పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అడ్డదోవలు

నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఎన్నికల బూత్‌లను మారుస్తారా?

ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ

పులివెందుల్లో పోలీసులు, కూటమి పాలకులు కుమ్మక్కయ్యారు

పోలీసుల ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడి

 దాడికి గురైనా వారిపైన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులా?

 మండిపడ్డ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ 

  రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి

 ప్రభుత్వ వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి

 రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగు

 ఎన్నికల కమిషన్ చిత్తశుద్దితో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి.

  బొత్స సత్యనారాయణ డిమాండ్

విశాఖపట్నం: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలుగుదేశం అన్ని అడ్డదోవలు తొక్కుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత పోలింగ్ కేంద్రాలను మార్చడం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో పోలీసులు, తెలుగుదేశం నాయకలు కలిసిపోయి పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి జరిగిందని ధ్వజమెత్తారు. ఈ దాడిలో బాధితులపైనే పోలీసులు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవలే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయి, జవాబుదారితనం లేదు, బాధ్యతారహితంగా పాలన సాగుతున్న వైనంపై వివరించాం. వైయస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో ఇష్టారాజ్యంగా అధికారపార్టీ వ్యవహరిస్తోంది. ఒక ఎమ్మెల్సీపై దాడి చేసి, ఆయనను హతమార్చేందుకు ప్రయత్నించారు. అటు టీడీపీ నేతలు, ఇటు పోలీసులు కుమ్మక్కై వైయస్ఆర్‌సీపీకి చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిపై ఈ కేసులు నమోదు చేశారు. ఇదేనా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాస్వామ్యం? 

ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తున్నారు

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తరువాత పోలింగ్ కేంద్రాలను మార్చడం ఎక్కడైనా ఉంటుందా? ఒక ఊరులోని ఓట్లను, వేరే హ్యామ్‌లెట్‌లో పెట్టడం సమంజసమా? దీనికి బదులు ఎన్నికల్లో తామే విజేతలమని ప్రకటించుకుంటే సరిపోతుంతుంది కదా? పులివెందుల జెడ్పీటీసీ గెలిస్తే ఏదో సాధించేస్తామని అనుకుంటే అది వారి అవివేకమే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత శాంతియుతంగా పోలింగ్ జరిగే వరకు చూడాల్సిన వ్యవస్థలు కలుషితమయ్యాయి. బైండోవర్లు, కష్టడీలు, కేసులు అంటూ వైయస్ఆర్‌సీపీకి చెందిన వారిని అదుపులోకి తీసుకుని ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకునేందుకు సిద్దమయ్యాయి. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంకు వెళితే, ఆయనపై పదివాహనాల్లో టీడీపీ గుండాలు వచ్చి, దాడి చేస్తుంటే పోలీసులు పట్టించుకోని పరిస్థితి. తిరిగి బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పరిణామాలను చూస్తున్న ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. ఎన్నికల కమిషన్, పోలీస్ యంత్రాంగం చిత్తశుద్ది ఉంటే ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోరుతున్నాం. 

రాష్ట్రంలో పాలన గాడితప్పింది

నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హత్యలు, కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలు, విచ్చలవిడిగా డ్రగ్స్, మహిళల మీద అఘాయిత్యాలు వంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. గత అయిదేళ్ళలో జరిగినవి, ఈ పద్నాలుగు నెలల్లో జరిగిన ఘటనలపై నివేదికలను ప్రజల ముందు పెట్టాలి. ప్రజలే ఎవరి పాలన సజావుగా సాగిందో నిర్ణయిస్తారు. విశాఖపట్నంలో జరుగుతున్న భూ దోపిడీపై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాం. విశాఖలో ఖరీదైన భూములను ఎలా దోచుకుంటున్నారో ఆ లేఖలో ప్రస్తావించి, దానిపై విచారణ జరపాలని కోరాం. నిత్యం మాపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, గత ప్రభుత్వంలో దోపిడీ చేశారని మాట్లాడుతున్న కూటమి నేతలు పద్నాలుగు నెలల్లో ఏ ఒక్కటైనా నిరూపించారా? విశాఖ, విజయవాడలో పబ్లిక్‌గా హత్యలు ఏ రకంగా జరిగాయో అందరికీ తెలుసు. పోలీస్ వ్యవస్థ అంటేనే ప్రజల్లో గౌరవం పోయింది. కూటమి పాలకులతో పోలీసులు కుమ్మక్కయ్యారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి ఏకంగా అయిదు కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డారు. ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయంటే, యథారాజా... తథాప్రజ... అనే నానుడిని గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా కొరతతో అన్నదాతలు రోడ్లెక్కారు. విద్యా, వైద్యాన్ని పూర్తిగా అటకెక్కించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రతిపక్షంగా మా పోరాటం సాగిస్తూనే ఉంటాం. 

మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ...

-  తనపై దాడికి కుట్ర జరుగుతోందని పులివెందుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ రెడ్డి తనకు ఉన్న సమాచారం మేరకే మాట్లాడారు. పోలీస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసిపోయారు.  

-  వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే విచారణ జరిపింది. అనాడు సీబీఐకి ఇవ్వమన్నా అంగీకరించలేదు. వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాతే సీబీఐకీ అప్పగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలలు అయ్యింది. ఏం చేశారు. రాజకీయంగా ఈ హత్యను వాడుకునేందుకే ప్రయత్నించారు తప్ప, దోషులకు శిక్ష పడేలా చేశారా?

Back to Top