అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి ప్రసాదంపై నిందారోపణలు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని బొత్స ఆరోపించారు. తమ స్వలాభం కోసం కొన్ని సంస్థలకు నెయ్యి టెండర్లు కల్పించాలనే ఉద్దేశంతో అసత్యాలు చెప్పారని విమర్శించారు. సీబీఐ నివేదికలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్‌తో ఒప్పందం చేసుకుని నెయ్యి సరఫరా చేసిందని, 2015–19 మధ్య కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఇందాపూర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, తర్వాత ప్రభుత్వం మారిన అనంతరం బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపి, అవే ట్యాంకర్లను మళ్లీ వినియోగించారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. సభలో చర్చించండి ఇందాపూర్–హెరిటేజ్ సంబంధాలపై సభలో చర్చించమని కోరినా, అధికార పక్షం దూరంగా ఉంటోందని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. “మేం చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి. కెమెరాలు ఉన్నాయిగా ఆధారాలు చూపండి” అంటూ సవాల్ విసిరారు. “మాకు దేవుడంటే విశ్వాసం ఉంది. దేవుడి పవిత్రతను మేం ఎప్పుడూ దెబ్బతీయలేదు” అని అన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, దేవుడి పేరుతో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుర్గా గుడి మెట్లు కడిగిన ఘటనను ప్రస్తావిస్తూ మత భావోద్వేగాలను రెచ్చగొట్టారని అన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, సీబీఐ నివేదికపై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, లడ్డూలో బాత్‌రూమ్ కెమికల్స్ కలిపారన్న వ్యాఖ్యలపై ప్రశ్నించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, నాలుగు రోజులుగా వాయిదా తీర్మానం అంగీకరించలేదని తెలిపారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, దేవుడి సొమ్మును స్వప్రయోజనాలకు వాడుకున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమి నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, లడ్డూ వివాదంపై సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. “మేం చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకోలేదు. నిరూపిస్తే పదవులకు రాజీనామా చేస్తాం. లేకపోతే అధికార పక్షం క్షమాపణ చెప్పాలి” అంటూ విపక్ష సభ్యులు సవాల్ విసిరారు.