైయ‌స్‌ జగన్ ఆదేశాలతో  ప్రభుత్వయంత్రాంగం తక్షణమే స్పందించి బాధితులకు చికిత్స అందించడంతో  మిగతావారి ప్రాణాలను కాపాడగలిగాం. సంఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ దగ్గర నుంచి ఉన్నతాధికారులు వరకూ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పక్కనే ఆస్పత్రి ఉంది కాబట్టి చాలామంది ప్రాణాలు నిలిచాయి. లేకుంటే చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమై ఘటనా స్థలంలోనే ఉండి బాధితులకు సాయం అందించారు.  మెరుగైన వైద్యం అందిస్తూ, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలనే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. దానివల్లే కొంతమంది ప్రాణాలను నిలుపుకోగలిగాం.

రాజకీయ దాహం కోసం, అధికార ప్రాపకం కోసం ఎంతమందిని చంద్రబాబు బలితీసుకుంటాడని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు ఏదో ఘనకార్యం చేసినట్టుగా కొన్ని మీడియాలు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు ఓదార్పు, సంతాపం, విచారం, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఆ కుటుంబాలకు ఆ ప్రాణాలను తెచ్చి ఇవ్వగలదా..? పేదవాడి ప్రాణానికి వెలకట్టి వదిలేస్తానని అనుకుంటున్నావా..? చేసిన వెధవ పనికి సిగ్గుపడకుండా.. ఘనకార్యం చేసినట్టుగా మాట్లాడటం.. దానికి బాకాలు ఊదుతూ కొన్ని పత్రికలు రాయడం. 

మృతిచెందిన వారి కుటుంబ ఘోష చంద్రబాబు, టీడీపీ నేతలకు తప్పకుండా తగులుతుంది. టీడీపీకి ప్రజాదరణ పెరుగుతుందనే అపోహ సృష్టించడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నంలో భాగమే 8 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఫ్లెక్సీల మధ్య జనాలకు ఇరికించి వారి చావుకు కారణమయ్యారు. సభ విజయవంతం అంటే ఇరుకు సందుల్లో ఎక్కువ జనాన్ని చూపించడమేనా..? నువ్వు రావడం వల్ల మా కుటుంబాలకు ఈ ఖర్మ ఏంటని ఆ కుటుంబాలు నిలదీస్తున్నాయి.. ఆ కుటుంబాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఖర్మ కాదు.. చంద్రబాబు జన్మించడమే ఈ రాష్ట్రానికి ఖర్మ. నీ విపరీతమైన ధోరణి, నీ ప్రవర్తన ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మ. చంద్రబాబు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జన్మించడమే ఈ రాష్ట్రం చేసుకున్న ఖర్మ. 

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడంటే ఎంత దిగజారిపోయాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దిగజారిన చేష్టలు, నడవడికతో ప్రజలకు ముప్పు వాటిల్లింది. కందుకూరులో 8 మంది మృతికి చంద్రబాబే కారణం. అవన్నీ చంద్రబాబు హత్యలు. చంద్రబాబు దోషి, చంద్రబాబు మీద ఎఫ్‌ఐఆర్‌ కట్టాల్సిందే. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే. 

2014 సెప్టెంబర్ లో అసెంబ్లీలో జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు మాట్లాడారు. ఆరోజు జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనూ ప్రచురించారు. ‘జిల్లాలవారీగా చంద్రబాబు ప్రకటించినవి’ చూస్తే.. నెల్లూరు జిల్లాకు సంబంధించి పారిశ్రామిక వాడలు, ఆటోమొబైల్ హబ్, ఎయిర్ పోర్టు, దుగరాజుపట్నం పోర్టు, పులికాట్ సరస్సు, పర్యాటక అభివృద్ది, స్మార్ట్ సిటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్, మెరైన్ ఇనిస్టిట్యూట్, ఎరువుల కర్మాగారం.. ఇవన్నీ చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామిక వాడలు గురించి దేవుడు ఎరుగు. దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఉపాధి కల్పన, పెట్టుబడులు అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఊదరగొట్టారు. కనీసం వీటికి ల్యాండ్ అక్విజేషన్ కూడా పూర్తి కాలేదు. అయిదేళ్ల తన పాలనలో ఏ పనులు మొదలుపెట్టలేదు.  నెల్లూరు జిల్లాలో అడుగుపెడుతున్న చంద్రబాబు నాయుడు వీటన్నిటిపై స్పష్టత ఇచ్చి అడుగుపెట్టాలి. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి. చేయలేని వాటిపై..  చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. జనాలు మర్చిపోయి ఉంటారని అనుకోవద్దు. పారిశ్రామకవాడలు కనీసం ప్రారంభ దశలో కూడా పనులు మొదలవలేదు. నీ బుర్రలో తప్ప ఆటోమొబైల్ హబ్ ఎక్కడుందో కూడా తెలియదు. కనీసం దానికోసం ప్రయత్నం కూడా జరగలేదు. మీ హయాంలో జిల్లాలో ఒక్క ఎయిర్ పోర్టు అయినా ప్రారంభమైందా?

దుగరాజుపట్నం పోర్టు కూడా పునర్విభజన చట్టంలో ఉన్నా కూడా సాధించలేకపోయావు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, పోర్టును అడగకుండా వాటన్నింటిని అటకెక్కించి ప్యాకేజీ చాలనుకున్నావు. పులికాట్ సరస్సు, పర్యాటకానికి ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. స్మార్ట్ సిటీ అని నెల్లూరును ప్రకటించి కేవలం రూ.7 కోట్లు ఇచ్చావు. అందులో కోటి రూపాయిలు ఎక్కడ ఏం ఉండాలనే అంచనాలకే ఖర్చు పెట్టావు. చివరిలో జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నావు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ఎక్కడుంది? మెరైన్ ఇనిస్టిట్యూట్, ఎరువుల కర్మాగారం ఎక్కడుంది? జిల్లాలో అడుగుపెట్టే ముందు విలువలు, విశ్వసనీయత ఉంటే నీ తోక పత్రికల్లో రాసుకున్న వాటిపై సమాధానం చెప్పాలి. లేకుంటే చేయలేకపోయాను క్షమించాలని అడుగు. మా ప్రభుత్వంలో చెప్పినవి చేశాం కాబట్టే.. ధైర్యంగా జనాల్లోకి వెళ్లగలుగుతున్నాం. చంద్రబాబు ఏమీ చేయకుండా చేశామంటూ అన్ని వర్గాలను మోసం చేశాడు. నీ నోటి నుంచి వచ్చేవన్ని అబద్ధాలే. అభివృద్ధి శూన్యం. ఒక్కటి కూడా నీతి, నిజాయితీ లేదు.

ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా జిల్లా ప్రయెజనాలను, జిల్లా ప్రజలను మభ్య పెట్టడానికి వస్తున్న చంద్రబాబుకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి జిల్లాలో పదికి పది సీట్లల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఇప్పటికైనా చంద్రబాబు చౌకబారు వ్యవహారాలు, మాటలు మాట్లాడటం తగ్గిస్తే మంచిది. చంద్రబాబు తన పర్యటనల ద్వారా ప్రజల ప్రాణాలు తీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

Back to Top