రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

మంత్రి బొత్స సత్యనారాయణ

సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనపై టీడీపీ, పచ్చ మీడియా అనవసర రాద్ధాంతం

టీడీపీకి నీచమైన ఆలోచనలు తప్ప..సూచనలు ఇచ్చే అలవాటు లేదు

విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం

పన్నులపై తప్పుడు ప్రచారం మానుకోండి

విశాఖ‌: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా చిలువలు పలువలు చేసి టీడీపీ, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేయడం అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వీటి గురించి ప్రతిపక్షం, పచ్చ మీడియా ఏ రోజు మాట్లాడవని తప్పుపట్టారు. పన్నులు పెంచుతున్నారని మీడియా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, పన్నుల వసూళ్లపై మూడు రాష్ట్రాల్లో అధ్యాయనం చేసిన తరువాత ప్రజలపై భారం పడకుండా పన్నులు పెంపు చట్టాన్ని చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించినట్లు గుర్తు చేశారు. వాస్తవాలు మరుగున పెట్టి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేయడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి బొత్స నత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ‌లోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

అనవసర రాద్ధాంతం
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ, పచ్చ మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది.  కావాలని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లడం సర్వసాధారణం. కేంద్రంతో ముడిపడిన అంశాలు, రాష్ట్రానికి అవసరమైన కార్యక్రమాలు, కోవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్రంతో తరచుగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు. అందులో భాగంగానే సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ ఢిల్లీ వెళ్లారు. ఇలాంటి సమయంలో ఒకరిద్దరు కేంద్ర మంత్రులు వారి కార్యక్రమాలను బట్టి  కలవకపోవచ్చు.  ఈ విషయంపై ఒక దురదృష్టకరమైన కార్యక్రమాన్ని టీడీపీ, దానికి ఒత్తాసు పలుకుతున్న మీడియాకు పని లేకుండా ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. 

ఒక్క సలహానైనా ఇచ్చారా?
సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లే సమయంలో ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒక మంచి సలహానైనా ఇచ్చిందా? ఇలాంటి సమయంలో  సలహాలు, సూచనలు చెప్పాలి. కానీ అలాంటి అలవాటు చంద్రబాబుకు, ఓ వర్గం మీడియాకు లేదు. ఎప్పుడు సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లి వచ్చినా..అధికారంలో వెళ్లినా, ప్రతిపక్షంలో వెళ్లినా ఎప్పుడైనా తప్పుడు ప్రచారాలు చేస్తోంది. 

కోవిడ్, టీకాలు గురించి ఎందుకు మాట్లాడరూ?
కరోనా మహమ్మారి, వ్యాక్సినేషన్‌ గురించి టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఇటీవల టీకాలుకు సంబంధించి ఏ వయసు వారికి ఇవ్వాలని కేంద్రం చెప్పింది. మాన్‌కి బాత్‌లో ఆ వివరాలు ప్రధాని వెల్లడించారు. కోవిడ్, వ్యాక్సిన్‌ గురించి ప్రతిపక్షాలు మాట్లాడటం లేదు. ఆనందయ్య మందులు ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరం.ప్రతి రోజు కోవిడ్‌ పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షలు నిర్వహిస్తున్నారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇలాంటి  వాటి గురించి ప్రతిపక్షాలు, మీడియా మాట్లాడటం లేదు. ఢిల్లీ వెళ్తున్నారంటే పనికి రాని మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వాటి గురించి రాయడం లేదు.

ఏ రైతును అడిగినా చెబుతారు.. 
 సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు విత్తనం నుంచి పంటలు కొనుగోలు చేసే వరకు తోడుగా నిలిచారు. రాష్ట్ర చరిత్రలో రైతులకు ఇంతగా అండగా నిలిచిన ప్రభుత్వం మాది. రైతుల వద్దకు వెళ్తే వారే ప్రభుత్వం గురించి చెబుతారు.గత ప్రభుత్వాలు చేయలేని కార్యక్రమాలు మా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తోంది. మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకుంటున్నాం. కాదు అని చంద్రబాబు నిరూపించగలరా?. ఊకదంపుడు, పనికిమాలిన మాటలు ప్రతిపక్షం మానుకోవాలి. వక్రభాష్యం చెబుతూ కాలం వెల్లదీయడం చంద్రబాబుకు సరికాదు.

15 శాతానికి మించకుండా పన్ను..
కొత్తగా పన్నులు పెంచారని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. పన్నులు పెంచారని మాట్లాడుతున్నారు. మీ మనసాక్షిగా చెప్పండి. ఎన్నికల ముందు పన్నుల గురించి ప్రకటన చేయలేదా?. గతంలో అసెంబ్లీలో తానే మాట్లాడాను. ప్రతిపక్ష సభ్యులు కూడా పన్నుల గురించి మాట్లాడారు కదా? ఈ రోజు మేం కొత్తగా తీసుకువచ్చినట్లు పత్రికలు కథనాలు రాస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే కార్యక్రమాలు చేస్తున్నాం. అద్దెపై పన్ను వేయడం లోపభూయిష్టంగా ఉందని, అవినీతిపరులకు అవకాశం ఇవ్వకూడదని, చిన్నవాడైనా, పెద్దవాడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా అందరికీ ఒకే ఆస్తి పన్ను వేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పక్కనున్న రాష్ట్రాల్లో పన్నుల విధానంపై పరిశీలించేందుకు మూడు కమిటీలు వేశాం. అక్కడ విధానాల గురించి అధ్యాయనం చేయమన్నాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పన్నులు వేయాలని నిర్ణయం తీసుకుంటున్నాం. అందరి అభిప్రాయాలు తీసుకుని అసెంబ్లీలో స్పష్టంగా మాట్లాడాం. ఇది వాస్తవం కాదా? కొత్తగా మేం చెప్పడం లేదే?

నివాసం ఉన్న భవనాలకు 0.10 నుంచి 0.50 వరకు, నివాసం కాని భవనాలకు 0.20 నుంచి 2 శాతం వరకు పన్నులు వసూలు చేస్తున్నాం. ప్రజలపై భారం పడటానికి వీల్లేదని, వారికి మంచి చేసేందుకు 15 శాతానికి మించకుండా పన్ను ఉండేలా చట్టాన్ని చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. ఆ ప్రకారమే చట్టం చేశాం. ఆ రోజు అసెంబ్లీలో టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ఎగ్జిస్టింగ్‌ పన్నులో మాత్రమే అంటే రూ.7500 మాత్రమే పన్ను పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు వివరణ ఇచ్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
 

ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం 

  విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చని తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు విశాఖ రాజధాని ప్రక్రియ షురూ అయిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో, ఎక్కడ్నించైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న విషయం అందరికీ అర్థమైందని మంత్రి బొత్స పేర్కొన్నారు.

Back to Top