ప్రజలిచ్చిన ఐదేళ్ల అవకాశం పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్తాం

పార్టీలో ఇబ్బందులు సృష్టించేందుకు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు

సంక్షేమ పాలనను ప్రతి గడపకూ వివరించాలని సీఎం సూచించారు

‘గడప గడపకూ’ సమీక్ష అనంతరం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

తాడేపల్లి: ప్రజలిచ్చిన ఐదు సంవత్సరాల అవకాశాన్ని పూర్తిచేసుకున్న తరువాతే ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో రకరకాల ఇబ్బందులు సృష్టించాలనే ఉద్దేశంతో ఎల్లో మీడియా అనేక తప్పుడు వార్తలను ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వంపై సమీక్షా సమావేశం అనంతరం మంత్రి అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. 

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆగస్టు మాసంలోపు పూర్తి చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, అసెంబ్లీ సమావేశాల కారణంగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని వెంటనే పునఃప్రారంభించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. నెలకు 25 రోజుల పాటు నియోజకవర్గాల్లో తిరగాలని సూచించారన్నారు. ఈనెల 7వ తేదీన ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలోనూ శాసనసభ్యులు, కోఆర్డినేటర్లు పూర్తిస్థాయిలో పాల్గొనాలని సూచించారన్నారు. దేశంలోనే ఏ రాజకీయ పార్టీకీ లేనంత బలమైన క్యాడర్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు వివరించాలని, ప్రతి తలుపు తట్టి సంక్షేమ పాలన గురించి వివరించాలని సీఎం సూచించారన్నారు. 

రాష్ట్రంలోని దాదాపు 87 శాతం కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహకారం అందించామని, ప్రజలకు ఇవన్నీ చెప్పాలని సీఎం సూచించారన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 20వ తేదీలోపు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారన్నారు. 
 

Back to Top