తాడేపల్లి: ఏపీలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసినట్లుగానే.. రాత్రీ పగలు కష్టపడే పోలీస్ కానిస్టేబుళ్లను కూడా కూటమి ప్రభుత్వం ఘోరంగా వంచించిందని వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. కానిస్టేబుళ్లకు ఇవ్వాల్సిన 6 సరెండర్ లీవులు, వేల రూపాయల టీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు ఆంధ్రుల ఆస్తి అయిన బందరు పోర్టును తెలంగాణకు అప్పగించడానికి చీకటి ఒప్పందాలు చేసుకుంటోందని ధ్వజమెత్తారు. అలాంటి ఆలోచన చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..: కానిస్టేబుళ్లకు అన్నీ కోతలే!: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సజావుగా సాగాలన్నా, వీఐపీల పర్యటనలు జరగాలన్నా కానిస్టేబుళ్లే కీలకం, అలాంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 6 సరెండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయి. జగన్‌గారి హయాంలో రెండు దఫాలుగా (జూన్, నవంబర్) సరెండర్ లీవులు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు లీవులను కూడా ’వన్ బై టు’గా మార్చేశారు. గత నవంబర్ బకాయిలను ఎగ్గొట్టి జనవరిలో ఇచ్చి కాలయాపన చేశారు. నేటికీ 6 సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయి. లా అండ్ ఆర్డర్‌లో పనిచేసే పోలీసులకు నెలకు రూ.1,500 చొప్పున రెండేళ్లకు గానూ రూ.72 వేలు బకాయిలు పెట్టారు. ఏపీఎస్పీ, ఏఆర్ రిజర్వ్ కానిస్టేబుళ్లకు ఏడాదికి రూ.36 వేల చొప్పున ప్రభుత్వం ఎగ్గొట్టింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టార్గెట్లు.. పోలీసులకు పీడకల: చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను కేవలం బ్రాందీ షాపుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు కనీసం 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని, టార్గెట్ రీచ్ కాకపోతే కానిస్టేబుళ్లను వెకెన్సీ రిజర్వ్ (వీఆర్) కు పంపుతామని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, హెల్మెట్ కేసులపై అవగాహన కల్పించకుండా కేవలం పెనాల్టీల కోసమే ఒత్తిడి తెస్తూ, మట్టి నుంచి నూనె తీసినట్లు ప్రతిదీ వ్యాపారంగా మార్చేశారు. ఎన్నికల హామీలు ఏమయ్యాయి బాబూ?: ఎన్నికల ముందు పోలీసులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. కానిస్టేబుళ్లకు పెళ్లి రోజు, భార్య పుట్టినరోజు నాడు సెలవులు ఇస్తామన్నారు. ఇప్పటికే రెండు పెళ్లి రోజులు గడిచిపోయినా సెలవుల ఊసే లేదు. పోలీసులకు ’వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇస్తామని చెప్పి ఘోరంగా వంచించారు. సెలవుల మాట అటుంచితే కనీసం కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. జీఓ:329 అమలు చేయాలి. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలి: ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.అడవులు, కొండల్లో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను ఏఆర్ లోకి బదిలీ చేయాలనే జీఓ నెం:329 ను ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. 20 ఏళ్లు దాటినా వారు బెటాలియన్లలోనే మగ్గిపోతున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద చదువులు (Mఅ, M.ఇౌఝ, ఆ.ఉఛీ) చదివిన కానిస్టేబుళ్లతో బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థ పేరుతో అధికారుల ఇళ్లల్లో ఇల్లు, తోట, సిమెంట్ పనులు వంటి వెట్టిచాకిరి చేయిస్తున్నారు. రిటైర్ అయిన ఐపీఎస్ అధికారుల ఇళ్లల్లో కూడా ఈ బానిస చాకిరి కొనసాగడం ఘోరం. దివంగత నేత వైయస్సార్ హయాంలో ఇచ్చిన జీఓ:404 ప్రకారం ఆర్డర్లీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలి. ఉప్మా మంత్రి పవన్ కళ్యాణ్. హోంమంత్రి అనిత వైఫల్యాలు: ‘తాను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటూ ఓట్లు అడిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉప్మా మంత్రిలా మారారు తప్ప కానిస్టేబుళ్ల బాధలు పట్టించుకోవడం లేదు. అర్జీలు పట్టుకెళ్తే నా శాఖ కాదంటున్నారు.హోంమంత్రి వంగలపూడి అనితకు హోం శాఖ తప్ప అన్ని విషయాలపై పట్టింపు ఉంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలైనా పట్టించుకోకుండా కేవలం వైయస్ జగన్ గారిని దూషించడానికే పరిమితమయ్యారు.మంత్రులందరికీ కేటాయించిన శాఖలు కాకుండా వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్యాబినెట్ తీరు అత్యంత దుర్భరంగా ఉంది. బందరు పోర్టు అమ్మితే ఊరుకోం: ‘బందరు పోర్టును తెలంగాణకు అమ్మడానికి చంద్రబాబు నాయుడు ఎవరు? అది ఖర్జూరపు నాయుడు సొంత ఆస్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకట్లో లాలూచీ పడి, ఈ పోర్టును తెలంగాణకు అప్పగించాలని చూస్తున్నారు. బందరు పోర్టు వైపు ఎవరు కన్నెత్తి చూసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో పోరాటం తప్పదు.‘ రాజ్యసభ స్థానాల్లో ’సేమ్ కాస్ట్’ రాజకీయం: టీడీపీ రాజ్యసభ స్థానాల కేటాయింపుపై జరుగుతున్న చర్చపై స్పందించిన పేర్ని నాని, సీఎం చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఓసీ, బీసీలతో పాటు ఇద్దరు ’ఎస్సీ’లకు కూడా సీట్లు ఇచ్చారని, అయితే ఆ ’ఎస్సీ’ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ కాదు.. తన ’సేమ్ కాస్ట్’ (సొంత కులం) అయిన భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేశ్‌లకు ఇచ్చుకున్నారని, దానికి ఎస్సీలు సరిపెట్టుకోవాలంటూ చంద్రబాబు దళిత ద్రోహి అని పేర్ని నాని స్పష్టం చేశారు.