ఆస్తిపన్నుపై అపోహలు సృష్టించేందుకు ప్ర‌తిప‌క్షాల‌ కుట్ర‌లు

15 శాతానికి మించి ఒక్క పైసా కూడా పెంచే ప‌రిస్థితి లేదు 

గ‌తంలో ఆస్తిప‌న్ను లోప‌భూయిష్టంగా ఉండేది

సంస్కరణల్లో భాగంగానే.. ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం తెచ్చాం

బీజేపీ పాలిత కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే పన్ను విధానం 

జీవీఎల్‌ నర్సింహారావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలన్నదే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ లక్ష్యం

మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

తాడేప‌ల్లి: ఆస్తిప‌న్నుపై ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోంద‌ని మున్సిపల్‌ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం, 15వ ఆర్థిక సంఘం సూచించిన మార్గదర్శకాల నేపథ్యంలో ఆస్తి విలువ ఆధారిత పన్నును రాష్ట్రంలో ప్రవేశపెట్టామ‌న్నారు. ఒక్క పైసా అవినీతికి తావులేకుండా, దళారులు, దోపిడీ, రాజకీయ సిఫార్సులకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా అందరికీ ఒకే విధమైన పన్ను ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్కరణలు తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భవన యజమానులు ఇప్పుడు కడుతున్న పన్ను కంటే 15 శాతానికి ఒక్క పైసా కూడా ఎట్టి పరిస్థితుల్లో మించదు అని మంత్రి బొత్స పునరుద్ధాటించారు.  నూతన పన్ను విధానం వల్ల రూ.10 వేల కోట్ల పన్నుల భారం అంటూ టీడీపీ, బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృషించి, గందరగోళపరిచేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. నూతన ఆస్తి పన్ను విధానం ద్వారా ప్రభుత్వానికి కేవలం రూ. 186 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. పేదలు నివాసం ఉండే 375 చదరపు అడుగుల ఇళ్ళకు ఏడాదికి కేవలం రూ. 50 మాత్రమే పన్ను విధించినట్టు చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆస్తి పన్ను నూతన విధానమే బీజేపీ పాలిత కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉందని మంత్రి బొత్స తెలిపారు. గతంలో లోపభూయిష్టంగా ఉండే ఆస్తి పన్ను విధానాన్ని సంస్కరించి, ప్రజలకు మరింత ప్రయోజనకరంగా, పారదర్శకంగా ఉండేందుకే ఈ విధానాన్ని తెచ్చామన్నారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నట్టు.. పన్ను వందల్లోనో, వేలల్లోనో  పెంచలేదన్నారు. రూపాయికి పైసాలో పదోవంతు మాత్రమే పన్ను పెంచామన్నారు. పన్నులు పెంచమని కేంద్రమే చెప్పిందని తాము ఎక్కడా చెప్పలేదు, చెప్పం కూడా. అయినా, బీజేపీ నేతలతో సుద్దులు చెప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదని బొత్స స్పష్టం చేశారు. 

ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ఆస్తి పన్ను పెంపు విధానంపై దేశంలో మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో మూడు కమిటీలను నియమించి అధ్యయనం చేశాం. కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ ఆస్తి పన్నుల విధానంపై పరిశీలన చేశాం. ఆ తర్వాతే ఓ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లాం.  నివాస భవనాలకు 0.10 నుంచి 0.50 శాతం, వాణిజ్య భవనాలకు 0.20 నుంచి 2 శాతం పన్ను ఉండాలని నిర్ణయించాం. నూతన విధానం వల్ల పన్నులు పెరగకుండా, ప్రజల మీద అదనపు భారం పడకుండా, 15 శాతానికి మించకుండా పన్ను ఉండే విధంగా చట్టం చేశాం.  

అసెంబ్లీలో ఆస్తిప‌న్ను అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు బుచ్చయ్యచౌదరి ప్రశ్నిస్తే.. ఆయన అనుమానాలను అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేశాం. ఆస్తుల విలువ పెరిగితే దానిపై పన్నులు కట్టాల్సిందే కదా అని శాసనసభలోనే చెప్పాం. దీనిపై పూర్తిగా అవగాహన ఉండి కూడా నిద్ర నటిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయి. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలకు ఏది కావాలో అది చేస్తాం, ఏ ఒక్కరిపై భారం పడకుండా, ఇబ్బంది రాకూడదనే ఈ విధానం అమలు చేస్తున్నాం. 

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకాన్ని ఆనాడు వ్యతిరేకించిన పలు రాష్ట్రాలు కూడా ఇప్పుడు తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను కేంద్రం కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.10లక్షలు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. అయితే మమ్మల్ని కేంద్రం అనుసరిస్తోందని మేము చెప్పడం లేదు. కేంద్రం చెప్పింది కాబట్టే ఆస్తి పన్ను పెంచామంటూ మేము ఎక్కడా చెప్పలేదు. దీనిపై బీజేపీ నేత జీవీఎల్‌ నర్సింహారావు వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. 

ఈ రాష్ట్రంలో మొత్తం అసెస్‌మెంట్లు 33 లక్షల 67 వేలు ఉన్నాయి. వాటిపై వస్తున్న ఇంటిపన్ను రూ. 1242.13 కోట్లు, నూతన పన్ను విధానం వల్ల గరిష్టంగా 15 శాతం పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చేది రూ. 1428.45  కోట్లు. అంటే ప్రభుత్వానికి అదనంగా పెరిగే ఆదాయం రూ. 186 కోట్లే. ఎవరైతే 375 చదరపు అడుగుల ఇళ్ల‌ల్లో నివసిస్తారో వారికి ఏడాదికి పన్ను రూ.50 మాత్రమే. రాష్ట్రంలోని మొత్తం 33 లక్షల పన్ను అసెస్ మెంట్లలో సుమారు 4 లక్షల ఇళ్లు 375 చదరపు అడుగుల ఇళ్లే ఉన్నాయి. ఆ ఇళ్లకు ఆస్తి పన్ను కేవలం రూ.50 మాత్రమే. ఆ లెక్కన చూసుకుంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతుంది. ప్రభుత్వానికి నష్టం జరిగినా పేదవాడికి లాభం జరిగాలి అన్నదే ఈ ప్రభుత్వ విధానం. 

నూతన ఆస్తిపన్ను విధానంపై విశాఖ, తిరుపతి, విజయవాడలో బహిరంగ చర్చ పెట్టాలనుకుంటున్నాం. ఆస్తి పన్ను నూతన విధానం వల్ల లాభమా? నష్టమా..? ఈ విధానం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై చర్చ పెట్టాలనే ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని మేము ఏమీ చేయం. స్వతహాగా ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో చర్చించే ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటాం. 

ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఏపీని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అవలంభిస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టీడీపీకి లేదు. ఎన్నికల ముందు ఏం చెప్పామో, ఎన్నికలు అయ్యాక కూడా అదేవిధంగా ఉన్నాం. టీడీపీలా ఎన్నికలు ముగిసిన తర్వాత ఎలా వ్యవహరించేదో అందరికీ తెలుసు. ఊరూరా జన్మభూమి కమిటీలను పెట్టి, రాబందుల్లా టీడీపీ హయాంలో దోచుకున్నారో చూశాం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో, రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తుంది.  

ఎవరి సహకారం ఉన్నా లేకున్నా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కరోనా విపత్తులోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఆరోగ్యం మీద ప్రధానంగా దృష్టి పెట్టి.. రాబోయే 50 ఏళ్ల వరకూ, ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తు వ్యూహంతో వెళుతున్నాం. దళారులు, మధ్యవర్తులు, అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా, ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తోంది.
పేదవారి కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్. పేదవారి అవసరాలు, వారి అభివృద్ధికి ఏం చేయాలో ఆయనకు తెలిసినట్లు మరెవరికీ తెలియదు. పరిపాలన వికేంద్రీకరణపై.. ఏ రోజు అయితే శాసనసభలో మా ప్రభుత్వ విధానాన్ని ఆర్థిక మంత్రి చెప్పారో.. దాన్ని ముఖ్యమంత్రి సమర్థించి.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే మా ధ్యేయం అన్నారో అప్పటి నుంచే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే కొంతమంది దుష్టశక్తులు, దుర్మార్గమైన ఆలోచనలతో టీడీపీ నేతలు సాంకేతిక అంశాలతో న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంటున్నారు. సంకల్పం మంచిదైతే ఏదీ ఆగదు. ముఖ్యమంత్రి వైయ‌స్‌  జగన్ సంకల్పం అభివృద్ధికి సంకేతం` అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top