బాబు హయాంలోనే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ

గతానికి, ప్రస్తుతానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

మహిళా భద్రత, సంక్షేమం, సాధికారతకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారు

హోంశాఖ మంత్రి తానేటి వనిత

సచివాలయం: మహిళా భద్రత కోసం సీఎం వైయస్‌ జగన్‌ అనేక చర్యలు చేపట్టారని, దిశ చట్టం, యాప్, జీరో ఎఫ్‌ఆర్‌ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. నిజానికి చంద్రబాబు పాలనలోనే మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువ అని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో గత చంద్రబాబు పాలనకు, ప్రస్తుత సీఎం వైయస్‌ జగన్‌ పాలనకు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మహిళ భద్రత, సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఎలాంటి పాలన అందిస్తున్నారనేది గడిచిన మూడేళ్లుగా ప్రజలకు స్పష్టం కనిపిస్తుందన్నారు. సచివాలయంలో మంత్రి తానేటి వనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చివరి మూడేళ్లు 2016–19 వరకు మహిళలపై జరిగిన నేరాల వివరాలు.. ప్రస్తుత ప్రభుత్వంలో గడిచిన మూడేళ్లు (2019–22 మధ్య వరకు)లో నమోదైన కేసుల వివరాలు గమనిస్తే తేడా సుస్పష్టంగా కనిపిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో మహిళలపై జరిగే నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి తానేటి వనిత నంబర్లతో సహా వివరించారు. 

గత ప్రభుత్వంలో చివరి మూడేళ్లలో రేప్, హత్యలు 34 జరిగితే.. ప్రస్తుతం 33 జరిగాయని, గత ప్రభుత్వంలో గ్యాంగ్‌ రేప్‌లు 71 జరిగితే.. ఇప్పుడు 69 నమోదయ్యాయని, మహిళా హత్యలు అప్పుడు 79 జరిగితే.. ఈ మూడేళ్లలో 68 జరిగాయని, చంద్రబాబు పాలన చివరి మూడేళ్లలో వరకట్న వేధింపులతో 456 మంది మహిళలు చనిపోతే.. ఈ మూడేళ్లలో ఆ సంఖ్య 358కి తగ్గిందని, వరకట్న హత్యలు బాబు పాలనలో 28 జరిగితే.. ఇప్పుడు 14కు తగ్గాయని హోంమంత్రి వివరించారు. 

కేసులు తగ్గడమే కాకుండా.. నమోదైన కేసులు విచారణ చేయడంలో గత ప్రభుత్వానికి, వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి చాలా తేడా ఉందన్నారు. చంద్రబాబు మహిళల భద్రత కోసం ఆరోజున ఎలాంటి చట్టాలు, యాప్‌లు, జీరో ఎఫ్‌ఐఆర్‌లు తీసుకురాలేదని చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ మహిళా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా, ఎక్కడైనా ఇబ్బందిపడితే.. ఆ మహిళకు తోడుగా ఉండేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ తీసుకువచ్చామన్నారు. 

చంద్రబాబు పాలనలో రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసు విచారణకు 222 రోజుల సమయం పడితే.. ఈరోజున సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో 58 రోజుల్లోనే విచారణ సమగ్రంగా పూర్తిచేస్తున్నామన్నారు. గ్యాంగ్‌ రేప్‌ కేసులో దర్యాప్తునకు 250 రోజులు పడితే.. ఇప్పుడు 37 రోజుల్లోనే పూర్తిచేస్తున్నామని, నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. 
 

Back to Top