అమరావతి: పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి, అసత్య ప్రచారాలను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, బడ్జెట్ లోని డొల్లతనాన్ని ఎండగట్టారు.తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని గతంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని బొత్స విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ నివేదికతో చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. దేవుడి నైవేద్యాన్ని కూడా వదలకుండా తన 'ధనదాహం' కోసం అపచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే గతంలో కిలో రూ.320కే లభించిన నెయ్యిని, ఇవాళ చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ తో సంబంధాలున్న ఇందాపూర్ డెయిరీ ద్వారా కిలో రూ.700 కు సరఫరా చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని బొత్స నిలదీశారు. రూ.320 నుంచి రూ.700 కు ధరను రెట్టింపు చేయడం వెనుక ఉన్న అవినీతిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా వట్టి డొల్ల అని తేల్చి చెప్పారు. సభలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే ప్రభుత్వం చర్చకు రావడం లేదన్న బొత్స సత్యనారాయణ.. దమ్ముంటే పూర్తిస్థాయి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... ● హెరిటేజ్ కోసమే చంద్రబాబు నెయ్యి నాటకం... పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు కలిసిందని అభాండాలు వేసిన సీఎం చంద్రబాబు ఆరోపణలు సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ నివేదికతో పచ్చి అబద్ధాలని తేలిపోయింది. చంద్రబాబు తన ధనదాహం, దుర్భుద్ధితో దేవదేవుడి నైవేద్యాన్ని ఆసరాగా పెట్టుకుని కేవలం రూ.320 కే కొంటున్న కేజీ నెయ్యిని, హెరిటేజ్ తో సంబంధాలున్న ఇందాపూర్ డెయిరీ ద్వారా సరఫరా చేస్తూ దోచుకుతింటున్నారు. గడిచిన వారం రోజులుగా ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ అంశం మీద చర్చించాలని మేం శాసనమండలిలో పట్టుబట్టాం. హోంమంత్రి అనిత ఒక నిమిషం పాటు కల్తీ నెయ్యి గురించి మాట్లాడారు. మేం కూడా దానిపై చర్చించాలన్నాం. వాస్తవాలు అందరికీ తెలుస్తాయి? సీబీఐ తన నివేదికలో ఏం చెప్పిందో కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం స్వామి వారి డబ్బులను ఏ విధంగా కైంకర్యం చేస్తున్నారో వాటిపైనా చర్చించమని కోరుతున్నా వారు రావడం లేదు. ● హామీల ఊసే లేని డొల్ల బడ్జెట్... మరోవైపు ప్రభుత్వం ఒట్టి డొల్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రజల అవసరాలను తీర్చడంలోనూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఊసు కూడా లేకుండానే బడ్జెట్ ను రూపకల్పన చేశారు.వాటిపైనా చర్చిద్దాం అంటే కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దాటవేత ధోరణిలో కాలయాపన చేస్తోంది. కేవలం బురద జల్లి వారినే తుడుచుకోమంటూ చేతులు దులుపుకుంటోంది. ఇవాళ హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డెయిరీతో చీకటి ఒప్పందం చేసుకుని దోచుకుతింటోంది. ఇది ముమ్మాటికీ వాస్తవం. దీనిపై చర్చిద్దామంటే ఎందుకు ముందుకు రావడం లేదు? గతంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన మీరు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదు? ● చర్చకు రాని ప్రభుత్వం... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా మా డిమాండ్ ఒక్కటే ఒకవైపు నెయ్యి పేరుతో జరుగుతున్న దోపిడీపై చర్చిస్తూనే ప్రజాసమస్యలపై కూడా చర్చ నిర్వహించాలి. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపభూయిష్టంగా ఉంది. రూ.3.35 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ రూపకల్పన చేసి, అందులో రూ.90 వేల కోట్ల లోటు బడ్జెట్ పెట్చినా.. అందులో రైతులు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులతో పాటు ఏ ప్రజల అవసరాలను తీర్చడంలోనూ, సూపర్ సిక్స్ హామీల అమలు చేయడంలోనూ ప్రభుత్వం సఫలీకృతం కాలేదు. వీటిని బడ్జెట్ లో చూపించకుండానే బడ్జెట్ తయారు చేశారు. వీటన్నింటిపై చర్చించకుండానే కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడంపైనే దృష్టి పెట్టారు. వైయస్సార్సీపీ చెబుతున్న అంశాల్లో తప్పు ఉంటే... చర్చించాలని కోరుతున్నాం. చంద్రబాబు వ్యాఖ్యలు, కూటమి నేతలు మాట్లాడిన మాటలు, అసలు వాస్తవాలు అన్నింటినీ చూపిస్తాం. ఇప్పటికే హెరిటేజ్ సంస్థకు, ఇందాపూర్ డెయిరీకి ఉన్న లింకులు, అనుబంధాలపై ఇప్పటికే ఆధారాలతో సహా వివరించాం. దీంతో నిన్న సాయంత్రం టీటీడీ నుంచి వివరణ ఇప్పించారు. దానికి బదులు నేరుగా సభలో చర్చించాలంటే మాట్లాడ్డం లేదు. ముందుకు రావడం లేదు. నిరంతరం తప్పుడు ప్రచారం, దోచుకోవడం దీనికోసం అవినీతి...ఇదే లక్ష్యంగా పాలన సాగుతోంది. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో మీరు నియమించిన సిట్ అధికారుల నివేదికలోనే వాస్తవాలన్నీ బయటపడ్డాయి. ● ప్రభుత్వ దోపిడీపై బీజేపీ మౌనం వీడాలి... అన్నింటికన్నా ముఖ్యమైన అంశం. ఇంతవరకు రూ.320 నుంచి రూ350 వరకు కొన్న నెయ్యిని రూ.700 కు పెంచి రెట్టింపు చేశారంటే ఎంత అవినీతి జరిగిందో అర్ధం అయింది. ఇదే విషయం ప్రశ్నిస్తే పాల ధరలు పెరిగాయని చెబుతున్నారు. వాస్తవానికి రూ.320 కేజీ నెయ్యి ఏ సంవత్సరం కొనుగోలు చేశారు? అప్పుడు పాల ధర లీటర్ ఎంతుంది? రూ.700 కేజీ నెయ్యి కొంటున్నప్పుడు లీటర్ పాలధర ఎంత ఉంది? దీని చర్చించడానికి సిద్దమా? మీ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుని మీ సొంత సంస్థలకు దోచిపెడుతుంటే ప్రజలు అమాయకులనుకుంటున్నారా? చంద్రబాబు గారూ? మీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. మీకు చిత్తశుద్ది ఉంటే, మీరు ఆ రోజు సీఎం చంద్రబాబు తన మాటల మీద నిలబడి ఉంటే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన మాటలమీద కట్టుబడి ఉంటే చర్చకు రండి. భారతీయజనతాపార్టీ నేతలను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. నెయ్యి పేరుతో చంద్రబాబు సొంత సంస్థకు అడ్డగోలుగా దోచిపెడుతున్న వైనాన్ని సమర్ధిస్తారా? మీ నోటికొచ్చినట్లు మాట్లాడి... కల్తీ జరిగిందని ఆరోపించి... దాన్ని సాకుగా చూపించి రెట్టింపు ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ను మీ సొంత సంస్థలకు కట్టబెట్టి దోచుకోవడం దురదృష్టకరం. ప్రజలు ఆస్తులకు రక్షకులుగా ఉండాల్సిన వాళ్లు.. ప్రభుత్వ పెద్దలే ఇలాంటి తప్పులు చేస్తుంటే అధికారంలో కొనసాగే హక్కు ఉంటుందా? చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. కోట్లాది మంది ప్రజలు మీ బడ్జెట్ మీద వారికి ఏం మేలు చేయబోతున్నారన్న దానిపై ఆశగా ఎదురుచూస్తున్నారు. మీ బడ్జెట్ లో ఏ వర్గానికీ మేలు జరగలేదు కాబట్టి... వాటి నుంచి డైవర్ట్ చేయడానికే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ కూడా తప్పుడు ఆరోపణలు చేశారు. నెయ్యి కొనుగోలు లో ఇందాపూర్ డెయిరీ ని అడ్డం పెట్టుకుని తన సొంత హెరిటేజ్ కు చేస్తున్న దోపిడీ బయటపడింది. లడ్డూ ప్రాశస్త్యాన్ని అపచారం చేసింది చంద్రబాబు మాత్రమేనని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. బడ్జెట్ పై ఇకనైనా చర్చకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.